Annamayya
-
అడ్మిషన్ల జోరు.. తల్లిదండ్రుల బేజారు!
●నిబంధనలకు విరుద్ధంగా.. ‘ హలో సార్... మీ పాప రమ్య పదవ తరగతి చదువుతున్నది కదా..! ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలానా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఎంసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్‌ను విజిట్ చేసి చూడండి ’ . ‘సార్ గుడ్ ఈవినింగ్, సురేష్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా. బీటెక్ కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్సు, ఏఐఎంల్, డేటా సైన్సు, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే చెప్పండి... రాయితీలు ఇప్పిస్తాం’... మదనపల్లె సిటీ: టెన్త్, ఇంటర్ చదవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి 21,468 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ 15,356 మంది, ద్వితీయ సంవత్సరం 14,248 మంది రాస్తున్నారు. కనీసం వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాకముందే కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా మదనపల్లె, రాయచోటి, రాజంపేటతో పాటు మండల కేంద్రాల్లో సైతం బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి... తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లు కాకుండా వాట్సాప్‌లకు అడ్మిషన్ల మెసేజ్‌లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజినీరింగ్ కాలేజీలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షలో ఫీజులు బాదేస్తున్నారు. మరో వైపు పీఆర్ఓలు... జిల్లాలో ప్రధానంగా తిరుపతి, విజయవాడ కేంద్రాల కార్పొరేట్ కాలేజీల తరపున వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం ఆయా విద్యా సంస్థల పీఆర్ఓలు రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కాలేజీల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీ పడుతున్నారు. పరీక్షల కంటే ముందే అడ్మిషన్ల కోసం తంటాలు ఇంటర్, ఇంజినీరింగ్ కోర్సుల పేరిటముందస్తు దోపిడీ తల్లిదండ్రులకు పెరిగిన ఫోన్ల తాకిడి సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈ సారి గత ఏడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కాలేజీలు సిద్ధమయ్యాయి. -
జిల్లా అధికారి పరిధిలోకి పది ఆలయాలు
బి.కొత్తకోట: జిల్లాలో 6–బి2 గ్రేడ్ కలిగిన పది ఆలయాలను దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పరిధి నుంచి తొలగించి జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయాల పాలన ఇకపై జిల్లా అధికారి పరిధిలోకి వచ్చింది. జిల్లాలోని పీలేరు మండలం దొడ్డిపల్లిలోని చెన్నకేశవస్వామి ఆలయం, నిమ్మనపల్లి మండలం తవళంకు చెందిన నేల మల్లేశ్వరస్వామి ఆలయం, కురబలకోట మండలం తెట్టులోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, మదనపల్లిలోని సోమేశ్వరస్వామి ఆలయం, బి.కొత్తకోటలోని చెన్నకేశవ, ఆంజనేయస్వామి ఆలయాలు, చిన్నమండెం మండలం మల్లూరులోని మల్లూరమ్మ దేవత ఆలయం, రాజంపేటలోని ఆంజనేయస్వామి ఆలయం, కోడూరులోని భుజంగేశ్వర స్వామి ఆలయాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా అధికారి పరిధిలోకి వచ్చాయి. ఈ ఆలయాలన్నింటిని కర్నూలు డిప్యూటీ కమిషనర్ పరిధి నుంచి తొలగించారు. మైక్రో ఇరిగేషన్‌ను సద్వినియోగం చేసుకోండి రాయచోటి టౌన్: మైక్రో ఇరిగేషన్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని, ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయి ప్రత్యేక అధికారి ( ఓఎస్డీ) రమేష్ అన్నారు. బుధవారం రాయచోటి నియోజక వర్గ పరిధిలోని రాయచోటి, రామాపురం, వీరబల్లె మండలాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో మైక్రో ఇరిగేషన్ వ్యవసాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని సాగు చేసుకొనే విధానంలో మైక్రో ఇరిగేషన్ ఒకటన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం 15000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అయితే 9339 మంది రైతుల ద్వారా 9694 హెక్టార్లలో సాగు అవుతున్నట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఐఓ లక్ష్మీప్రసన్న, ఎంఐడీసీలు, ఎంఐఈ క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫర్నిచర్ సరఫరాకు కొటేషన్లు ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: కడప స్పెషల్ పోక్సో కోర్టు కోసం కొత్త ఫర్నిచర్ వస్తువుల సరఫరా కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని టాక్స్లతో కలుపుకొని 7 ఐరన్ అల్మారాలు, 1 ఐరన్ ర్యాక్, 8 ఆఫీసు టేబుల్స్, 3 కుషన్ ఛైర్స్, 30 ‘ఎస్’ౖ టెప్ మార్క్ ఛైర్స్, ఒక క్రోన్ చైర్, 5 ఐరన్ స్టూల్స్, 2 కోట్ హాంగర్స్, 3 ఉడెన్ బెంచులు, ఒక సోఫా సెట్, 5 టీపాయి, ఒక డైనింగ్ టేబుల్, ఒక ప్లాస్టిక్ చైర్ మొత్తం 13 రకాల ఫర్నిచర్ వస్తువుల కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నామన్నారు. టెండరుదారు సమర్పించే కొటేషన్ కవరు పైన ‘కొటేషన్ ఫర్ సప్లయ్ అండ్ ఇన్స్టాలేషన్ ఫర్ ఫర్నీచర్ ఐటమ్స్’అని నమోదు చేసిన సంబంధిత షీల్డు కొటేషన్లను ఈనెల 21వతేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు, కడపలో సమర్పించాలన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌కు ఐఎస్ఓ గుర్తింపు మదనపల్లె: వందేళ్లకు పైబడి ఘన చరిత్ర కలిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్‌ను అందుకుంది. సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాద ఘటన తర్వాత ఆధునికీకరించిన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. నూతన కార్యాలయ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెవెన్యూ, సాధారణ పరిపాలన, విపత్తు నిర్వహణ తదితర పాలనా విషయాలకు సంబంధించి, ఐఎస్ఓ 9001:2015 ప్రమాణాలను అనుసరిస్తూ, నాణ్యతతో కూడిన సేవలు ప్రజలకు అందించడంపై హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫిబ్రవరి 17న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి అందించిన ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్లను ప్రత్యేకంగా అభినందించారు. -
పోలీస్ శాఖపై విశ్వసనీయత పెంచాలి
రాయచోటి: పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పెంచాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరపాలని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. నేర నిరూపణలకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ నేర పరిశోధన చేయాలన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి.. అలవాటు పడిన నేరస్తులపై రౌడీషీట్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఉక్కుపాదం మోపాలి.. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే వారిపట్ల కఠిన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలతో మంచి సంబంధాలు.. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాలలోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
ఒంటిమిట్ట క్షేత్రం రెండో అయోధ్యను తలపిస్తోంది
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం రెండో అయోధ్యను తలపిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ (ఐఏఎస్) ప్రశంసించారు. బుధవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఒంటిమిట్ట చెరువులో నీటి వసతి కల్పిస్తే ట్యాంక్‌బండ్ తరహాలో బోటింగ్ నిర్వహించవచ్చన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆలయ చరిత్ర అన్ని భాషల్లో తెలిసే విధంగా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఆలయం అయోధ్య, వారణాసి తరహాలో పర్యాటకులకు ఆకర్షిస్తుందన్నారు. అలాగే ఇక్కడ ఉన్న హరిత రెస్టారెంట్‌ను పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళిక, మార్పులు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట రామయ్య క్షేత్ర గోపురాలు మూసిపోయి ఉండడం గమనించి పురావస్తు శాఖ అధికారులు కెమికల్‌తో గోపురాలను శుద్ధిచేస్తే బాగుంటుందన్నారు. ఈయన వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్ కుమార్, కడప ఆర్డీఓ జాన్ ఇరివిన్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఈశ్వరయ్య, డివిజనల్ మేనేజర్ మల్లికార్జున, ఒంటిమిట్ట తహసీల్దార్ వెంకటరమణమ్మ, ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ అంజనా గౌరీ ఉన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -
మార్చి నెలాఖరులోపు లక్ష్యం పూర్తి చేయాలి
రాయచోటి (జగదాంబసెంటర్): మార్చి నెలాఖరులోపు జిల్లా సూక్ష్మ నీటి సాగు పథక లక్ష్యాలను పూర్తి చేయాలని ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయి ప్రత్యేకాధికారి డి.రమేష్ పేర్కొన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని జిల్లా సూక్ష్మ నీటి సాగు పథక కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీ జిల్లా సమన్వయకర్తలు, మైక్రో ఇరిగేషన్ క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం 15 వేల హెక్టార్లకు ఇప్పటి వరకు 9339 మంది రైతులకు 9694 హెక్టార్లు అమలు చేశామన్నారు. మిగిలిన లక్ష్యాన్ని క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదు చేసుకున్న రైతులకు ప్రాథమిక సర్వేలు చేపట్టి, అంచనాలు పూర్తి చేసి రైతుల వాటా కట్టించాలన్నారు. అంతకు ముందు రామాపురం, వీరబల్లి, రాయచోటి మండలాల్లోని పలు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన మైక్రో ఇరిగేషన్ పరికరాలను రైతుల పొలాల్లో సక్రమంగా అమర్చారా లేదా అని తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంఐఓ లక్ష్మీప్రసన్న, ఎంఐడీసీ, ఎంఐఈలు, కంపెనీ క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీఎంఐపీ రాష్ట్ర స్థాయిప్రత్యేకాధికారి డి.రమేష్ -
తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు
తాగునీటి కోసం నారాయణరాజుపేటకు వెళ్లాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో రోజువారీగా చేసుకునే పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దయచేసి అధికారులు, ప్రజా ప్రతినిధులు మాకు గుక్కెడు నీరు అందించి అన్ని విధాలా ఆదుకోవాలి. – చిన్నక్క, వెంకటాద్రిపురం ఎస్టీకాలనీ, పాటూరు గ్రామపంచాయతీ, నందలూరు మండలం నీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలి మా గ్రామంలోని తాగునీటి సమస్యపై ఎన్నోమార్లు నాయకులకు విన్నవించుకున్నా పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన బోరులో కూడా ఒక్కొక్కసారి నీళ్లు రావడం లేదు. మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నాం. మా సమస్యను పరిష్కరిస్తే అంతే చాలు. – యాసగిరి లక్ష్మీదేవి, వెంకటాద్రిపురం ఎస్టీ కాలనీ, పాటూరు గ్రామపంచాయతీ, నందలూరు మండలం -
●కటకటకు కౌంట్‌డౌన్
అన్నమయ్య జిల్లాలో 500కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే వేసవి నేపథ్యంలో తాగునీటి కటకటకు కౌంట్‌డౌన్ మొదలవుతోంది. ప్రధానంగా నందలూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ వెంకట్రాదిపురం ఎస్టీ కాలనీలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడున్న ప్రజలు తాగునీటి కోసం ప్రతినిత్యం యుద్ధం చేస్తున్నారు. అక్కడే కాకుండా రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్‌కు వచ్చి పలు గ్రామాల ప్రజలు జిల్లాలోని ఉన్నతాధికారురులకు వినతులు సమర్పించారు. రానున్న కాలంలో పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా తాగునీటి సమస్య చాలాచోట్ల ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మామిడి రైతుకు ఏదీ భరోసా..?
రాష్ట్రంలో మామిడి చెట్ల పెంపకం, మార్కెటింగ్‌లో అన్నమయ్య జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. చిత్తూరు జిల్లాకు సమానంగా అన్నమయ్య జిల్లా మామిడికి ప్రసిద్ది చెందింది. ఈ సారి మామిడి విక్రయాలకు భరోసా లేకుండా పోతోంది. రాయచోటి, కోడూరులలో మార్కెటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా నేటికీ అమలు కాలేదు. కొనుగోలు కోసం దళారుల వైపు చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ సారైనా ప్రభుత్వ పరంగా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాయచోటి : అన్నమయ్య జిల్లాలోనే 34వేల హెక్టార్ల లో వివిధ రకాల మామిడి తోటలు సాగులో ఉన్నాయి. రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో పోటాపోటీగా మామిడి తోటలను సాగు చేశారు. దిగుబడి కూడా జిల్లాలో అధికంగానే ఉంటుంది. తెగుళ్ల బెడదతో రెండేళ్లుగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులు, వెంటాడుతున్న తెగుళ్లతో పూత, పిందె దశలలో ఉంది. పూత మురిపిస్తున్నా ఆశించిన మేర ఎదుగుదల లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. తెగుళ్ల నివారణకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో లభించిన మందులన్నింటినీ చల్లుతున్నారు. కొంతమంది రైతులు మామిడి పిందెలకు కవర్లు కట్టి రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. దళారుల బెడదతో ఇబ్బందులు సవాళ్ల మధ్య తోటలను కాపాడుకుంటున్నా.. సరియైన గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు, దళారులు రావడం, వారు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయడం, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి సొమ్ముచేసుకోవడంతో తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. గతంలో ఉన్న మామిడి రైతుల ఉత్పత్తి సమైక్య కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఉద్యాన, మార్కెటింగ్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో కొనుగోలుపై స్పష్టత లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. గత వైకాపా పాలనలో రాయచోటి, కోడూరులలో మార్కెటింగ్ కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. అసలే తెగుళ్ల బెడదతో సక్రమంగా దిగుబడి రావడం లేదని, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి న్యాయం చేయాలంటూ మామిడి తోట రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. దళారులతో దగా పడుతున్న మామిడి రైతులుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం మామిడి రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మామిడి మామిడి ధరల విషయంలో స్థానిక జ్యూస్ కంపెనీలతో చర్చించడం జరుగుతుంది. తెగుళ్లను నివారించుకొని అధిక దిగుబడులు వచ్చేలా సాగులో తగు మెలకువలు పాటించాలి. – రవీంద్రబాబు, జిల్లా ఉద్యాన అధికారి -
వక్ఫ్‌బోర్డు పేరుతో భూముల కబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : వక్ఫ్ బోర్డు పేరుతో పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో భూములు కబ్జా చేసి అనుమతి లేకుండా దుకాణాలు నిర్మించారు... వాటిని సబ్ లీజుకు ఇచ్చేసి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియాను కలిసి, ఎమ్మెల్యే అక్రమాలపై స్థానికులు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ నుంచి పట్టణానికి చెందిన వ్యక్తి 20 హవాన్సులకు కొనుగోలుచేశారన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా వక్ఫ్ బోర్డు పేరుతో భూములను కబ్జా చేశారన్నారు. దుకాణాలు నిర్మించి అద్దె వసూళ్లుకు ఆయనే కమిటీ ఏర్పాటు చేశారన్నారు. జామియా మసీదుకు చందా ఇచ్చినట్లుగా రసీదు అందజేస్తున్నారన్నారు. వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రికార్డులన్నీ అధికారుల వద్ద ఉంటే, అధికారం చెలాయిస్తూ అద్దెలు వసూళ్లు చేసుకుని కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు. వక్ఫ్‌భూముల్లో నిర్మించిన షాపు అద్దెలు అటు ప్రభుత్వానికి, ఇటు యజమానులకు వెళ్లక మధ్యలో ఉన్న వారు కాజేస్తున్నారని వాపోయారు. దాదాపు 20 కోట్ల మేర వసూళ్లకు సంబంధించి లెక్కలు తేలాల్సి ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్‌ను ఆర్టీఐ కింద అడిగితే, అనుమతులు లేవని సమాధానమిచ్చారన్నారు. బెంగళూరు బస్టాండ్ బడేమకాన్ వద్ద 1893 నుంచి పట్టా కలిగినటువంటి సయ్యద్ బాసిద్ బాషాకు చెందిన సర్వే నెంబర్.173లోని 97 సెంట్ల భూమిని ఆక్రమించి ఆధీనంలో పెట్టుకుని, మున్సిపల్ అనుమతి లేకుండా షాపురూములు నిర్మించి అద్దెలు తీసుకుంటున్నారన్నారు. అలాగే సర్వేనెంబర్.171లోనూ స్థలాన్ని కబ్జాచేసి, అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించుకున్నారన్నారు. దీనిపై సీసీఎల్ఏ, హైకోర్టు, సింగిల్‌బెంచ్ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, స్థలంలోకి ప్రవేశించకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని, జిల్లా అధికారులను లోబర్చుకుని, డబ్బు దోచుకుంటూ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా స్వలాభం చూసుకుంటున్నారన్నారు. ఏడునెలలు కావస్తున్నా..తమకు న్యాయం జరగకపోవడంతో మరోసారి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన తెలుపుకొన్నామన్నారు. ఫిర్యాదుచేసిన వారిలో వెంకటరమణనాయుడు, శంకర్‌రెడ్డి, సయ్యద్ బాసిద్బాషా, షరీఫ్, ముస్లిం మహిళలు ఉన్నారు. అన్ ఆథరైజ్డ్ కమిటీ ద్వారా అక్రమ వసూళ్లు మతం ముసుగులో కోట్ల రూపాయల స్కామ్ ఎమ్మెల్యే అక్రమాలపై ఆర్.పీ.సిసోడియాకు ఫిర్యాదు 20కోట్ల మేర లెక్కలు తేల్చాలంటున్న బాధితులు -
రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ మృతి
ఓబులవారిపల్లె : గోవిందంపల్లి పంచాయతీ, చెన్నకేశవ గుడి సమీపంలోని జాతీయ రహదారి మలుపు వద్ద రోడ్డు రోలర్ కింద పడి డ్రైవర్ దయ్యాల కిరణ్ కుమార్(34) మృతిచెందాడు. బుధవారం మంగళంపల్లి నుండి గాదెల గ్రామానికి రోడ్డు రోలర్ తీసుకొని డ్రైవర్ కిరణ్ కుమార్ బయలుదేరాడు. జాతీయ రహదారిపైకి వచ్చే మలుపు వద్ద రోలర్‌ను అదుపు చేయలేకపోవడంతో కిరణ్ కుమార్ అతను నడిపే వాహనం క్రింద పడి మృతి చెందాడు. మృతుడు కడప పట్టణానికి చెందిన వాడు. గత కొద్దిరోజులుగా రోడ్డు కాంట్రాక్టర్ వద్ద రోలర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ముగుగరు పిల్లలు కలరు. మృతదేహాన్ని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. రెండు గడ్డి వాములు దగ్ధం రామసముద్రం : మండలంలోని కేసీ.పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కేసీ పల్లె గ్రామానికి చెందిన ఆర్.చెంగారెడ్డి, పి.చంద్రప్పలకు చెందిన గడ్డివాములకు ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో రూ.60 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. అక్రమ మద్యంపై నిఘా ఉంచాలి మదనపల్లె : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అక్రమ మద్యం రవాణాపై ఎకై ్సజ్ సిబ్బంది నిఘా ఉంచాలని కడప ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మధుసూదన్ అన్నారు. నియోజకవర్గంలోని రామసముద్రం, చీకలబైలు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌లను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీపై ఎకై ్సజ్ సిబ్బంది పలు సూచనలు చేశారు. కర్నాటక నుంచి ఎన్డీపీఎల్ మద్యం అక్రమరవాణా జరగకుండా పటిష్టమైన నిఘా కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ భీమలింగ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ రక్షణ.. కూటమి ప్రభుత్వానికి పట్టదా? ఖాజీపేట : మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కనీస రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. దుంపలగట్టు గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు మిర్చియార్డు రైతుల సమస్య తెలుసుకునేందుకు వెళ్లిన జగన్‌కు కనీసం ఒక్క పోలీసును కూడా రక్షణకు నియమించక పోవడం, కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ చేయక పోవడం దురదృష్టకరం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని అన్నారు. అలాంటప్పుడు ఎన్నికల ఆంక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కనీసం రూ.20వేలు రైతు భరోసాను అందించలేక పోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. -
విధుల నుంచి తొలగించారు... ఆత్మహత్యే శరణ్యం
ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ ఉద్యోగి బహిరంగ లేఖ ఓబులవారిపల్లె : రాజకీయ ఒత్తిడితో ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని పసుపులేటి గంగాధర్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. కలత చెందిన అతడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులకు బహిరంగ లేఖ పంపారు. బాధితుడి వివరాల మేరకు.. మండలంలోని గొబ్బూరివారిపల్లి 33/11 కెవీ విద్యుత్తు సబ్ స్టేషన్లో రాజంపేట మండలం, శేషమాంభపురం గ్రామానికి చెందిన పసుపులేటి గంగాధర్ సాయి పనిచేస్తున్నాడు. 2024 మార్చి నెలలో తాను డ్యూటీలో చేరారు. ఏడాది కాలంగా జీతం ఇవ్వకపోయినా రోజూ విధులకు హాజరువుతూ లాగ్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అభిషేక్ అనే వ్యక్తి సబ్ స్టేషన్‌లోని లాగ్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ నెల 17వ తేదీన యథావిధిగా డ్యూటీకి వెళ్లగా తనను షిప్ట్ ఆపరేటర్‌గా తొలగించినట్లు ఏఈ తెలిపారన్నారు. ఎందుకు తొలగించారని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. తనకు 12 నెలలు జీతం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే తనకు ఆత్మహత్యే శరణమని, అధికారులు లేఖనే మరణ వాంగ్మూలంగా పరిగణించాలని రాశాడు. రైల్వేకోడూరు ఏడీ ఈ భాస్కర్ రావును వివరణ కోరగా ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు తీసుకోవడం, తొలగించడం జరుగుతుందని, తమకు సంబంధం లేదని వారు తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
సిద్దవటం : కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. సిద్దవటం మండలం ఉప్పరపల్లె సాయినగర్‌లో కె.అనిల్‌కుమార్‌రెడ్డి హ్యాపీ కిడ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నూతన భవనాలను ఆకేపాటి అమర్నాథ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. చిన్నారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. మూడేళ్ల పిల్లలను అంగన్వాడీలో చేర్పించి..పౌష్టికాహారం అందజేశామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాలంలో 1, 2వ తరగతుల వరకు ప్రాథమిక విద్య, 3వ తరగతి నుంచి 10+2 వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోనూ పోటీ పరీక్షలకు విద్యార్థుల సామర్‌ాధ్యన్ని పెంపొందించేలా సీబీఎస్సీ సిలబస్ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇపుడు కూటమి ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని రద్దు చేసే యోచనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సౌమిత్ర, హరిబాబు, పాఠశాల డైరెక్టర్ శివకుమారి, హెచ్ఎం శ్రీరాములు, పారిశ్రామిక వేత్త తాజుద్ధీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
●అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లాలో వేసవి తాపం మొదలైంది. ఇప్పుడే ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మార్చి నుంచి వేసవి తీవ్రత మరింత పెరగనుంది. 10 సీపీడబ్ల్యు, 4896 పీడబ్ల్యుఎస్ స్కీములు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8946 బోర్లు ఉండగా, అందులో 2980 మరమ్మతులకు గురయ్యాయి. రానున్న కాలంలో ఎండ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటితే మిగిలిన బోర్లలో కూడా నీళ్లు లేక తాగునీటి కష్టాలు మరింత అధికం కానున్నాయి. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రత్యేకంగా తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక బోర్లకు ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలమట్టం తగ్గిపోయి తాగునీటికి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.