అర్జీల పరిష్కారంలో అలక్ష్యం
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజాసమస్యల పరిష్కార వేదిక అంటూ కూటమి సర్కారు పేరు మార్చిందే తప్ప సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. వేలాది ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలం గడుపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతీ సోమవారం సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసి సంబంధిత శాఖలకు వచ్చిన ఫిర్యాదులను బదిలీ చేస్తున్నారు. అయితే వందలాది ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వచ్చిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఫిర్యాదిదారులు మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సీఎం డాష్ బోర్డులో సైతం స్పష్టంగా ఫిర్యాదులు కనిపిస్తున్నప్పటికీ జిల్లాల సమాచారం ఎప్పటికప్పుడు నమోదవుతున్నా.. ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
ఏలూరు జిల్లాలో 35 శాతం ఫిర్యాదులు పెండింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1845 ఫిర్యాదులు రాగా, 712 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయి. 1125 ఫిర్యాదులను పరిష్కరించినట్లు సీఎం డాష్‌బోర్డులో అంకెలు స్పష్టం చేస్తున్నాయి. 8 ఫిర్యాదులు రీ ఓపెన్‌లో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1149 ఫిర్యాదులు రాగా, 335 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉండగా, 805 ఫిర్యాదులు పరిష్కరించారు. 9 ఫిర్యాదులను రీ ఓపెన్ చేశారు. ఏలూరు జిల్లాతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా ఫిర్యాదుల పరిష్కారంలో ముందు వరుసలోనే ఉంది. సుమారు 70 శాతం పైగా ఫిర్యాదులను పరిష్కరించగా, ఏలూరు జిల్లాలో 65 శాతం ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాలకు పేర్లు మార్చడంలో చూపించిన శ్రద్ధ ఫిర్యాదులను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
గత ప్రభుత్వంలో సచివాలయాల్లోనే పరిష్కారం
గతంలో ప్రతీ వారం స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై నివేదికలు ప్రభుత్వం పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణం ఆదేశాలు జారీ చేసేది. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ఫిర్యాదులు పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సచివాలయాల పరిధిలోనే చర్యలు తీసుకునేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ప్రజా ఫిర్యాదులపై మాత్రం స్పందన అరకొరగా ఉంది.
న్యూస్‌రీల్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగానికి పైగా ఫిర్యాదులు పెండింగ్‌లో
ఫిర్యాదులపై పర్యవేక్షణ కరువు
ఏలూరు కంటే మెరుగ్గా పశ్చిమ గోదావరి
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,845కు 712 ఫిర్యాదులు పెండింగ్
అర్జీల పరిష్కారంలో అలక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment