టీడీపీ బంటుల్లా పేట్రేగిపోతున్న పోలీసులు
సాక్షి, ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దర్శిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. దీంతో, దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి అరెస్ట్‌కు నిరసగా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శిలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్ట్‌లు చేస్తున్నారు. దర్శి ఎస్ఐ మురళీని తక్షణమే తొలగించాలి. దర్శి స్టేషన్‌ని టీడీపీ పీఎస్‌గా ఎస్ఐ మురళీ మార్చుకున్నారు. బొట్లపాలెంలో నా వాహనంపై దాడి చేసిన వారిని వదిలేసి.. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త అంజిరెడ్డి మీద 307 కేసు పెట్టి అరెస్ట్ చేశారు. స్టేషన్లో అంజిరెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.దర్శి ఎస్ఐని తొలగించాలని డీజీపీని కలుస్తాను. నాకు ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు. నా హక్కులు కాపాడుకోవడం కోసం స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. శాంతియుతంగా నిరసన చేయాలనుకుంటే పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.అయితే, కొద్దిరోజులుగా దర్శి నియోజకవర్గంలో పచ్చ బ్యాచ్ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ వాహనంపై టీడీపీ కార్యకర్త దాడి చేశాడు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్త అంజిరెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వారిపై కాకుండా అడ్డుకోబోయిన అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు.దీంతో, పోలీసు వైఖరికి నిరసనగా బూచేపల్లి ధర్నాకు పిలుపునిచ్చారు. అనంతరం, దర్శి వీధుల్లో వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ధర్నాకు అనుమతి లేదంటూ శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తర్వాత వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది?: బొత్స