Sakshi News home page

ముగిసిన సుధాకర్‌ దంపతుల ప్రస్థానం

Published Sat, Apr 20 2024 1:25 AM

మృతదేహాల వద్ద నినాదాలు చేస్తున్న 
వివిధ సంఘాల నాయకులు  - Sakshi

చిట్యాల: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు ప్రస్థానం శుక్రవారం నాటికి ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేడ్‌ జిల్లా మాడ్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు, అతని భార్య సుమన అలియాస్‌ రజిత మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున చల్లగరిగెకు మృతదేహాలను తీసుకొచ్చారు. గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర నాలుగు గంటల పాటు సాగింది. అనంతరం ముచినిపర్తి గ్రామ శివారులో మావోయిస్టు దంపతుల మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. అంత్యక్రియల నేపథ్యంలో పోలీస్‌ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది.కాగా, 25 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన సుధాకర్‌ మధ్యలో ఏనాడూ ఊరిలోకి రాలేదని, శవమై తిరిగొచ్చాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

బూటకపు ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులను అన్యాయంగా కాల్చి చంపుతున్నారని ఇది ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటర్‌ అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు.

ప్రజా బిడ్డలకు చావు లేదు

ఉద్యమంలో చనిపోయిన సుధాకర్‌– సుమన దంపతులు ప్రజా బిడ్డలేనని వారికి ఎప్పటికీ చావు లేదని.. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హత్యకాండను పోత్సహిస్తుందని ఆరోపించారు. నివాళులర్పించిన వారిలో శాంతక్క, శోభ, శ్రీపతి రాజగోపాల్‌, గుమ్మడి కొమురయ్య, అంజన్న, మార్వాది సుదర్శన్‌, హుస్సేన్‌, విరసం నేతలు, బంధుమిత్రులు ఉన్నారు.

ప్రజా బిడ్డలకు చావులేదు:

ప్రజాసంఘాల నాయకులు

చల్లగరిగెలో అంత్యక్రియలు పూర్తి

Advertisement

homepage_300x250