Kakinada
-
హామీలు మర్చిపోతే ఎలా?
ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని నమ్మి మేము ఓట్లు వేశాం. ఇప్పుడు వాటిని మర్చిపోతే ఎలా. నేతన్న నేస్తం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లబ్ధి పొంది నిలదొక్కుకున్నాయి. అలాంటి నేతన్న నేస్తం అందక పోతే చాలా నేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాయి. నెరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వకూడదు. ప్రస్తుతం నేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. వాటిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోపోవడం దురదృష్టకరం. – దౌడురి భాస్కరరావు, చేనేత కార్మికుడు, తాటిపర్తి, గొల్లప్రోలు మండలం -
మమ్మల్ని పట్టించుకునే వారు లేరు
నష్టమైనా, కష్టమైనా చేనేతనే నమ్ముకుని కుటుంబాలను పొషించుకుంటున్నాం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం ఇచ్చి ఏటా సాయం అందించడంతో మాకు కొండంత అండగా ఉండేది. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో మాకు ఉపాధి తగ్గుతూ వస్తోంది. పడుగు ధర రెండేళ్లతో పోల్చుకుంటే రెట్టింపు అయింది. కిలో పడుగు ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. నేతకు ఉపయోగించే ముడి సరుకు ధరలు విపరీతంగా పెదరగడంతో గణనీయంగా ఉపాధి తగ్గిపోయింది. రోజంతా కుటుంబం మొత్తం కష్టపడితే రూ.300 మించి కూలీ కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడం దారుణం. – గుండారపు పార్వతి, నేత కార్మికురాలు, వాకతిప్ప, కొత్తపల్లి మండలం -
శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టరు షణ్మోహన్ అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం ఆయన స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయంలో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గోదావరి కాలువలో భక్తులు స్నానాలు చేసే రేవు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులను పరిశీలించారు. ఆలయంలోనికి ప్రవేశించే క్యూ లైన్ల విధానాన్ని ఈఓ బళ్ల నీలకంఠంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఐపీల పేరుతో ఘర్షణలకు దిగితే సహించేది లేదన్నారు. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గం నుంచి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలను వ్యతిరేకిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులకు తాగునీరు అందే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్తు సరఫరా నిరంతరం ఉండాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులకు భోజనాలు పెట్టే దాతలకు ఒక ప్రదేశం కేటాయించాలన్నారు. మహాశివరాత్రి రోజున పోలీసుతో పాటు ఇతర సెక్యూరిటీ సిబ్బందితో భక్తులకు సేవలందించే విధంగా చూడాలన్నారు. రథోత్సవం రోజున ఎమ్మెల్సీ పోలింగ్ ఉండటంతో అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా భారీ వాహనాలు పట్టణానికి దూరంగా నిలిపి వేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, అసిస్టెంట్ కమిషనర్ దుర్గాభవానీ, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, జిల్లా అగ్నిమాపక సహయాధికారి ఎం. శ్రీహరిజగన్నాథ్, పెద్దాపురం అగ్నిమాపక అధికారి ప్రసాద్, డీఎస్పీ డి.శ్రీహరి రాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీఓ కె హిమామహేశ్వరీ, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు పాల్గొన్నారు. -
మాస్టర్ ప్లాన్‌కు సూచనలు ఇవ్వండి
కాకినాడ సిటీ: కోరంగి వైల్డ్‌లైఫ్ అభయారణ్యం ఎకో–సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధిత అధికారులు తమ సూచనలు, సలహాలు అందించాని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ జిల్లా అటవీశాఖ అధికారి డి.రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి కోరంగి వైల్డ్ లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీపై అటవీ, రెవెన్యూ, మత్స్య, భూగర్భ జలాలు, పశుసంవర్థక, ఉద్యాన, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే ఇతర శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డీఎస్వో రవీంద్రనాథ్‌రెడ్డి కోరంగి వైల్డ్‌లైఫ్ అభయారణ్యం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 26 కిలోమీటర్లు దూరం వరకు ఎకో–సెన్సిటివ్ జోన్ ఉంటుందన్నారు. ఈ జోన్ వల్ల వన్యప్రాణుల స్వేచ్ఛకు, మనుగడకు మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. పర్యావరణ సమతుల్యత నెలకొని పచ్చదనం పెంపొందడంతో పాటు సేంద్రీయ వ్యవసాయానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ జోన్ పరిధిలో వర్షపు నీటిని వివిధ పద్ధతుల్లో నిల్వ చేసుకొని జంతువులకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎకో–సెన్సిటీవ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయరు చేయనుందని దీనికి సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తమ సూచనలు, సలహాలు అందించాల సూచించారు. ఈ సమావేశంలో తిరువనంతపురం సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ టీవీ వినోద్, హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ రీజనల్ డైరెక్టర్ కె జయచంద్ర, పశుసంవర్థకశాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశరరావు, మత్స్యశాఖ అధికారి కె కరుణాకర్‌బాబు, గ్రౌండ్ వాటర్ డీడీ పి రాధాకృష్ణ, కాకినాడ అటవీశాఖాధికారి శ్రీదీప్తి, కోరంగి వైల్డ్‌లైఫ్ అటవీ అధికారి ఎస్ఎస్ఆర్వీ వరప్రసాద్ పాల్గొన్నారు. -
ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి
కాకినాడ లీగల్: స్టాం్ప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా కె.ఆనందరావు వ్యక్తిగత కారణంగా 15 రోజులు సెలవు పెట్టారు. ఆయన స్థానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న జె.జయ లక్ష్మిని కాకినాడ జిల్లా ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అన్నవరం ఆలయానికి కోడ్ నుంచి మినహాయింపు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. సజావుగా ఎమ్మెల్సీ పోలింగ్ కాకినాడ సిటీ: ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సెక్టార్, రూట్ అధికారులు సమర్థంగా పని చేయాలని ఏఆర్వో డీఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశపు మందిరంలో సెక్టార్, రూట్ అధికారులు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఏఆర్వో జె వెంకటరావు హాజరై కాకినాడ, పెద్దాపురం ఆర్టీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణితో కలిసి అధికారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలో 70,540 మంది ఓటర్లకు 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 21 సెక్టార్ అధికారులను నియమించామన్నారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు కాకినాడ సిటీ: తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్న దృష్ట్యా కాకినాడ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163(2) ప్రకారం ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ గుమికూడడం నిషిద్ధమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు పెట్టకూడదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించామని కలెక్టర్ వివరించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా తిరగడం చేయకూడదన్నారు. నేడు పీఆర్జీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై విచారణ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం కళాశాలలో విచారణ చేపట్టనున్నారు. కళాశాలలకు చెందిన రిటైర్డ్ అధ్యాపకుడు కళాశాల నిధులతో పాటు పరీక్ష విభాగంలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ విద్యా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. గత ఏడాది నవంబర్ 4న ఆర్జేడీ శోభారాణి కమిటీ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేయగా సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ విచారణ చేపట్టనున్నారు. -
క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్‌పై 7–1 స్కోర్‌తో ఛత్తీస్‌గఢ్ సెక్టార్, ఆర్బీఎస్ భువనేశ్వర్‌పై ఆర్బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్బీఎస్ ఛండీగఢ్‌పై ఆర్బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్‌పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్‌తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్‌పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్‌తో, కేరళ సెక్టార్‌పై ఛత్తీస్‌గఢ్ సెక్టార్ 13–0 స్కోర్‌తో, మధ్య ప్రదేశ్ సెక్టార్‌పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్‌తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్‌లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు. -
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్‌బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్‌చరణ్, జి.జగన్ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్. మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ. -
రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్–1 ఆర్వీ రామారావు, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్–2 పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్చార్జి డీఐజీగా నియమించారు. అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి. -
అర్ధరాత్రి దొంగల హల్చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్‌తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్‌లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు – రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్‌లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్‌పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు. -
రూ.3.60 లక్షల ఎరువుల సీజ్
పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు. కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు. -
టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్‌గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్‌కు పోటీ పడతారా? వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
డీఈఓ సలీం బాషా సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని డీఈఓ షేక్ సలీం బాష ఉపాధ్యాయులు, ఎంఈఓలకు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. టెన్నికాయిట్ పోటీలకు సర్వం సిద్ధం గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్ఎం ఎస్ఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు. -
ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్‌బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుమచ్చ లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణ చర్యలు ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్ బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు.. లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. 300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులుఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది. -
ఏమీ లేదనిపింఛెన్..
కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.అర్జీలు.. బుట్టదాఖలుకొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్ లేదు, సూపర్–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.వలంటీర్ వ్యవస్థకు మంగళంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.3,112 పింఛన్ల కోతకూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్‌లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా పింఛన్ మంజూరయ్యేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.