విజ్ఞాన్, బౌలింగ్ గ్రీన్ వర్సిటీల మధ్య ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ – యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల (బీజీఎస్‌యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని, ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్‌తో పత్రాలను మార్చుకున్నట్టు వివరించారు. ఒప్పందం వల్ల తమ వర్సిటీ విద్యార్థులకు బీజీఎస్‌యూతో కలిపి జాయింట్ డిగ్రీలను అందజేయవచ్చునని పేర్కొన్నారు. సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉంటుందని వివరించారు. యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతోపాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కొల్ల, కెన్ (జాన్), సీఈవో మేఘన కూరపాటి, రిజి స్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment