Eluru
-
సచివాలయ ఉద్యోగులపై పూటకో మాట
ఏలూరు(మెట్రో): పూటకో మాట.. రోజుకో నిర్ణయం.. సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కారు చేస్తున్న ప్రకటనలతో అయోమయం నెలకొంది. రేషనలైజేషన్ అంటూ ఉద్యోగుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. వారి ఉద్యోగాలను ఉంచుతుందో, తీసేస్తోందో అనే భయంతో సచివాలయ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సీనియర్ అధికారులను నియమిస్తామని వారి ద్వారా సర్వీసు నిబంధనలను రూపొందిస్తామంటూ కూటమి నాయకులు ప్రకటించడం మరింత గందరగోళానికి తావిస్తోంది. బెదిరింపు ధోరణిలో సర్కారు తీరు జిల్లావ్యాప్తంగా కూటమి సర్కారు వచ్చిన వెంటనే వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన మాటలు అటకెక్కాయి. జీతాలు పెంచడం కాదు కదా అసలు వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసేసింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై కుట్రలు పన్నేందుకు కూటమి సర్కారు సమాయాత్తమైంది. అనేక సర్వేల పేరుతో వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ కనీసం వారి భవిష్యత్తుపై భరోసా లేకుండా రోజుకో ప్రకటన విడుదల చేస్తోంది. సచివాలయాలను తొలగిస్తామని, ఉద్యోగులను ఆయా శాఖలకు పంపుతామని ఒక మంత్రి ప్రకటిస్తే, సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేస్తామని, వారిని జనాభా ఆధారంగా నియమిస్తామంటూ మరో మంత్రి ప్రకటన చేస్తున్నారు. ఇలా రేషనలైజేషన్ అంటూ ఒక వైపు, ఉద్యోగులను గ్రేడ్లుగా విభజిస్తామని మరో వైపు ఇలా అనేక విధాలుగా ఉద్యోగులను బెదిరించే విధంగా రోజుకో ప్రకటనను కూటమి సర్కారు విడుదల చేస్తోంది. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ రద్దు గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు వలంటీర్, వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే 600 పైచిలుకు సేవలను గ్రామ సచివాలయాల ద్వారా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు, మహిళల సంక్షేమం, రైతు సేవలు, రేషన్‌కార్డులు, ఇలా ప్రతీ ఒక్క సేవను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు గత ప్రభుత్వం చేరువచేసింది. ఈ వ్యవస్ధలో ప్రధానమైన వలంటీర్ వ్యవస్థను ఇప్పటికే రద్దు చేయడంతో జిల్లాలో 10 వేల మంది వలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం పొంతన లేని ప్రకటనలతో సచివాలయ ఉద్యోగులు సైతం గందరగోళానికి గురవుతూ వారి భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 517 సచివాలయాలు ఉండగా, ఈ సచివాలయాలకు 5,591 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,412మంది సచివాలయ ఉద్యోగులు జిల్లాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 1,179 సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి చర్యలు తీసుకోకపోగా, ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసే ప్రకటనలు కూటమి సర్కారు చేస్తుండటంతో వారి భవిష్యత్తు దినదినగండంగా మారింది. ఇప్పటికే సర్వేల పేరుతో ముప్పుతిప్పలు తాజాగా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరణ అంటూ గందరగోళం -
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే నియమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు ఏఐవైఎఫ్ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఖాళీల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. డీఆర్‌ఓని కలిసిన వారిలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా నాయకులు ఏ ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి కె.క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జరుగుతున్న ప్రయోగ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షల చివరి రోజున జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 14 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 659 మందికి గాను 640 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 317 మందికి 311 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 342 మందికి గాను 329 మంది హాజరయ్యారు. ఛత్రపతి శివాజీకి నివాళులు భీమవరం: భీమవరం పట్టణంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శివాజీ దేశానికే ఆదర్శమైన మహారాజని, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత సువర్ణాధ్యాయంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, అల్లు శ్రీనివాస్, మటపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సెలవు ఏలూరు(మెట్రో): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధలు పోలింగుకు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున అవసరాన్ని బట్టి సెలవులు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు/సంస్థలకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించారన్నారు. ఓట్ల లెక్కింపునకు పెదపాడు మండలం, వట్లూరు గ్రామంలోని సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, మార్చి 3న కాలేజీలో స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 21లోగా ఎమ్మెల్సీ ఓటరు స్లిప్పుల పంపిణీ ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 21లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారని, మిగిలిన వాటిని ఈ నెల 21లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరంలోనే కలెక్టరేట్ భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో మాట్లాడుతూ కలెక్టరేట్ తరలిపోతుందనేది కేవలం అపోహమాత్రమేనన్నారు. -
వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం నిషేధించాలని, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల రాకను వ్యతిరేకించాలని, ఢిల్లీ యూనివర్శిటీలో సస్పెన్షన్‌కు గురైన 17 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలోని నన్నయ యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్ధులతో కలిసి ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అప్పలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విశ్వ విద్యాలయాలలో వీసీ నియామకాలలో రాష్ట్ర హక్కులను కాలరాసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టాలను సవరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బి.సౌజన్య, డి. దేవి, ఎం.మానస, జ్ఞానేంద్ర, ఎ.ప్రదీప్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ కమర్షియల్ ట్రాఫిక్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న సుబ్బారావు అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా రూ.187 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్గో లాజిస్టిక్స్ ద్వారా రూ.91 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 22 రీజియన్లలో పశ్చిమగోదావరి జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ పరిసర ప్రాంతాలలోనూ ఆథరైజ్డ్ ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ సెంటర్‌కు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. రూ.1000 రూపాయలతో ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు, సలహాల కోసం 73311 47263, 9959225489, 7382994699 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పీవీవీ గంగాధర్, స్థానిక ఆర్టీసీ కార్గో డీఎంఈ టి.సత్తిబాబు పాల్గొన్నారు. -
బలివేలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివేలోని శ్రీరామ లింగేశ్వరాలయం. పూర్వపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ, ప్రాచీన తూర్పు వేంగీ చాళుక్యుల రాజధాని వేంగీ పురం(నేటి పెదవేగి)కి అతి సమీపాన కృష్ణా జిల్లా, ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరు ఒడ్డునే ఈ ఆలయం ఉంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించేందుకు ఏటా రెండు లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్‌రాజ్ ప్రత్యేకాధికారిగా, తహసీల్దార్ కె.రాజ్‌కుమార్ నోడల్ అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో తమ్మిలేరుపై ప్రారంభమైన చెక్‌డ్యామ్ కమ్ హైలెవెల్ బ్రిడ్జి, స్నానఘట్టాల నిర్మాణం పూర్తి కావడంతో విశాల ప్రాంగణంగా రూపుదిద్దుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాట్లు ప్రారంభించగా, తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే మిఠాయిల దుకాణాలు, వినోద సౌకర్యాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ కోరింది. బలివే చేరాలంటే బస్సురూట్లు ఇలా రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామ లింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా మొత్తం నాలుగు భాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు. ● నూజివీడు నుంచి బలివే ఉత్సవ ప్రాంగణం వరకు ● ఏలూరు నుంచి వేల్పుచర్ల మీదుగా ● ఏలూరు నుంచి విజయరాయి మీదుగా ● సత్తుపల్లి, చింతలపూడిల నుంచి బలివే వరకు. 25 నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఘనంగా ఉత్సవాలు రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా -
పైడిపర్రులో టెర్రర్
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే.. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి పైడిపర్రులో శాంతి భద్రతలు క్షీణించాయని, నోరెత్తితే దాడిచేసే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్‌లు, జూదాలకుతోడు రౌడీ మూకలు పేట్రేగిపోతుండగా, యువత, చిన్న పిల్లలకు సైతం గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసే పరిస్థితి పైడిపర్రులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం పైడిపర్రు స్పార్క్ హోటల్లో భారీ కోతాటను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైడిపర్రులో పేకాటను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతనెల 31వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో వీఆర్‌లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో పోలీసు యంత్రాంగం కుదేలైంది. ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నాం ఈ ఘటనలపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్‌ను సాక్షి వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ దొంగతనాల వ్యవహారంపై పోలీసులు బృందాలుగా విచారణ చేస్తున్నారని, అనుమానితులను గుర్తిస్తున్నామని చెప్పారు. పేకాటలపై సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తణుకు అర్బన్: పైడిపర్రు గ్రామంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. దొంగల స్వైరవిహారం.. రౌడీ మూకల బెదిరింపులు.. జూదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఈ ప్రాంతం మారింది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో పైడిపర్రువాసులు హడలిపోతున్నారు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సయయంలో 1 గంట నుంచి 5 గంటలలోపు పైడిపర్రు ప్రాంతంలో దొంగలు స్వైరవిహారం చేశారు. ఒక మహిళ మెడలో 3 కాసుల బంగారు గొలుసు గుంజుకుని పారిపోగా.. మరో ఇంటి మందు పార్కింగ్ చేసిన మోటార్‌సైకిల్‌ను అపహరించారు. గణేశుల సూర్యనారాయణ, ఆరేటి సతీష్, పంగం శంకరం, యర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఇళ్లలో తలుపులు పగులగొట్టి, తాళాలు విరగ్గొట్టి, కిటికీ చువ్వలు విరిచేసి, తలుపుల గెడలు వంచేసి ఇలా విధ్వంసం సృష్టించారు. దొంగలు చేసిన శబ్దాలకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించారు. ఒక దొంగ నిక్కరుతో ఉన్నాడని, మరో దొంగ ఫ్యాంటు ధరించి ఉన్నారని బాధితులు చెబుతుండడంతో ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ దొంగతనాలన్ని రూరల్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరగడం విశేషం. పైడిపర్రు ప్రాంతం మునిసిపాలిటీలో 4 వార్డులుగా కలిసి ఉన్నప్పటికీ ఆ ప్రాంతం ఇంకా గ్రామస్థాయి వాతావరణాన్నే కలిగి ఉంటుంది. 15వేల జనాభా ఉన్న ఈ పైడిపర్రులో 2500 పైగా ఇళ్లు ఉన్నాయి. ఆందోళనలో పైడిపర్రువాసులు ఇటీవల ఫ్లెక్సీ వివాదంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రౌడీ మూకలు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరచడం, అలాగే ఒక ఇంట్లో పేకాట నిర్వహించడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఈనెల 16వ తేదీన శ్రీబాల వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గ్రామపెద్దలు సమావేశమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే రాత్రి దొంగలు స్వైరవిహారం చేయడం విశేషం. గ్రామంలో గాడితప్పిన లా అండ్ ఆర్డర్ ఒకే రాత్రి 6 ఇళ్లలో చోరీకి యత్నం గృహాల్లోనే పేకాట శిబిరాలు ఇటీవల చాకుతో యువకుడిపై దాడిచేసిన పేకాట బ్యాచ్ ఎస్సై ఆత్మహత్యతో కొరవడిన పోలీసు నిఘా బంగారు తాడు గుంజుకుపోయాడు 17వ తేదీ తెల్లవారుజాము 5 గంటల సమయంలో మొదటి అంతస్తు భవనంలో గుమ్మం శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి నా మెడలోని 3 కాసుల బంగారు తాడును గుంజుకుని పారిపోయాడు. నా భర్త గత కొంతకాలంగా వేరొక మహిళతో ఉంటుండగా దొంగ వెళ్తూవెళ్తూ ఆవిడ పేరు ప్రస్తావిస్తూ ఆమె జోలికొస్తే చంపేస్తానని హెచ్చరించి పారిపోయాడు. –దేవ లక్ష్మి నవదుర్గ భయాందోళన సృష్టించారు మా ఇంటి ముందు పెట్టిన మోటార్‌సైకిల్ 17వ తేదీన తెల్లవారిన తరువాత చూస్తే కనిపించలేదు. అదే రోజు రాత్రి నా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా దొంగలు హల్చల్ చేశారు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లు మాత్రమే దోచుకునే దొంగలు ఇప్పుడు ఇంట్లో మనుషులు ఉన్న ఇళ్లలోకి సైతం ప్రవేశించారు. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి భయాందోళన పరిస్థితులు లేవు. –చల్లా పెద్దిరాజు -
హత్య కేసులో నిందితుల అరెస్టు
గణపవరం: నిడమర్రు మండలం బావాయిపాలెంలో జరిగిన యువకుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గణపవరం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్‌కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వతేదీ రాత్రి బావాయిపాలెం గ్రామానికి చెందిన మజ్జి ఏసు(25) అనే వ్యక్తిని చంపివేసి చేయినరికి కాల్వలో పడవేసినట్లు కేసు నమోదైంది. ఈహత్య కేసును ఛేదించేందుకు ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు గణపవరం సీఐ ఎంవీ సుభాష్, గణపవరం, నిడమర్రు, చేబ్రోలు ఎస్సైలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్ల నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి, హత్యలో భాగస్వాములైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. వివాహేతర సంబంధమే కారణం ఈ కేసులో మొదటి ముద్దాయి పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసుకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ హత్యకు ప్రేరణ అన్నారు. మృతుడు తరచూ ముద్దాయి భార్యతో మాట్లాడటం, సెల్‌ఫోన్ మెసేజీలు పెడుతున్నాడన్న అనుమానంతో గతంలో కులపెద్దల సమక్షంలో తగవు పెట్టినా మృతుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడిని హతమార్చేందుకు పిల్లి ఏసుబాబు, అతని తండ్రి అన్నవరం, కోలమూరు గ్రామానికి చెందిన గెడ్డాడ శ్రీనివాసరావు పథకం రచించారు. ఈనెల 15వ తేదీన పిల్లి ఏసుబాబు తన భార్య ఫోన్లో ఆమె పెట్టినట్లుగా మజ్జి ఏసుకు ఫోన్లో మెసేజ్ పెట్టాడు. తాను ఉండి మండలం మహదేవపట్నంలో తన పుట్టింట్లో ఉన్నానని, రావాలని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన మజ్జి ఏసు మోటార్‌సైకిల్‌పై మహదేవపట్నం చేరుకుని, ఆమె ఇంటి డాబాపైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ముద్దాయిలు మజ్జి ఏసును పట్టుకుని దారుణంగా చావబాదారు. ఆ దెబ్బలకు తాళలేక మజ్జి ఏసు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆరా తీశారు. దీనితో మా గ్రామంలో కులపెద్దల సమక్షంలో తేల్చుకుంటామని చెప్పి మజ్జి ఏసును పిల్లి ఏసురాజు, గెద్దాడ శ్రీనివాసరావు మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని బావాయిపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బావాయిపాలెం శివారు కొత్తకోడుపుంత వద్ద ఆగారు. అప్పటికే అక్కడ కొబ్బరి గెలలుకోసే కత్తితో సిద్ధంగా ఉన్న పిల్లి ఏసుబాబు తండ్రి పిల్లి అన్నవరంతో కలిసి మజ్జి ఏసు కుడిచేతిని నరికివేశారు. చెయ్యిని కాలువలో పడేసి, బావాయిపాలెం శివారు పశువుల రేవు వద్ద మజ్జి ఏసును వదిలేసి వెళ్లిపోయారు. అధికరక్త స్రావంతో మజ్జి ఏసు కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వారు ఉపయోగించిన కత్తిని, మూడు మోటార్ సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్‌కుమార్ -
మోటారుసైకిల్ అదుపు తప్పి..
ఏలూరు (టూటౌన్): మోటారుసైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన భలే బాలాజీ (34) బంటా మేస్త్రిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతనికి వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య విభేధాలతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. బాలాజీ తన సొంత గ్రామంలో కాకుండా తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి కోటేశ్వర దుర్గాపురం వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలపై బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. వాగులో దిగబడిన స్కూల్ బస్సు జంగారెడ్డిగూడెం: పట్టెన్నపాలెం వద్ద బుధవారం జల్లేరు వాగును దాటుతుండగా ప్రైవేట్ స్కూల్ బస్సు దిగబడిపోయింది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం వాగులో నీరు లేకపోవడంతో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పట్టెన్నపాలెం గ్రామస్తులు స్పందించి ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీసుకువచ్చారు. ఇక్కడ హైలెవల్ బ్రిడ్జి నిర్మించి సురక్షిత రాకపోకలకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సొమ్ముల కోసం వెళ్లి.. నూజివీడు: పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పంజాబీ దాబా వద్ద బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేవరగుంటకు చెందిన పల్నాటి రామ్మోహన్రావు (55) పట్టణంలోని అమ్మవారితోట ప్రాంతంలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. ఉదయం పంజాబీ దాబాకు సొరకాయలు దిగుమతి చేసిన రామ్మోహన్రావు వాటి డబ్బుల కోసం ఇంటి సమీపంలో ఉండే విబూది రాంబాబు అనే వ్యక్తితో కలిసి పంజాబీ దాబా వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి దాబాలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విస్సన్నపేట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి అక్కడికక్కడే కన్నుమూశాడు. ఎస్సై జ్యోతిబసు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీఐ సత్య శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
జర్మనీ దేశ ప్రతినిధి బృందం ద్వారకాతిరుమల: జర్మనీ, యూరప్ దేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం తమ పర్యటన ద్వారా బలపడిందని జర్మనీ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ‘్ఙఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం’ (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ’ తరపున బృంద సభ్యులు జాస్పర్ జోర్డాన్, బెన్నెడిక్ట్ హెర్లిన్, పోర్చుగల్‌కు చెందిన ప్రాజెక్టు ఎర్త్ ప్రతినిధి డియోగో కౌటినో, అటెలియర్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కేహ్లే ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అలాగే ఏటీఎం(ఎనీ టైమ్ మనీ), ఏ గ్రేడ్ మోడల్స్‌తో పాటు, పీఏండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఆర్డీఎస్ (రబీ డ్రై సోయింగ్) తదితర పంట పొలాలను సందర్శించి, సాగు విధానాలపై ఆరా తీశారు. లెక్కల మాస్టారుపై డీఈఓ విచారణ ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు గతేడాది నవంబర్‌లో విద్యార్థులను చితకబాదిన ఘటనపై డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో ఒకటవ తరగతి చదివే గుండె త్రివిక్రమ్, నాల్గో తరగతి చదివే గుండె సహస్రలను గతేడాది నవంబర్ 25న లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు అకారణంగా చితకబాదిన ఘటనపై తల్లిదండ్రులు అప్పట్లో కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణలో విద్యార్థులను ముత్యాలరావు కొట్టాడని ఎంఈఓ నివేదికలో పేర్కొన్నా ఆయనపై డీఈఓ చర్యలు తీసుకోకుండా, బదిలీ చేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ, చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్ర వేణి బుధవారం పాఠశాలలో విచారణ జరిపి గుండె ధర్మరాజు, మాణిక్యాలు నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అలాగే ఎంఈఓ–1 డి.సుబ్బారావు, ఎంఈఓ–2 పి.వెంకట్రావుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం డీఈఓ మద్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. కాగా మొదటి నుంచి ఉపాధ్యాయుడు ముత్యాలరావును కాపాడుతూ వస్తున్న డీఈఓతో విచారణ జరిపిస్తే బాదితులకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. ఇతర అధికారులతో కలెక్టర్ విచారణ జరిపించాలని కోరుతున్నారు. -
చిరువ్యాపారులపై అధికారుల జులుం
ఏలూరు (టూటౌన్): రోడ్డుపక్కన ఆక్రమణల తొలగింపులో భాగంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పోలీసుల సహకారంతో బుధవారం స్థానిక సత్రంపాడు, శాంతి నగర్ ప్రాంతాల్లోని రోడ్డుపక్కన ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను, హోర్డింగ్‌లను, షెల్టర్లను తొలగించారు. దీనిపై కొందరు వ్యాపారాలు కార్పొరేషన్ వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు పక్కకు లాగేశారు. శాంతి నగర్ నేరెళ్ల హోండా షోరూమ్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన పలు దుకాణాలను ఈ సందర్భంగా తొలగించారు. సత్రంపాడు వంతెన వద్ద నుంచి ఇటు సీఆర్ఆర్ పబ్లిక్ స్కూలు సెంటర్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించడంతో వారంతా ఆందోళన చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా రోడ్డుకి ఇరువై అడుగుల దూరంలో ఎటువంటి అడ్డూలేని షాపులను కూల్చడం అన్యాయమని వైఎస్సార్ సీపీ ఏలూరు అసెంబ్లీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వైఎస్ శివరావు అన్నారు. బాధిత చిరు వ్యాపారులకు అండగా నిలబడి అధికారులను నిలదీశారు. ఆక్రమణల పేరుతో రోడ్డు పక్కన దుకాణాల తొలగింపు -
జీవితంపై విరక్తితో నిరుద్యోగి ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన ఉంగుటూరు: జీవితంపై మీద విరక్తితో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంసాలిపాలెంలో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం యర్రమిల్లిపాడుకు చెందిన దాసరి సత్యనారాయణ, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కల్లుగీత వృత్తి చేసుకునే ఈ కుటుంబం కంసాలిగుంటలో నివసిస్తోంది. సత్యనారాయణ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు పృధ్వీ చందు హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. తక్కెళ్లపాదులోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం పృధ్వీ చందు హైదరాబాద్ నుంచి ఈనెల 11న వచ్చాడు. ఫంక్షన్ అనంతరం ఈనెల 17న ఒక కుమార్తెను గోపాలపురంలో అత్తారింటి వద్ద దింపేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ వెళ్లారు. అదేరోజు మధ్యాహ్నం ఏమైందో గానీ పృధ్వీ చందు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కగదిలో ఉన్న మరో సోదరి ఎంతసేపు తలుపుకొట్టినా చందు తీయకపోవడంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు తీసీ చందుని భీమడోలులోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీ చందు మృతి చెందాడు. హైదరాబాదులో ఇంటర్న్‌షిప్ చేసే ఉద్యోగాన్ని వదిలేసి, మరొక కంపెనీకి ప్రయత్నం చేస్తుండగా రాకపోవడంతో విరక్తి చెంది పృధ్వీ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పృధ్వీ చందు మృతితో ఆ కుటుంబం శోకసంద్రమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేయగా మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెయ్యేరు అలేఖ్య కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరిజిల్లా గొల్లప్రోలుకు చెందిన మమ్మిడివరపు రాంబాబు, సంతోషిణి(26) దంపతులు. వీరు ఉపాధి నిమిత్తం పెయ్యేరులో కొంతకాలంగా నివాసముంటున్నారు. రాంబాబు చేపల చెరువుపై గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. బుధవారం ఉదయమే రాంబాబు విధుల నిమిత్తం బయటకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సంతోషిణి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళాడుతుండడం పిల్లలు గమనించి కేకలు వేశారు. స్థానికులు వచ్చి పరిశీలించి ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ జేఎస్ సుభానీ, ఎస్సై వీరభద్రరరావు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంతోషిణి బంధువు సింహాద్రి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోషిణి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
లంచావతార ఉద్యోగి తొలగింపు?
నిడమర్రు: ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అంటూ సాక్షిలో ఈనెల 14న వచ్చిన కథనంపై జిల్లా ఫారెస్టు అధికారులు స్పందించారు. లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నబిగారి శ్రీనివాసబాబును విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. శ్రీనివాసబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి రైతులను విచారించారు. అనంతరం నివేదికను జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించారు. నివేదికలోని అంశాలు బహిర్గతం కాకపోయినప్పటికీ అనధికారికంగా అందిన సమాచారం మేరకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న శ్రీనివాసబాబును విధులనుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. -
అర్జీల పరిష్కారంలో అలక్ష్యం
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజాసమస్యల పరిష్కార వేదిక అంటూ కూటమి సర్కారు పేరు మార్చిందే తప్ప సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. వేలాది ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలం గడుపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతీ సోమవారం సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసి సంబంధిత శాఖలకు వచ్చిన ఫిర్యాదులను బదిలీ చేస్తున్నారు. అయితే వందలాది ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వచ్చిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఫిర్యాదిదారులు మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సీఎం డాష్ బోర్డులో సైతం స్పష్టంగా ఫిర్యాదులు కనిపిస్తున్నప్పటికీ జిల్లాల సమాచారం ఎప్పటికప్పుడు నమోదవుతున్నా.. ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు జిల్లాలో 35 శాతం ఫిర్యాదులు పెండింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1845 ఫిర్యాదులు రాగా, 712 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయి. 1125 ఫిర్యాదులను పరిష్కరించినట్లు సీఎం డాష్‌బోర్డులో అంకెలు స్పష్టం చేస్తున్నాయి. 8 ఫిర్యాదులు రీ ఓపెన్‌లో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1149 ఫిర్యాదులు రాగా, 335 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉండగా, 805 ఫిర్యాదులు పరిష్కరించారు. 9 ఫిర్యాదులను రీ ఓపెన్ చేశారు. ఏలూరు జిల్లాతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా ఫిర్యాదుల పరిష్కారంలో ముందు వరుసలోనే ఉంది. సుమారు 70 శాతం పైగా ఫిర్యాదులను పరిష్కరించగా, ఏలూరు జిల్లాలో 65 శాతం ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాలకు పేర్లు మార్చడంలో చూపించిన శ్రద్ధ ఫిర్యాదులను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో సచివాలయాల్లోనే పరిష్కారం గతంలో ప్రతీ వారం స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై నివేదికలు ప్రభుత్వం పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణం ఆదేశాలు జారీ చేసేది. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ఫిర్యాదులు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సచివాలయాల పరిధిలోనే చర్యలు తీసుకునేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ప్రజా ఫిర్యాదులపై మాత్రం స్పందన అరకొరగా ఉంది. న్యూస్‌రీల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగానికి పైగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఫిర్యాదులపై పర్యవేక్షణ కరువు ఏలూరు కంటే మెరుగ్గా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,845కు 712 ఫిర్యాదులు పెండింగ్