Anakapalle
-
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
కె.కోటపాడు: సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఎ.కోడూరు, కె.కోటపాడు పోలీస్స్టేషన్లను బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెండు పోలీస్స్టేషన్ల రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులకు సూచనలను చేశారు. గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని వివరించారు. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు రాత్రి గస్తీలను పోలీసులు మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, ఎ.కోడూరు, కె.కోటపాడు పోలీస్స్టేషన్ల ఎస్ఐలు డి.లక్ష్మీనారాయణ, ఆర్.ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తారురోడ్డు నిర్మాణం.. వైఎస్సార్సీపీ పుణ్యమే
● వి.బి.పేట సర్పంచ్ నర్సింహమూర్తి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నాటి డిప్యూటీ సీఎం బూడి (ఫైల్) చీడికాడ: మండలంలోని శివారు వి.బి.పేట పంచాయతీలోని వి.బి.పేట నుంచి శివారు కొండేంపూడి, గొప్పూరు తారురోడ్డు నిర్మాణం వైఎస్సార్సీపీ పుణ్యమని, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవ అని వి.బి.పేట సర్పంచ్ వంటాకు నర్సింహమూర్తి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఒక ప్రముఖ పత్రికలో వి.బి.పేట నుంచి కొండేంపూడి, గొప్పూరు తారురోడ్డు ప్రస్తుత ఎమ్మెల్యే చొరవతో పూర్తి కావస్తుందంటూ తప్పుడు సమాచారం ప్రచురించారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు తమ ఊరు ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదన్నారు. వి.బి.పేట ప్రజలతో పాటు కొండేంపూడి, గొప్పూరు, జైపురం, ముడిచర్లకు చెందిన గిరిజనులు తారురోడ్డు నిర్మించాలని కోరడంతో సార్వత్రిక ఎన్నికల ముందు రూ. 5.60 కోట్ల నాబార్డు నిధులతో ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి ఆ రోజు నుంచే పనులు ప్రారంభించారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ పనులు నిరాటంకంగా కొనసాగుతూ నేడు చివరి దశకు చేరుకున్నాయన్నారు. మరో వారం, పది రోజుల్లో తారుపోత పూర్తి అయి రోడ్డు ప్రారంభానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన మంచిని తమ ఖాతాలో వేసుకునేందుకు చూడడం తగదన్నారు. ఆ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం తగదన్నారు. -
మెగా డీఎస్సీ విడుదల చేయాలని వినతి
తుమ్మపాల: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలంటు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వియ్యపు రాజు డిమాండ్ చేశారు. డీఎస్సీ నోటిషికేషన్ విడుదలపై ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో సత్యనారాయణరావుకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వియ్యపు రాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ పైనే అంటూ హమీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు నేటికీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. లక్షలు చెల్లిస్తు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని అన్నారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు పోస్టుల ఎంపిక విషయంలో అన్యాయం జరిగిందని, తక్కువ పోస్టులు మంజూరు చేస్తారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా పోస్టులు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు డొక్కరి హరీష్, నాయకుడు బి.బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక దాడుల కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు
● ఆదేశించిన డీఐజీ గోపీనాథ్ జెట్టీ ● విశాఖ రేంజ్ జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, విశాఖపట్నం : మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ అన్నారు. వీటిపై జిల్లా ఎస్పీలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, నిందితులపై కేసులు నమోదు చేసి త్వరితగతిన శిక్షలు పడేలా సీఐ, ఎస్ఐలు పనిచేయాలని ఆదేశించారు. అలాగే, నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం కల్పించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం జిల్లాల ఎస్పీలు ఇతర జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పొక్సో కేసులు, హేయమైన నేరాలు సంబంధించిన కేసుల పై సమీక్ష నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న, గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక షీట్స్ తయారు చేయాలన్నారు. గంజాయి నిందితుల ఆస్తుల స్వాధీనానికి, పీడీ యాక్ట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చర్య లు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, వకుల్ జిందాల్, అమిత్ బర్దర్, కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎస్.వి.మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
4న రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల నిరసన
చోడవరం బస్‌స్టాప్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు అనకాపల్లి టౌన్ : కూటమి ప్రభుత్వం గత ఎన్నికలలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో మార్చి 4న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి హెచ్చరించారు. స్ధానిక చోవవరం బస్‌స్టాప్ వద్ధ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్ మంజూరు చేస్తామని, చంద్రన్న బీమాపాలసీ 5 నుంచి రూ.10 లక్షల వరకు అమలు చేస్తామని, టాటా మ్యాజిక్ వ్యాన్లు, కార్లు, జీపులకు రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్, లేబర్ టాక్స్ తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదన్నారు. ఈ నెలలో జరిగే శాసన సభ సమావేశాల్లో ఈ హామీలు అమలు చేసే జీవోలను విడుదల చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్షణ మాట్లాడుతూ జీవో 21,31 లను తక్షణమే రద్దు చేయాలని, స్థానికంగా ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ఆటో ఎఫ్‌సిలు ప్రెవేట్ వ్యక్తులకు ఇచ్చే ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెదిరెడ్డ నాగేశ్వరావు, కరణం చిరంజీవి, మడిశ శ్రీను, మల్లిబాబు, తాతారావు, డొంక సింహాచలం నాయుడు, పెంటారావు, కృష్ణ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
అనకాపల్లి: కేంద్ర పథకాల ద్వారా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయబోమని ఇటీవల రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని, ఆప్కోస్‌ను రద్దు చేసి జిల్లాల ఏజెన్సీలకు ఉద్యోగులను కట్టబెట్టాలనే క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆప్కోస్ ఉద్యోగుల పట్ల దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తూ వారిని అభద్రతాభావంలోకి నెట్టటం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టాలన్నారు. గతంలో సమగ్ర శిక్ష, మున్సిపల్, అంగన్వాడీ తదితర సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్‌ను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయడం, హెచ్ఆర్ఏ, డీఏ, గ్రాట్యుటీ క్రమబద్ధీకరణ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. దీనిపై మార్చి 10న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమగ్ర శిక్ష జేఏసీ నాయకుడు బి.కాంతారావు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి విద్యాశాఖలో పని చేస్తున్న ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యం, ఇతర శాఖల్లో పని చేస్తున్న వారిని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జేఏసీ నాయకులు అచ్యుత కృష్ణ, బ్రహ్మాజీ, నూకేష్, రామకృష్ణ, పెంటయ్య, సాయి, నర్సింగరావు, నందేశ్వరరావు, లక్ష్మి, కమల, వి.వి.శ్రీనివాసరావు, దేవకి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
తుమ్మపాల: జిల్లాలో ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్‌ధారణ తప్పనిసరి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా సమన్వయ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్ల దగ్గర కలర్ పెయింటింగ్ వేయాలన్నారు. ప్రమాదాల వల్ల చనిపోయిన వారికి త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, అతివేగం వల్ల జరిగే ప్రమాదాల గురించి అందరికీ అవగాహన కల్పించాలని, పోస్టర్లు అతికించాలని, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కూడళ్లు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజలు స్పందించి క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రుల్లో చేర్పించాలని కోరారు. అటువంటి వారికి అవార్డులు ప్రకటించాలని, ఇందుకు స్థానిక ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వోల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి వి. మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కృషి చేస్తామన్నారు. ఇప్పటికే హెల్మెట్ ధరించని వారిని, రాంగ్ రూట్లో వచ్చే వారిని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి అపరాధ రుసుములు విధిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. రవికుమార్, జిల్లా ట్రాఫిక్ రికార్డు బ్యూరో డీఎస్పీ వి.మోహన్ రావు, ఆర్అండ్బీ డీఈ విద్యా సాగర్, జీవీ ఎంసీ అధికారులు, జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులు, ఎంవీ ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఇన్స్పెక్టరు పాల్గొన్నారు. ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలి కలెక్టర్ విజయ కృష్ణన్ -
సినీ ఫక్కీలో గంజాయి కారు పట్టివేత
● మరో ఇద్దరు పరార్ ● కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనంయలమంచిలి రూరల్ : పదహారో నంబరు జాతీయ రహదారిపై బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్న ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు యలమంచిలి నుంచి తుని వైపు ర్యాష్ డ్రైవింగ్‌తో వెళ్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఓ కారుపై అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. కారులో ఓ వ్యక్తి ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడగా డ్రైవర్ పరారయ్యాడు. కారులో 4 ప్లాస్టిక్ సంచుల్లో ఒక్కొక్కటి రెండు కేజీల బరువున్న 49 గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. 98 కేజీలు ఉన్న దీని విలువ సుమారుగా రూ.4.90 లక్షలు ఉంటుంది. అనకాపల్లి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జీత్ సింగ్ తెలిపిన వివరాలివి. ఒడిశాలోని బరంపురం నుంచి కసర్గూడ్కు వెళుతున్న కేఎల్14జెడ్8008 స్విఫ్ట్ కారుకు కుడివైపు యాక్సిడెంట్ అయినట్టు ఉండడం, కేరళ రిజిస్ట్రేషన్ నంబరు ఉండడంతో అను మానం వచ్చిన ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు కారును ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో దానిని వెంబడించారు. యలమంచిలి తండాలదిబ్బ సమీపంలో ఓ హోటల్ వద్ద కారు పార్క్ చేసి ఉండడాన్ని గుర్తించి సోదా చేయగా అందులో 49 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. కారులో ఉన్న కేరళకు చెందిన మోయుద్దీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారైన కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. గంజాయి, కారుతో పాటు రెండు ఫోన్లు, జియో డోంగిల్ డివైజ్, రూ.5600 నగదును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సకాలంలో స్పందించి వాహనాన్ని పట్టుకున్న యలమంచిలి ఎకై ్సజ్ పీఎస్, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బందిని ఏసీ సుర్జీత్‌సింగ్ అభినందించారు. ఈ కేసును ఛేదించిన వారిలో యలమంచిలి ఎకై ్సజ్ సీఐ తేజో వెంకట కుమార్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు సోమయ్య, శ్రావణి, పీవీ గిరిబాబు సిబ్బంది ఉన్నారు. గంజాయితో ముగ్గురు అరెస్టు నర్సీపట్నం : కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను నాతవరం పోలీసులు అరెస్టు చేశారని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. నాతవరం పోలీసులు గంజాయి నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయిని డీఎస్పీ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బుధవారం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం ఎస్ఐ భీమరాజు, సిబ్బందితో ములగపూడి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నర్సీపట్నం నుంచి తుని వైపు కారులో వస్తున్న వ్యక్తులు కారు ఆపి పరారవుతుండగా తమ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. పట్టుబడిన వారి లో నర్సీపట్నం మండలం, నీలంపేటకు చెందిన ఆర్.బోడకొండ(29), చింతపల్లి మండలం, రాళ్లగెడ్డ వి.గిరిబాబు (27), నర్సీపట్నానికి చెందిన భార్గవ సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో ఇద్దరు వ్యక్తులు నర్సీపట్నం మండలం గబ్బాడకు చెందిన అప్పలనాయుడు, చింతపల్లి మండలం రాళ్లగెడ్డకు చెందిన కె.రమేష్ పరారీలో ఉన్నారని తెలిపారు. కారుతో పాటు 122 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ గంజాయి విలువ రూ.6.10 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే నిందితుల వద్ద నుంచి 3 సెల్ఫోన్లను స్వాధీన పర్చుకున్నామన్నారు. -
తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య
రాంబిల్లి (యలమంచిలి) : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన వలస కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలం కోడూరు గ్రామంలో జరిగింది. రాంబిల్లి ఎస్ఐ నాగేంద్ర తెలిపిన వివరాలివి. కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన గునిపూడి సురేష్(38) కొంత కాలంగా స్థానిక ఫార్మాపరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తాము నివాసం ఉంటున్న లాలం కోడూరు గ్రామం వద్ద ఉన్న రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మృతి చెందగా, భార్య నుంచి మూడేళ్లుగా విడిపోవడం వంటి కారణాలతో సురేష్ మద్యానికి బానిసయ్యాడని, జీవితంపై విరక్తి చెంది ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, బంధువులు తెలిపారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బాధిత కుటుంబానికి ఆర్థిక ఆసరా
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్న దళిత సేవా సంఘం సభ్యులు దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి దళిత సేవా సంఘం సభ్యులు తమ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల దళిత నిరుపేద కుటుంబానికి చెందిన ముప్పిన అప్పారావు తండ్రి జవాలు మరణించాడు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆసరా కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబానికి దళిత సేవా సంఘం సభ్యులు రూ. 5 వేలు అందించి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయంగా దళిత సేవా సంఘం పని చేస్తుందని సంఘ సభ్యులు తెలిపారు. -
సీనియర్ నాయకులకు గుర్తింపు ఇవ్వాలి
అనకాపల్లి: నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లకు గుర్తింపు లేకుండా పోయిందని టీడీపీ కోర్ కమిటీ సభ్యుడు బోడి వెంకటరావు యాదవ్, మాజీ కౌన్సిలర్ కుప్పిలి జగన్మోహనరావు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోట్ని రామకృష్ణదొర విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీని బతికించాలని, పార్టీలో కార్యకర్తలను గుర్తించే సరైన న్యాయకత్వం లేకుండా పోయిందన్నారు. ఎన్టీఆర్ దైవంగా, పార్టీని తల్లిగా నమ్మి నేటి వరకూ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏనాడూ పార్టీ జెండా పట్టుకోని వ్యక్తులకు పదవులు ఇవ్వడం బాధాకరం అన్నారు. -
పాఠశాల ప్రహరీ నిర్మాణంలో.. టీడీపీ నేతల మధ్య రగడ
● రూ.11 లక్షల నిధులు మంజూరు ● రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించిన తెనుగుపూడి టీడీపీ నేత ● అడ్డగించిన విస్సారపుదొడ్డి టీడీపీ నేతలు ● హెరిటేజ్ పాల కేంద్రం కోసమే అడ్డగించారని ఆరోపణలుదేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి పంచాయతీ శివారు విస్సారపు దొడ్డి ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణంలో టీడీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. స్థానిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 11 లక్షలు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందుకు తెనుగుపూడి పంచాయతీ పాలకవర్గం సైతం అంగీకారం తెలుపుతూ తీర్మానం చేసింది. ఈ నిధులతో తెనుగుపూడికి చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు పెంటకోట అప్పలనాయుడు రెండు రోజుల క్రితం ప్రహరీ నిర్మాణానికి గుంతలు తవ్వగా స్థానిక టీడీపీ నేతలు కొందరు పనులను అడ్డగించారు. ప్రహరీ నిర్మిస్తే పాఠశాల ఆవరణలో శుభ కార్యాల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో నిర్మించడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలకు విద్యార్థులు హాజరు కాకుండా చేశారు. దీంతో ఆరుగురు విద్యార్థులకు గాను ఒక్క విద్యార్థి మాత్రమే పాఠశాలకు హాజరయ్యాడు. అయితే దేవాలయం లాంటి పాఠశాలను రాజకీయాలకు కేంద్రంగా మార్చిన టీడీపీ నేతల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలకు ప్రహరీ నిర్మించడం ద్వారా విద్యార్థులకు రక్షణ ఏర్పడుతుంది తప్ప దీని వల్ల గ్రామస్తులకు ఎటువంటి ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉండదు. పాఠశాల ఆవరణలో ఉన్న కమ్యూనిటీ హాల్లో హెరిటేజ్ పాల సమీకరణ కేంద్రం నిర్వహిస్తుండటంతో ప్రహరీ నిర్మిస్తే లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని స్థానిక టీడీపీ నేతలు అడ్డగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఇరు వర్గాల టీడీపీ నేతలు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ఏకాభిప్రాయంతో ప్రహరీ నిర్మాణం పూర్తయ్యేలా చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ప్రహరీ నిర్మాణంపై నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
భూములిస్తే నష్టపోతాం
మా భూములు పరిశ్రమల కోసం తీసుకోవడం తప్ప మాకు ఉపాధి చూపడం లేదు. ప్రస్తుతం మా గ్రామంలో భూములు రేటు బాగా పెరిగింది. ఎకరా కోటి రూపాయల నుంచి రూ. రెండు కోట్లు పలుకుతుంది. ప్రభుత్వం మాత్రం తక్కువ రేటుకే మా భూములు లాక్కోవాలని చూస్తోంది. పరిశ్రమలు వస్తాయి కానీ స్థాకంగా ఉన్న యువతకు బాగా చదువుకున్న మా పిల్లలకు ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వడం లేదు. నిర్వాసితుల పట్ల చిన్న చూపు చూస్తున్నాయి. ఏది ఏమైనా మాభూములు పరిశ్రమలకు ఇవ్వడం జరగదు. –లాలం నాగేశ్వరరావు, గొరపూడి గ్రామం ● -
వైఎస్ జగన్‌తో కురసాల కన్నబాబు భేటీ
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్మోహన్రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు. -
హోం మంత్రి పీఎస్‌గా భూచోడు..!
● విశ్వప్రయత్నాలు చేస్తున్న అధికారి ● అందుకు మంత్రి అనిత గ్రీన్ సిగ్నల్ ● గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తహసీల్దార్‌గా పనిచేసిన అధికారి ● ఎస్.రాయవరంలో భూరికార్డుల తారుమారు విషయంలో ఆరోపణలు ● మళ్లీ అనిత వద్దే పీఎస్‌గా ప్రయత్నాలపై అనేక అనుమానాలు విశాఖ సిటీ: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) నియామకం చర్చనీయాంశమవుతోంది. రెవెన్యూలో చక్రం తిప్పే ఒక తహశీల్దార్ పీఎస్‌గా వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భూ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని తన పీఎస్‌గా తెచ్చుకునేందుకు హోంమంత్రి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో భారీ ప్రాజెక్టులకు భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో అతని చాతుర్యం అవసరమని అనిత భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో అనిత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎస్.రాయవరం మండలంలో భూ రికార్డుల మార్పులు విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారినే మళ్లీ తన పీఎస్‌గా నియమించాలనుకోవడం గమనార్హం. ప్రభుత్వమేదైనా కీలక పోస్టింగ్..! ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సదరు తహసీల్దార్ మాత్రం నచ్చిన పోస్టింగ్ తెచ్చుకోవడంలో సిద్ధహస్తుడు అన్న టాక్ రెవెన్యూ విభాగంలో ఉంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకొని కీలక మండలాల్లో ఇప్పటి వరకు విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ(వీఎంఆర్డీఏ)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి హోం మంత్రి పీఎస్‌గా వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి మంత్రి అనితే సదరు అధికారిని తన పీఎస్‌గా నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. భూ వ్యవహారాలు చక్కబెట్టేందుకేనా..? అనకాపల్లి జిల్లాలో కీలక భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ప్రధానంగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌తో పాటు అదే మండలంలోనే బల్క్ డ్రగ్ పార్కు రానుంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున భూ సమీకరణ ప్రక్రియను చేపట్టారు. ఇంకా భారీగా భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో హోం మంత్రి అనిత సదరు తహసీల్దార్‌ను తన పీఎస్‌గా నియమించుకోడానికి వెనుక భూ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకే అన్న వాదనలు ఉన్నాయి. గతంలో సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. మళ్లీ అతడినే ఏరికోరి తెచ్చుకోవాలని చూస్తుండడం వెనుక గల కారణాలపై సొంత పార్టీలోనే నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నో ఆరోపణలు సదరు అధికారి ఎస్.రాయవరం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత ఉన్నారు. ఒక భూ వ్యవహారంలో రికార్డులు మార్చడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై తలారీ స్వయంగా ఆరోపణలు చేస్తున్న వీడియో సైతం వైరల్ అయింది. మళ్లీ ఇపుడు అనిత సదరు అధికారినే వ్యక్తిగత కార్యదర్శిగా తీసుకోవాలనుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
మైదానంలో జాఫ్రా సిరులు
నాతవరం మండలంలో 200 ఎకరాల్లో సాగు సుందరకోటలో పంట దశలో ఉన్న జాఫ్రా తోటలు నాతవరం: గిరిజన ప్రాంతంలో పండించే జాఫ్రా గింజలకు ఉహించని రేటు లబించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయనప్పటికీ ప్రైవేటు వ్యాపారులు ముందుకు వచ్చి అధిక రేట్లకు జాఫ్రా గింజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది జాఫ్రా గుబడితో పాటు రేటు బాగుండడంతో అధిక ఆదాయం వస్తుందని గిరిజనులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విరివిగా తోటల సాగు.. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, మాసంపల్లి , రాజవరం, దద్దుగుల సుందరకోట పంచాయతీ శివారు కొత్త సిరిపురం, కొత్త దద్దుగుల, తొరడ, సుందరకోట, అసనగిరి, ముంతమామిడిలొద్దు, బమ్మిడికలొద్దు, సిరిపురం, కొత్త లంకలు తదితర గిరిజన ప్రాంతంలో జాఫ్రా తోటలు సాగు చేస్తున్నారు. వీటితో పాటు కొండల దిగువనున్న ప్రాంతాల్లో కె.వి.శరభవరం, కొండ ధర్మవరం, చమ్మచింత, పొట్టినాగన్నదొరపాలెం, కృష్ణాపురం గ్రామాల్లో గిరిజనులు జాఫ్రా తోటలు పెంచుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారుగా 200 ఎకరాల పైగా జాఫ్రా తోటలు సాగు చేస్తున్నారు. ఈ తోటలు అఽధికంగా వ్యవసాయ భూముల గట్లు మీద జీడి మామిడి తోటలు మద్య అంతర పంటగా సాగు చేస్తుంటారు. జాఫ్రా తోటకు నీటి వసతి లేకపోయినప్పుటికీ ఆడపాదడపా కురిసే వర్షాలకు ఈతోటలు ఏపుగా పెరుగుతుంటాయి. వీటికి తెగుళ్లు కూడా అంతంత మాత్రమే. తోటలకు గిరిజనులు ఎక్కడా క్రిమిసంహారక మందులు పిచికారి చేయలేదు. రంగుల కోసం వినియోగం.. ఈ ఏడాది ఎకరం జాఫ్రా తోట నుంచి గింజలు 800 నుంచి 1000 కేజీల మధ్య దిగుబడులు వచ్చాయని గిరిజనులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఇంత అధిక మొత్తంలో దిగుబడులు రాలేదంటున్నారు. అధిక దిగుబడి రావడానికి ప్రధాన కారణం గత ఏడాది ఖరీ్‌ఫ్ సీజన్లో కొండలపై అధికంగా వర్షాలు కురియడమే కారణంగా భావిస్తున్నారు. దిగుబడితో పాటు రేటు కూడా కేజీకి నాణ్యతను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు ప్రవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తే మరింత రేటు పెరుగుతుందని గిరిజనులు ఆశిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రైవేటు వ్యాపారులు వచ్చి గిరిజనులు రైతుల నుంచి నేరుగా జాఫ్రా గింజలు కొనుగోలు చేస్తున్నారు. జాఫ్రాను ఇళ్లకు ఉపయోగించే పెయింటింగ్‌కు, దుస్తుల రంగులకు అధికంగా వినియోగిస్తుంటారు. ఇతర రంగుల కంటే జాఫ్రా పింకులు రంగులు నాణ్యతతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే వివిధ రకాలకు చెందిన పెయింటింగ్ కంపెనీల నుంచి కూడా డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. ఆదాయం బాగుంది ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జాఫ్రా ద్వారా ఆదాయం బాగా వచ్చింది. సుందరకోటలో 50 సెంట్ల విస్తీర్ణంలో 435 కేజీల జాఫ్రా గింజలు పండాయి. రేటు రూ.245 నుంచి రూ.300 వరకు విక్రయించాను. ఇంత ఆదాయం వస్తుందని ఊహించలేదు. పాడేరు ఐటీడీఏ గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తే మరింత రేటు వచ్చే అవకాశం ఉంటుంది. –బత్తుల కృష్ణ, రైతు, సుందరకోట గ్రామం -
పరిశ్రమలకు భూములిచ్చేది లేదు...!
రాంబిల్లి (యలమంచిలి) : పరిశ్రమలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని గొరపూడి పంచాయతీ ప్రజలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.డి.అనితకు ఏపీఐఐసీ జెడ్ఎం నరసింహారావుకు ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. రాంబిల్లి మండలం గొరపూడి పంచాయితీ శివారు గ్రామం అప్పన్నపాలెం కాలనీలో రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, ఏపీఐఐసీ జెడ్ఎం నరసింహారావు, స్ధానిక రెవెన్యూ, పోలీసులు అధికారుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమల కోసం భూసేకరణ అంశంపై గ్రామంలో రైతులు, ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో పరిశ్రమల కోసం భూములు తీసుకోవడం పై స్థానిక ప్రజలు నష్ట పరిహారంపై హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు రైతులకు కొత్త భూసేకరణ చట్టం ద్వారా భూపరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించిందని, ఈమేరకు ప్రభుత్వ అదేశాలు మేరకు గ్రామంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని ఎస్డీసీ రైతులకు తెలిపారు. భూసేకరణపై రైతులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరగా రైతులు మాట్లాడుతూ రాంబిల్లి మండలంలోకి ఇప్పటికే పరిశ్రమల రాకతో భూములు కోల్పోయి, ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, అలాగే గ్రామంలో భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువ అని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం గొరపూడి పంచాయతీలో అధికంగా భూములకు ధరలు పలుకుతున్నాయని, ఎకరాకు ప్రభుత్వం చాలా తక్కువగా రూ. 20 లక్షలు ఇవ్వడం అన్యాయమని అన్నారు. గతంలో వచ్చిన పరిశ్రమల మా భూములు కొన్ని పొగొట్టుకున్నామని, భూములు తీసుకుని ఆ కంపెనీల్లో స్థానికులకు లేబర్ ఉద్యోగాలు తప్ప సరైన ఉద్యోగాలు ఇవ్వక చిన్న చూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎన్నికల్లో నేతల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, ఎన్నికలయ్యాక ఎమ్మెల్యే, ఎంపీ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. మ్యూటేషన్ల పేరిట ముప్పుతిప్పలు.. గొరపూడి గ్రామ పంచాయతీలో రీ సర్వేలో తప్పులు దొర్లుతున్నాయి అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. గొరపూడి గ్రామంలో భూమి యజమానుల పేర్లు కాకుండా పక్క ఊరి రైతుల పేర్లను రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు చేశారని, దానివల్ల రైతు భరోసా పథకం రాకుండా భూమి ద్వారా ఎటువంటి రుణాలు తెచ్చుకోవడానికి వీలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ సమస్యలపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళితే మ్యూటేషన్ల పేరిట అధిక మొత్తంలో రైతుల నుంచి డబ్బులు కట్టమని అడుగుతున్నారని డబ్బులు కడితేనే మారుస్తారంటా...! మరి అలాంటప్పుడు రెవెన్యూ సదస్సులు ఎందుకు నిర్వహిస్తున్నారని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారికి సూచించారు. భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వరు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి చూపరు బలవంతంగా లాక్కుందాం అంటే లాక్కోండి తేల్చి చెప్పిన అప్పన్నపాలెం గ్రామస్తులు ఏపీఐఐసీ భూ నిర్వాసితులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, ఏపీఐఐసీ జెడ్ఎం నరసింహారావు సమావేశం సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు