
● అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల బుక్‌లెట్ ● జిల్లాల
అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల బుక్‌లెట్
జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ కేంద్రాల ఏర్పాటు
గొల్లపల్లి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి.. పూర్వ పద్ధతిలో మార్కులు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అడిషనల్స్ అవసరం లేకుండా 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్‌లెట్‌లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. వచ్చే నెల 21 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు 337 ఉన్నాయి. ఇందులో పదో తరగతి విద్యార్థులు 11,855 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రశ్నపత్రంతోపాటు ఓఎంఆర్ షీట్, జవాబు రాసేందుకు నాలుగు పేజీలు ఇచ్చేది. అందులో జవాబులు రాయడం పూర్తయ్యాక అడిషనల్ షీట్ ఇచ్చేవారు. అయితే అడిషనల్ షీట్ అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్‌లెట్‌ను తీసుకొస్తున్నారు. జవాబులన్నీ ఆ బుక్‌లెట్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
నాలుగుచోట్ల..
జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్‌లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్ పట్టణ కేంద్రాల్లో ఇవి ఉన్నాయి. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్‌లెట్‌లను తీసుకెళ్లనున్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు
పదోతరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఈ సారి విద్యార్థులు జవాబులు రాసేందుకు బుక్‌లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తరచూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు. – రాము, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment