Jagtial
-
ఇసుక అక్రమ రవాణా కావొద్దు
జగిత్యాల: జిల్లాలో ఇసుక అక్రమంగా రవాణా కా కుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మైనింగ్, పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఇసుక రవాణా జరగకుండా రెండుశాఖలు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ట్రాక్టర్, లారీ ఏదైనా చెక్ చేయాలని, తహసీల్దార్ అనుమతి ఉందా లేదా తప్పనిసరిగా చూడాలన్నారు. జిల్లాలో గుర్తించిన ఇసుక వాగుల ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా తరలిపోకుండా బృందాలు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా జరగాలని, అర్ధరాత్రి వేళల్లో జరిగే అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచి చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ చర్యలు ఉండాలన్నారు. ఇబ్రహీంపట్నం, ధర్మపురి ప్రాంతాల్లో గోదావరి నుంచి ఇసుకకు అనుమతి లేదని, గుర్తించిన ఇసుక రీచ్‌ల ద్వారానే రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరెపల్లిలో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ధర్మపురి: అనుమతి లేకుండా ఇసుకను తరలించినా.. డంపింగ్ చేసిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని దమ్మన్నపేట, ఆరపెల్లి గ్రామాల్లోని గోదావరి తీరాలను ఎస్పీ అశోక్‌కుమార్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముందుగా ఇసుక తరలిస్తున్నవారితో మాట్లాడారు. ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? పర్మిషన్ ఉందా... ఎంతకాలంగా తరలిస్తున్నారు..?అని ప్రశ్నించారు. గోదావరి ఒడ్డుపై నిల్వ ఉంచిన ఇసుక రీచ్‌లను పరిశీలించి సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రాత్రివేళ విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీఐ రాంనర్సింహరెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, మైనింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
● అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల బుక్లెట్ ● జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ కేంద్రాల ఏర్పాటు
గొల్లపల్లి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి.. పూర్వ పద్ధతిలో మార్కులు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అడిషనల్స్ అవసరం లేకుండా 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్లెట్లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. వచ్చే నెల 21 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు 337 ఉన్నాయి. ఇందులో పదో తరగతి విద్యార్థులు 11,855 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రశ్నపత్రంతోపాటు ఓఎంఆర్ షీట్, జవాబు రాసేందుకు నాలుగు పేజీలు ఇచ్చేది. అందులో జవాబులు రాయడం పూర్తయ్యాక అడిషనల్ షీట్ ఇచ్చేవారు. అయితే అడిషనల్ షీట్ అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్‌లెట్‌ను తీసుకొస్తున్నారు. జవాబులన్నీ ఆ బుక్‌లెట్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.నాలుగుచోట్ల..జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణ కేంద్రాల్లో ఇవి ఉన్నాయి. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్లెట్లను తీసుకెళ్లనున్నారు.విద్యార్థులకు ఇబ్బందులు ఉండవుపదోతరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఈ సారి విద్యార్థులు జవాబులు రాసేందుకు బుక్లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తరచూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు. – రాము, డీఈవో -
బీర్పూర్ నృసింహునికి రూ.26.33లక్షల ఆదాయం
సారంగాపూర్: బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామికి బ్రహ్మోత్సవాల ద్వారా రూ.26,33,525 ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాలు ముగియడంతో అధికారులు హుండీ ఆదాయంతోపాటు, ఇతర మార్గాల ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.13,69,163, వేలంపాటల ద్వారా రూ.7.10 లక్షలు, టికెట్ల ద్వారా రూ. 5,54,362 వచ్చాయి. గతేడాది రూ.26.06 లక్షలు ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది రూ.26,806 పెరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ బంగారం 6 గ్రాములు, మిశ్రమ వెండి 1.280 కిలోలు, విదేశీ నోట్లు 20 వచ్చాయి. లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, మాజీ ఎంపీపీలు మసర్తి రమేశ్, గుడిసె శ్రీమతి, ఆలయ మాజీ చైర్మన్లు ఎనగంటి సామ్రాట్, నేరెళ్ల సుమన్‌గౌడ్, మాజీ సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మీటర్లు గిరగిరా..
● జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం ● వేసవి సమీపించడంతో మరింత పెరిగే చాన్స్ ● అప్రమత్తంగానే ఉన్నామన్న విద్యుత్ అధికారులు ● జిల్లాలో మొత్తం కనెక్షన్లు 5,29,944 ● వ్యవసాయ కనెక్షన్లు, 1,35,052 ● గృహ వినియోగ కనెక్షన్లు 3,36,696 ● పారిశ్రామిక కనెక్షన్లు 58,196 జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సమీపిస్తుండటంతో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు గృహాలకు, మరోవైపు వ్యవసాయానికి విని యోగం ఒక్కసారిగా పెరుగుతుండటంతో అధికా రులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌శాఖ అధికారు ల బృందం ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో వేసవిలో ఎలాంటి అంతరాయమూ లేకుండా విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకోవైపు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఎండ వేడిమి, ఉద యం, సాయంత్రం వేళ చలిగా ఉంటోంది. మొన్న టి వరకు చలి ప్రభావంతో ఫ్యాన్లు వేసేందుకే జంకిన జనం.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, ఉక్కపోత మొదలుకావడంతో కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ఏసీలు కూడా ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. గతేడాది జనవరిలో 130.596 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే.. ఈ ఏడాది జనవరిలో 130.75 మిలియన్ యూనిట్లు వినయోగించారు. గతేడాది ఫిబ్రవరిలో 139.04 మిలియన్ యూనిట్లు వినియోగం కాగా.. ఈ ఏడాది 17వ తేదీ వరకు 87.222 యూనిట్లు వాడకం జరిగింది. ఈ నెల ముగియడానికి మరో 11 రోజులు ఉండడం.. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నట్లు విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తంగా ఉన్న విద్యుత్ సిబ్బంది జిల్లాలో మొత్తం కనెక్షన్లు 5,29,944 ఉన్నాయి. ఇందులో వ్యవసాయ కనెక్షన్లు, 1,35,052, గృహ వినియోగ కనెక్షన్లు 3,36,696, పారిశ్రామిక కనెక్షన్లు 58,196 వరకు ఉన్నాయి. వేసవిలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అధి కారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వినియోగమయ్యే విద్యుత్‌కు అదనంగా 10 శాతం ఎక్కువ కేటాయింపు చేసుకుంటున్నారు. ఓవర్‌లోడ్ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు అదనంగా 147 ట్రాన్స్‌ఫా ర్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ట్రాన్స్ఫార్మర్ల మీద పెరుగుతున్న లోడ్ వివరాలను సేకరిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌గాని, సబ్స్టేషన్లోగాని ట్రిప్ అయితే ఎందుకై ందో ఆగమేఘాల మీద ఉన్నతాధికారులు పరిశీలిస్తూ.. ఆ మేరకు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజూ వారి విద్యుత్ డిమాండ్ పరిస్థితిని పరి శీలించేందుకు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఈలు, ఏడీఈ, ఏడీ, ఏఈలు జిల్లా విద్యుత్ అధి కారి సాలియానాయక్తో సమావేశమవుతున్నారు. పొదుపే పరిష్కారం సహజ వనరులైన బొగ్గు, నీరు, సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, ఆ కరెంట్‌ను గృహాలు, వ్యవసాయ కనెక్షన్లకు వినియోగించేందుకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని, విద్యుత్‌ను పొదుపుగా వాడటమే ఏకై క పరిష్కారమని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో అయినా వీధి దీపాలైన అవసరం లేనప్పుడు స్విచ్ఛాప్ చేయాలని కోరుతున్నారు. అవసరం లేని సమయంలో ఫ్లాన్లు, లైట్లు ఆపివేయాలని నచ్చజెప్పుతున్నారు. రైతులకు అవగాహన సదస్సులు జిల్లాలో దాదాపు మూడు లక్షల వరకు విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా రైతులకు విద్యుత్ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు విద్యుత్ పంపుసెట్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు బిగించుకుని, అవసరమున్నా.. లేకున్నా విద్యుత్‌ను ఎక్కువగా వృథా చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. విద్యుత్ పొదుపు చేసేందుకు ఫ్యూజ్ బాక్స్‌లో కెపాసిటర్లు బిగించుకోవాలని చెపుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ మోటార్ల వద్ద ఉన్న ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. -
ఆంజనేయ స్వామి ఆలయంలో కల్యాణ వేడుకలు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పురాణిపేట ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్స వం సందర్భంగా శివపార్వతుల కల్యాణంను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాజరాజేశ్వరస్వామి జాతర ఉత్సవాలుమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లో పుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టు పక్కన ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు కోడెలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. -
‘టీచర్స్’ టఫ్‌ఫైట్!
కరీంనగర్: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఎన్నికలు ఉపాధ్యాయుల్లో జోష్ పెంచుతున్నాయి. కులాలు, సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు విడిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ నినాదం ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోని బీసీ కులగణనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సామాజికవర్గాల వారీగా ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహిస్తూ తమవర్గం వారి గెలుపునకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 15మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నిక కొత్త 15జిల్లాల పరిధిలో జరగనుండగా.. మొ త్తం 27,088మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నా రు. బీజేపీ తరఫున మల్క కొమురయ్య, పీఆర్టీ యూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ సంఘా ల మద్దతుతో సంగారెడ్డికి చెందిన అశోక్‌కుమార్, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎస్టీయూ, మోడల్ స్కూల్, కేజీబీవీ, సీపీఎస్ సంఘాల మద్దతుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దిగి, చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. 15 జిల్లాల పరిధిలో 27,088 మంది ఓటర్లు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రస్తుతం 15 కొత్త జిల్లాల్లో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఇందులో 16,932 మంది పురుషులు, 10,156మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కరీంనగర్లో 4,305 మంది, నిజామాబాద్‌లో 3,751మంది, సిద్దిపేటలో 3,212 మంది ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. హన్మకొండ జిల్లాలో 166ఓట్లు, ఆసిఫాబాద్‌లో 470 ఓట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 950 ఓట్లు ఉన్నాయి. విజేతలెవరో? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి వ్యాపారులు, రియల్డర్లు ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారు తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డికి పీఆర్టీయూ టికెట్ నిరాకరించడంతో ఎస్టీయూ, మిగతా సంఘాలను కలుపుకుని బరిలో నిలిచారు. హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నెలకొల్పి రియల్డర్‌గా పేరు సంపాదించుకున్న మల్క కొమురయ్య బీజేపీ మద్దతుతో బరిలో నిలిచారు. అత్యధిక మెంబర్షిప్ కలిగిన పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోవడంతో ఉపాధ్యాయులు విరివిరిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థుల విజయం కోసం విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో మునిగి తేలుతున్నారు. వంగ మహేందర్‌రెడ్డి, మల్క కొమురయ్య, రఘోత్తమరెడ్డి మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరో వారంరోజులే గడువు కుల, సామాజికవర్గాలుగా విడిపోతున్న ఉపాధ్యాయులు విందులు, ఆత్మీయ సమ్మేళనాలతో ఊపందుకున్న పోరుఖరీదైన ఎన్నిక... ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఖరీదుగా మారింది. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. పీఆర్టీయూ సంఘంతో పాటు బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులు బలమైన సామాజికవర్గంతో పాటు వ్యాపారవేత్తలు కావడంతో భారీగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగితా వారు కూడా ఇప్పటినుంచే విందులు, వినోదాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలుగా ఉపాధ్యాయులు విడిపోయి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికలు నాయకుల మధ్యవిగా పరిగణించగా ఈసారి కుల సమీకరణాలవారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని గెలిపించేందుకు ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
జగిత్యాల: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. విశ్రాంత ఉద్యోగులతో బుధవారం సమావేశమయ్యారు. దశాబ్దకాలంగా కలిసి ఉన్నామని, ప్రజాజీవితంలో నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయని, రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడల్లా అభివృద్ధికి కృషి చేశానని గుర్తు చేశారు. ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 317 ప్రకారం నాలుగు జోన్లుగా విభజించడంతో ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలవండిమెట్పల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వేలాది పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యాసంస్థలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి పట్టభద్రుల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఎన్నికల్లో అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు జువ్వాడి కృష్ణారావు, జెట్టి లింగం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు. మెరుగైన వైద్యం అందించాలిజగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. కొడిమ్యాలలోని పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సరైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని, ఒకవేళ కొరత ఉంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట వైద్యులున్నారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు విడుదల చేయాలిజగిత్యాలరూరల్: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ కార్యదర్శి పులి మల్లేశం అన్నారు. బుధవారం మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బందికి వేతనాల కోసం ప్రభుత్వం రూ.139 కోట్లు విడుదల చేసిందని, కార్మికులకు వేతనాలు, చెక్కులు గ్రామపంచాయతీ వారు పంపినా ట్రెజరీల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరారు.