Palnadu
-
బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి
మరో యువకుడు పరిస్థితి విషమం అద్దంకి: బైకును ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పార్వతీపురం గ్రామ శివార్లలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన యెనికపాటి చౌదరి (19) మార్బుల్ కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మద్దు అనిల్‌తో కలసి బుధవారం రాత్రి పార్వతీపురం గ్రామం వైపు నుంచి సొంతూరుకు బైక్‌పై వస్తున్నాడు. పార్వతీపురం గ్రామ శివారు దగ్గర మోదేపల్లి వెళ్తున్న కట్టెల ట్రాక్టరు ఢీకొట్టడంతో బైకు వెనుక వైపున కూర్చున్న చౌదరి మృతి చెందాడు. బైకు నడుపుతున్న అనిల్‌కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కట్టెల ట్రాక్టరు డ్రైవరు పరారీలో ఉన్నాడు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
విజ్ఞాన్, బౌలింగ్ గ్రీన్ వర్సిటీల మధ్య ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ – యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల (బీజీఎస్‌యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని, ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్తో పత్రాలను మార్చుకున్నట్టు వివరించారు. ఒప్పందం వల్ల తమ వర్సిటీ విద్యార్థులకు బీజీఎస్యూతో కలిపి జాయింట్ డిగ్రీలను అందజేయవచ్చునని పేర్కొన్నారు. సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉంటుందని వివరించారు. యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతోపాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కొల్ల, కెన్ (జాన్), సీఈవో మేఘన కూరపాటి, రిజి స్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ పాల్గొన్నారు. -
రెండు ఆటోలు ఢీ : వృద్ధుడి మృతి
దాచేపల్లి: రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందిన ఘటన దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళీగూడేనికి చెందిన పేరుపోగు ప్రేమదాసు (62) మృతి చెందాడు. ఎస్ఐ సౌందర్యరాజన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రేమదాసు ఆటోలో దామరచర్ల వైపు నుంచి వస్తున్నాడు. ఈ సమయంలో గామాలపాడు నుంచి శ్రీనగర్‌వైపు వెళుతున్న ఆటో దామరచర్ల వైపు వెళ్లుతున్న ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రేమదాసు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రేమదాసుని హస్పిటల్‌కి తీసుకెళ్తున్న క్రమంలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సౌందర్యరాజన్ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జిందాల్ ప్లాంట్‌ను సందర్శించిన ఐజీ రవికృష్ణ
యడ్లపాడు: కృష్ణా జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నాలుగు టన్నుల అక్రమ గంజాయిని ధ్వంసం చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించింది. ప్లాంట్ ఆపరేషన్ ఏపీ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమావేశమయ్యారు. ప్లాంట్‌లో ఈనెల 22న గంజాయి దహనం కోసం అనుమతి తీసుకున్నారు. కార్యక్రమానికి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం అధికారుల బృందం ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించింది. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్, ఈగల్ విభాగం ఎస్పీ కె. నగేష్‌బాబు, గన్నవరం డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు, పెనమలూరు ిసీఐ వెంకటరమణ, చిలకలూరిపేట గ్రామీణ సీఐ బి. సుబ్బరాయుడు, ఎస్ఐ వి. బాలకృష్ణ పాల్గొన్నారు. పట్టుబడిన నాలుగు టన్నులు గంజాయి దహనానికి ఏర్పాట్లు ప్లాంట్ అపరేషన్ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమీక్ష ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్ విభాగాల పరిశీలన -
ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఉద్రిక్తత
దాచేపల్లి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బుధవారం రాత్రి దాచేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శోభయాత్ర లైబ్రరీ సెంటర్లోకి రాగానే భారీఎత్తున నినాదాలు చేశారు. ఓ వ్యక్తి టిప్పు సుల్తాన్ జెండా చూపుతూ హల్చల్ చేయడంతో శోభాయాత్రలో ఉన్న యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రలో రాళ్లు విసిరారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ జగదీష్ పరిశీలించి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలన్నింటిని మూసి వేయించారు. డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించారు. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి లాఠీచార్జీ చేసిన పోలీసులు -
స్కూల్ బస్‌ను ఢీకొన్న కూలీల ఆటో
ఏడుగురికి స్వల్ప గాయాలు జరుబులవారిపాలెం (కారంచేడు): పక్కన ఆగి ఉన్న స్కూల్ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జరుబులవారిపాలెం గ్రామం నుంచి ఇంకొల్లు వెళ్లే రహదారిలో బుధవారం జరిగింది. ఎస్సై వి. వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు నుంచి వచ్చి వెళ్తోంది. వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడుకు వస్తున్న ఆటో ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి పోగా, కూలీలలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కొందరు స్కూల్ బస్సు వచ్చి ఆటోను ఢీకొందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఏఎస్ఐ బి. శేషసాయి సేకరించారు. -
తక్కువ ధరకే టెండర్ ఖరారు చేసినా ఆరోపణలు
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్న ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటూ తిరిగి అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ రచ్చకెక్కడటం పరిపాటిగా మారింది. జెడ్పీ సీఈవో విధుల్లో నిత్యం జోక్యం చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినా, అక్కడ అవినీతి జరుగుతోందని తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. జెడ్పీలో సీఈవోగా కొనసాగుతున్న ఉన్నతాధికారిపై పాలకవర్గంలో ఉన్న కీలక వ్యక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని జెడ్పీటీసీలు ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదనతో జెడ్పీని భ్రష్టు పట్టిస్తున్న ఆమె సీఈవోలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ జెడ్పీ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న వి. జ్యోతిబసు గుంటూరు జిల్లాకు వచ్చి మూడు నెలలైంది. కృష్ణాజిల్లా సీఈవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో ఇక్కడికి వచ్చిన ఆయనపై అప్పుడే జెడ్పీ పాలకుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు వరుసగా రెండేళ్ల పాటు ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో స్టడీ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేశారు. జెడ్పీ పాలకులు పార్టీ మారిన తరువాత మూడోసారి మెటీరియల్ పంపిణీకి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ నుంచి మెటీరియల్ తెప్పించుకుని, టెండర్లు పిలిచి ప్రింటింగ్ చేయించే బాధ్యత సీఈవోకు అప్పగించారు. అయితే, ముద్రణలో ఉండగానే మరో వైపు స్టడీ మెటీరియల్ పంపిణీలో జాప్యం అంటూ ఆరోపణలు చేయించారు. అధికారులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. స్టడీ మెటీరియల్‌పై సీఎం, విద్యాశాఖ మంత్రి ఫోటోలు ముద్రించలేదని, సీఈవోను లక్ష్యంగా చేసుకున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. సీఈవో పోస్టు అంటే హడలెత్తిపోతున్న అధికారులు జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలి తమ అవినీతిని దాచి అధికారుల చేతికి మసిపూస్తున్న వైనం నాలుగేళ్లలో మారిన నలుగురు సీఈవోలు ప్రస్తుత సీఈవో వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపరఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 34,747 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముద్రణకు సంబంధించి గతంలో కంటే తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టినా సీఈవోపై అర్థం లేని అవినీతి ఆరోపణలు చేయించారు. ఒక పేజీ ముద్రణకు గతంలో 33 పైసలు చెల్లించగా, ప్రస్తుతం అది 30 పైసలకే ఖరారు చేశారు. ఈ విధంగా 564 పేజీలతో ముద్రణ పూర్తయిన పుస్తకాలకు గాను జెడ్పీకి రూ. లక్షల్లో ఆదా అయింది. టెండర్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున అధికారులపై ఆరోపణలు సాగిస్తుండగా, అసలు ఇప్పటి వరకు ముద్రణదారులకు చెల్లింపులు జరపలేదని అధికారులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్‌కు పైసా చెల్లించకుండా అవినీతి ఆస్కారం ఎక్కడ ? అని పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీకి సీఈవోలుగా వచ్చిన వారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వారిని బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టి సారించిన పరిస్థితులు లేవు. పరిస్థితులు ఇలాగే ఉంటే జెడ్పీ సీఈవోగా వచ్చేందుకు సైతం అధికారులు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. -
పల్నాడు
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి అమ్మ ఆలయ నిర్మాణానికి పట్టణానికి చెందిన మక్కెన సుబ్బారావు దంపతులు రూ.1,01,116ను అందించారు. వైభవంగా కోటి కుంకుమార్చన పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు. 7 -
డాక్టర్ శరత్ చంద్రకుమార్ ఔదార్యం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల 1998 బ్యాచ్ విద్యార్థి, గుంటూరు చంద్ర కేర్ న్యూరో స్పెషాలిటీ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నలమోతు శరత్‌చంద్రకుమార్ తన తల్లి శైలజకుమారి జ్ఞాపకార్థం గుంటూరు వైద్య కళాశాలలో తారు రోడ్ల నిర్మాణానికి రూ. 6 లక్షలు అందజేశారు. ఈ విరాళంతో నిర్మించిన రోడ్లను బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరాచారి శరత్‌చంద్రకుమార్‌ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేడు, రేపు న్యాయవాదులు విధుల బహిష్కరణ గుంటూరు బార్ ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి గుంటూరు లీగల్ : న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్లు –2025కు వ్యతిరేకంగా గుంటూరు బార్ ఫెడరేషన్ నిరసన తెలుపుతుందని ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురు, శుక్రవారాల్లో విధులను బహిష్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంకు నుంచి సురేష్‌కుమార్ తొలగింపు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ బ్లడ్‌బ్యాంక్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సురేష్‌కుమార్‌ను అక్కడి విధుల నుంచి తొలగించి ఇతర వార్డుకు మార్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’ పత్రికలో ‘జీజీహెచ్‌లో జలగలు’ శీర్షకన ఈనెల 18న బ్లడ్‌బ్యాంక్‌లో జరుగుతున్న అవినీతిపై కథనం ప్రచురితమవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తక్షణమే ఆయన్ను బ్లడ్‌బ్యాంక్ నుంచి తొలగించి సూపరింటెండెంట్ కార్యాలయానికి రిఫర్ చేయాల్సిందిగా యశస్వి రమణ ఆదేశించారు. బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జిగా డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ జి.శివరామకృష్ణలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎండీసీ ఎండీ సంతకంతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఫిర్యాదు చేసిన కార్యాలయ సిబ్బంది తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ శుక్లా పేరుతో నకిలీ డిజిటల్ సంతకంతో అపాయింట్మెంట్ లెటర్ బయటపడినట్లు కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ జయరాం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గత కొంత కాలంగా ఏపీ ఎండీసీ కార్యాలయానికి సంబంధించి డిజిటల్ సంతకంతో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నట్లు ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరమ్మతల్లీ...పాహిమాం... ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం భక్తజన కోలాహలంగా మారింది. శిడి బండి మహోత్సవం పూర్తవటంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. మహిళలు పాలపొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. వీరమ్మతల్లీ...అమ్మా...పాహిమాం...అంటూ చల్లని తల్లికి పూజలు చేశారు. ఉయ్యూరు పాల వ్యాపారులు, వీరమ్మతల్లి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జంపాన పూర్ణిమ, కేపీస్ డెంటల్ ఆసుపత్రి చైర్మన్ దాడి కై లాష్కుమార్ దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. -
వీడియో కాల్‌లోనే ఆఖరి చూపు
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): గన్ బుల్లెట్ బ్యాక్ ఫైర్ కావడంతో బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) మృతి చెందారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వారిని చదివించారు. ఇంటర్ వరకు చదివి 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ 16వ లైట్ క్యావలరీ ఆర్మ్డ్ రేంజ్మెంట్లో రాజస్థాన్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనకు గాయత్రితో వివాహం జరిగింది. వారికి కుమార్తె జ్యోత్స్న ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భౌతికకాయం సూరజ్గడ్లోని మిలిటరీ హాస్పటల్ నుంచి విమానంలో గురువారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుందని, తరువాత రోడ్డు మార్గాన పిట్టలవానిపాలెంలోని ఆయన స్వగృహానికి తీసుకొస్తామని సైనికాధికారులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ సోదరుడు గోపీకృష్ణ సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఉన్నారు. అన్న మరణ వార్తతో తల్లడిల్లిపోతున్నారు. మాకిక దిక్కెవరంటూ మోహన్ వెంకటేష్ భార్య గాయత్రి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది. రాజస్థాన్‌లో బాపట్ల జిల్లాకు చెందిన సైనికుడు మృతి నేడు స్వస్థలానికి భౌతికకాయం బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు -
దేచవరంలో భూచోళ్లు
నరసరావుపేట: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో చర్మకారుల సహకార సంఘానికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైంది. గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో ఆన్లైన్ చేయించుకొని, నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. దర్జాగా అనుభవిస్తున్న విషయం బయటకు పొక్కడంతో కొన్నాళ్లపాటు మిన్నకుండిపోయారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి సదరు భూమిని ఆక్రమణ చేసుకొని సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా నాలుగు రోజుల కిందట భూమిలో ముళ్లపొదలు తొలగించి తమదిగా నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ఎస్ఆర్, అడంగల్‌లో స్పష్టంగా నమోదు 1970లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం దేచవరం గ్రామంలోని చర్మకారుల సహకార సంఘం కోసం భూమిని కేటాయించే ప్రక్రియ ప్రారంభించింది. గ్రామ పరిధిలోనే రూపెనగుంట్ల గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని సర్వే నంబరు 192–6బి1లో 3.56 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అందులో ఎకరాన్ని చర్మకారుల సహకార సంఘానికి కేటాయించారు. వివరాలు ప్రసుత్తం కూడా ఆర్ఎస్ఆర్, అడంగల్‌లో స్పష్టంగా ఉన్నాయి. ఆక్రమణ రహస్యం బయటకు వచ్చిందిలా... వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కుటుంబాలకు నివేశనా స్థలాలు మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వ భూమి కోసం అధికారులు రికార్డులు తిరగేశారు. చర్మకారులకు కేటాయించిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని బయటకు లాగారు. ఆన్లైన్ చేయించుక్నున వ్యక్తి తన కుమారుల పేరుపై తప్పుడు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తేలింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆన్లైన్ నుంచి పేర్లను తొలగించి చర్మకారుల సొసైటీ పేరు మీదే తిరిగి ఆన్లైన్ చేశారు. ముళ్ల పొదలు తొలగింపు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో మిన్నకుండిపోయిన సదరు వ్యక్తి గత నాలుగు రోజులుగా సదరు స్థలాన్ని తిరిగి ఆక్రమణ చేసుకునే పనిలో ఉన్నాడు. సంఘానికి చెందిన భూమిలో ముళ్లపొదలు తొలగించి, కబ్జా చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. తన పేరుపై తిరిగి ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించి తప్పుడు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పలువురు ఎస్సీలు కోరుతున్నారు. చర్మకారుల సహకార సంఘం భూమి ఆక్రమణ రోడ్డు పక్కనే ఉండండతో ఆక్రమణదారుల కన్ను పట్టపగలే ముళ్లపొదలు తొలగించి సొంతం చేసుకునే యత్నం గతంలో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్లు -
చిన్నారులను తీర్చిదిద్దాలి
డీఈఓ చంద్రకళ కారెంపూడి: బడిపై ఆసక్తి కలిగేలా అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులను తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3,4,5 ఏళ్లలోపు చిన్నారులను బడికి ఆకర్షితులను చేయడం అంగన్వాడీల చేతుల్లోనే ఉందని చెప్పారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి కలిగేలా నర్సరీ బోధన సాగాలని తెలిపారు. అనంతర జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని, పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని తనిఖీ చేశారు. ప్రీ పైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించి, వాటిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈఓ టి. రవికుమార్, జెడ్పీ హెచ్ఎం అనంత శివ ఉన్నారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి
క్రోసూరు: ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని బాలెమర్రులో జరిగింది. ఎస్ఐ నాగేంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నుంచి మిర్చి కోతలకు 40 మంది కూలీలు బాలెమర్రు గ్రామానికి వచ్చారు. వారు పనులకు వెళ్తున్న క్రమంలో నగేష్ సోదరుడు సిద్ధరామయ్య ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చుని జారి పడిపోయాడు. తలకు గాయమైంది. 108 వాహనంలో సత్తెనపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడుకి భార్య, పాప ఉన్నారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సూర్యప్రకాశరావు మృతి తీరని లోటు కొరిటెపాడు: కోల్డ్ స్టోరేజెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫెడరేషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వైస్ ప్రెసిడెంట్‌గా, గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా గత 30 ఏళ్లుగా సేవలందించిన తడికమళ్ల సూర్యప్రకాశరావు బుధవారం ఉదయం మృతిచెందారు. సూర్యప్రకాశరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు పలు రకాల సేవలు అందించారని పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు కొనియాడారు. కోల్ట్ స్టోరేజ్‌ల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. రైతు సోదరుల కోసం ఆరు కోల్డ్‌స్టోరేజీలను సొంత ఖర్చులతో పలు ప్రాంతాల్లో నిర్మించి నడుపుతున్నారని గుర్తు చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సూర్యప్రకాశరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి యువకుడిపై పోక్సో కేసు మంగళగిరి టౌన్: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి నగరానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. పార్కురోడ్డుకు చెందిన శ్యామ్‌బాబు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్‌బాబు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాలిక అడగడంతో వివాహానికి నిరాకరించాడు. దీంతో బాలిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యార్డుకు 1,47,414 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,47,414 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,42,943 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,900 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 75,790 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
పోలీసు శాఖకు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం వెన్నుముక
ఏఆర్ బలగాల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ నరసరావుపేట: జిల్లా పోలీసు శాఖకు ఆర్మ్‌డు రిజర్వ్ విభాగం వెన్నెముక అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏఆర్ వార్షిక మొబిలైజేషన్ (సమీకరణ) కార్యక్రమం ఈనెల ఐదో తేదీన పరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైంది. బుధవారం అదే గ్రౌండ్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు బలగాల కవాతును వీక్షించారు. అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా బలగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబలైజేషన్ కార్యక్రమాన్ని సర్వీస్‌లో ఉన్న ఏఆర్ సిబ్బంది భారంగా భావించవద్దని కోరారు. గురుతరమైన బాధ్యతను భుజాల మీద పెట్టినప్పుడు ఎంతటి కష్టమైనప్పటికీ దానికి తగ్గట్టు విధులు నిర్వర్తించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్యం, పిల్లలు, కుటుంబం పూర్తి బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి పెరేడ్ నిర్వహణ, వీఐపీ సెక్యూరిటీ, రక్షణ, ఆయుధాలను ఉపయోగించడంలో మెళకువలు, ఫైరింగ్ ప్రాక్టీసు, బందోబస్తులో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాంబ్, డాగ్ స్క్వాడ్, అత్యవసర పరిస్థితుల్లో జనసమూహం నియంత్రణ తదితర నైపుణ్యాలను పునఃసమీక్షించి వాటిలో సిబ్బందిని నిష్ణాతులుగా చేసినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో అధికారులు, సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్లపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వృత్తి నైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమం రూపొందించినన ఏఆర్ అధికారులైన అదనపు ఎస్పీ వి.సత్తిబాబు, డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఆర్ఐ అడ్మిన్ ఎం.రాజా, ఎంటీవో, వెల్పేర్ ఆర్ఐలు కృష్ణ, గోపీనాథ్‌లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, ఎస్బీ సీఐలు సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
కిడ్నాప్, హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు తెనాలి రూరల్: కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన ఇద్దరు యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి దాడి చేసి హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్‌బాబు తెలిపారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తెనాలి నందులపేటకి చెందిన మన్నే మణిదీప్‌కు కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన జానా సతీష్, మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని మణిదీప్‌ను అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ సతీష్ అతని స్నేహితుడు పండు ఈనెల 14న విజయవాడ వచ్చారు. మణిదీప్, అతని స్నేహితులు ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోటా ప్రేమ్‌చంద్, బచ్చలకూర రమేష్‌బాబుతో కలిసి విజయవాడ వెళ్లి సతీష్, పండును కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకువచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుంచి తప్పించుకున్న సతీష్, పండు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు సిబ్బంది పాల్గొన్నారు. -
మరణించినా.. నలుగురికి పునర్జన్మ
మహిళ అవయవదానం మంగళగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన మహిళ అవయదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది. తాను మట్టిలో కలిసినా.. నలుగురి జీవితాలకు వెలుగిచ్చింది. విజయవాడ భవానీపురానికి చెందిన ఎం.సరస్వతి(54) ఈనెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అభినందించిన వైద్యులు జీవన్‌ధాన్ ద్వారా సరస్వతి శరీరం నుంచి కిడ్నీలు, కళ్లు, గుండె, లివర్, లంగ్స్‌ను సేకరించారు. లివర్, కిడ్నీ, లంగ్స్‌ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన రోగులకు శస్త్రచికిత్సతో అమర్చారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు. సరస్వతి అవయదానం చేసి మరికొందరి జీవితాలకు పునర్జన్మ అందించడం అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఆమె బాటలో ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. అవయవదానం అభినందనీయం అవయదానం అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా, ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా అవయవ దాత సరస్వతి గౌరవార్థం ప్రభుత్వం అందజేసిన నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ నగదును ఆమె కుటుంబ సభ్యులు లేనివారి కోసం ఖర్చుచేయాలని ఎయిమ్స్ డైరెక్టర్‌కు అందజేశారు.