
వీడియో కాల్‌లోనే ఆఖరి చూపు
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): గన్ బుల్లెట్ బ్యాక్ ఫైర్ కావడంతో బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) మృతి చెందారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వారిని చదివించారు. ఇంటర్ వరకు చదివి 2019 డిసెంబర్‌లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ 16వ లైట్ క్యావలరీ ఆర్మ్‌డ్ రేంజ్‌మెంట్‌లో రాజస్థాన్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనకు గాయత్రితో వివాహం జరిగింది. వారికి కుమార్తె జ్యోత్స్న ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్‌లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భౌతికకాయం సూరజ్‌గడ్‌లోని మిలిటరీ హాస్పటల్ నుంచి విమానంలో గురువారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుందని, తరువాత రోడ్డు మార్గాన పిట్టలవానిపాలెంలోని ఆయన స్వగృహానికి తీసుకొస్తామని సైనికాధికారులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ సోదరుడు గోపీకృష్ణ సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఉన్నారు. అన్న మరణ వార్తతో తల్లడిల్లిపోతున్నారు. మాకిక దిక్కెవరంటూ మోహన్ వెంకటేష్ భార్య గాయత్రి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది.
రాజస్థాన్‌లో బాపట్ల జిల్లాకు చెందిన సైనికుడు మృతి
నేడు స్వస్థలానికి భౌతికకాయం
బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు

వీడియో కాల్‌లోనే ఆఖరి చూపు
Comments
Please login to add a commentAdd a comment