
హోం మంత్రి పీఎస్‌గా భూచోడు..!
● విశ్వప్రయత్నాలు చేస్తున్న అధికారి
● అందుకు మంత్రి అనిత గ్రీన్ సిగ్నల్
● గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తహసీల్దార్‌గా పనిచేసిన అధికారి
● ఎస్.రాయవరంలో భూరికార్డుల తారుమారు విషయంలో ఆరోపణలు
● మళ్లీ అనిత వద్దే పీఎస్‌గా ప్రయత్నాలపై అనేక అనుమానాలు
విశాఖ సిటీ: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) నియామకం చర్చనీయాంశమవుతోంది. రెవెన్యూలో చక్రం తిప్పే ఒక తహశీల్దార్ పీఎస్‌గా వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భూ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని తన పీఎస్‌గా తెచ్చుకునేందుకు హోంమంత్రి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో భారీ ప్రాజెక్టులకు భూ సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో అతని చాతుర్యం అవసరమని అనిత భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో అనిత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎస్.రాయవరం మండలంలో భూ రికార్డుల మార్పులు విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారినే మళ్లీ తన పీఎస్‌గా నియమించాలనుకోవడం గమనార్హం.
ప్రభుత్వమేదైనా కీలక పోస్టింగ్..!
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సదరు తహసీల్దార్ మాత్రం నచ్చిన పోస్టింగ్ తెచ్చుకోవడంలో సిద్ధహస్తుడు అన్న టాక్ రెవెన్యూ విభాగంలో ఉంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకొని కీలక మండలాల్లో ఇప్పటి వరకు విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ(వీఎంఆర్‌డీఏ)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి హోం మంత్రి పీఎస్‌గా వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి మంత్రి అనితే సదరు అధికారిని తన పీఎస్‌గా నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
భూ వ్యవహారాలు చక్కబెట్టేందుకేనా..?
అనకాపల్లి జిల్లాలో కీలక భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ప్రధానంగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌తో పాటు అదే మండలంలోనే బల్క్ డ్రగ్ పార్కు రానుంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున భూ సమీకరణ ప్రక్రియను చేపట్టారు. ఇంకా భారీగా భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో హోం మంత్రి అనిత సదరు తహసీల్దార్‌ను తన పీఎస్‌గా నియమించుకోడానికి వెనుక భూ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకే అన్న వాదనలు ఉన్నాయి. గతంలో సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. మళ్లీ అతడినే ఏరికోరి తెచ్చుకోవాలని చూస్తుండడం వెనుక గల కారణాలపై సొంత పార్టీలోనే నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఎన్నో ఆరోపణలు
సదరు అధికారి ఎస్.రాయవరం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత ఉన్నారు. ఒక భూ వ్యవహారంలో రికార్డులు మార్చడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై తలారీ స్వయంగా ఆరోపణలు చేస్తున్న వీడియో సైతం వైరల్ అయింది. మళ్లీ ఇపుడు అనిత సదరు అధికారినే వ్యక్తిగత కార్యదర్శిగా తీసుకోవాలనుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment