Wanaparthy
-
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతలబైలు, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు.. లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైలు,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
కస్తూర్బా విద్యాలయం తనిఖీ
చిన్నంబావి: మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం మండల ప్రత్యేకాధికారి రఘునాథ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి తీసుకుంటున్న జాగ్రత్తలు, మెనూ అమలును అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, రికార్డులను పరిశీలించారు. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితరాలపై ఆరా తీశారు. అలాగే మండలంలోని కొప్పునూరు ఎస్సీ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయొద్దు వనపర్తి టౌన్: ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం నిబంధనలకు విరుద్దమని పుర శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి అన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో భాగంగా బుధవారం ఆయన పుర సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించగా చాలా దుకాణాలకు లైసెన్స్ లేదని గుర్తించారు. కలెక్టరేట్ మార్గంలో ఉన్న దుకాణాదారులు కూడా టేడ్ర్ లైసెన్స్ తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కొందరు దుకాణాదారులు గడువు కావాలని కోరగా, మరికొందరు లైసెన్స్ ఫీజు అధికంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు దుకాణదారులు లైసెన్స్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, అలాంటి వారికి నోటీసులిచ్చామని, గడువు ముగిసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల కొలతల ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూలు ప్రక్రియ వేగవంతం చేశామని, రోజు రూ.లక్ష లక్ష్యంగా కాగా అందుకు చేరువగా వసూలు చేస్తున్నామన్నారు. పుర సిబ్బంది చేతికి డబ్బులు ఇవ్వొద్దని.. ఆన్లైన్లో చెల్లింపులు చేసి వెంటనే రసీదు పొందవచ్చని సూచించారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన అడిషనల్ కమాండెంట్ వనపర్తి విద్యావిభాగం: మండలంలోని చిట్యాల సమీపంలో ఉన్న చేయూత అనాథ ఆశ్రమంలోగల వృద్ధాశ్రమానికి బుధవారం 10వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ జయరాజ్, అసిస్టెంట్ కమాండెంట్ పి.శ్రీనివాసులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను అభినందించి నిత్యావసర సరుకులు అందజేశారు. వారి వెంట రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్పీ సింగ్, ఆర్ఎస్ఐ శ్రీకాంత్, బోజ్యానాయక్, ఏఆర్ఎస్ఐ జయవర్ధన్చారి, భీమయ్య, అశోక్, రవీంద్రనాయక్, సుధాకర్ తదితరులు ఉన్నారు. మన్యంకొండ హుండీ లెక్కింపు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను లెక్కించగా.. రూ. 32,39,301 ఆదాయం వచ్చింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ముగిసింది. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు వెంకటాచారి, శ్రావణ్‌కుమార్, మంజుల, సుధ, ఐడీబీఐ మేనేజర్ రాజవర్దన్‌రెడ్డి, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ తప్పనిసరి
వనపర్తి: జిల్లాలోని ఇసుక రీచ్‌లపై ఆయా ప్రాంతాల తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం వై–శాఖాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ను, రాంపురం గ్రామ శివారులో అధికారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు చేసినా, సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాంపురంలో ఇసుక నిల్వల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి.. జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా నిర్మాణం చేసుకునే వారికే పథకం వర్తిస్తుందని.. ఇదివరకు సగం నిర్మించుకున్న వారికి వర్తించదని వివరించాలని సూచించారు. ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయంలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, తహసీల్దార్లు సైతం దగ్గర్లోని రీచ్ నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. విడతల వారీగా నగదు ప్రభుత్వం నుంచి వస్తుందని వారికి స్పష్టంగా తెలియజేయాలని కోరారు. మిగతా గ్రామాల్లో కూడా పథకం ఏ క్షణమైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. అర్హుల జాబితాను మరోమారు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులు జాబితాలో లేకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలు రానివ్వొద్దు.. వేసవి సమీపిస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో స్థానికంగా ఉండే బోర్లను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లోని బోర్లుమోటార్లు, చేతిపంపులు పనిచేయకుండా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిట్యాంకులు పరిశుభ్రంగా ఉండాలని, పదిరోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. ట్యాంకర్లను సైతం అవసరానికి అనుగుణం సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
గోపాల్పేట: మండలంలోని చెన్నూరుకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించి మార్చి 15 నాటికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కోరారు. బుధవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా చెన్నూరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి ఆవరణను పరిశీలించారు. మురుగు సమస్యను వెంటనే పరిష్కరించాలని, మెనూ విధిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బుద్దారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీచేసి వంటగదిని పరిశీలించారు. బియ్యం, కూరగాయలు చూసి మెనూ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధన వివరాలు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం తాడిపర్తిలో వైకుంఠధామాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి నీటి సరఫరా, ఇతర సమస్యలపై ఆరా తీశారు. నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఇతర మండలాల అధికారులు ఉన్నారు. మార్చి 15 నాటికి బేస్మెంట్ లెవల్ పూర్తికావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ -
సక్రమంగా ఇస్తేనే వెళతాం..
ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం స్వచ్ఛందంగా తరలింపు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ ● -
22న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రాక
ఖిల్లాఘనపురం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 22న మండలానికి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఖిల్లాఘనపురం, గోపాల్పేట మండలాలకు దూరమవుతున్నందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు పెద్దమందడి, ఖిల్లాఘనపురం రెండు మండలాలకు కలిపి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షాపురం గ్రామానికి వెళ్లే కూడలి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌యార్డు ఏర్పాటుకు మంత్రి భూమిపూజ చేస్తారని వివరించారు. అలాగే గోపాల్‌పేటలో కూడా మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మండలానికి వ్యవసాయ మార్కెట్‌యార్డును మంజూరు చేసినందుగాను పలువురు నాయకులు, రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ.. కొత్తకోట: మండలంలోని సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ నెల 22న మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి భూమిపూజ చేయనున్నట్లు సీడీసీ చైర్మన్ గొల్లబాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.