పోలీసు శాఖకు ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం వెన్నుముక
ఏఆర్ బలగాల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ
నరసరావుపేట: జిల్లా పోలీసు శాఖకు ఆర్మ్‌డు రిజర్వ్ విభాగం వెన్నెముక అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏఆర్ వార్షిక మొబిలైజేషన్ (సమీకరణ) కార్యక్రమం ఈనెల ఐదో తేదీన పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. బుధవారం అదే గ్రౌండ్‌లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు బలగాల కవాతును వీక్షించారు. అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా బలగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబలైజేషన్ కార్యక్రమాన్ని సర్వీస్‌లో ఉన్న ఏఆర్ సిబ్బంది భారంగా భావించవద్దని కోరారు. గురుతరమైన బాధ్యతను భుజాల మీద పెట్టినప్పుడు ఎంతటి కష్టమైనప్పటికీ దానికి తగ్గట్టు విధులు నిర్వర్తించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్యం, పిల్లలు, కుటుంబం పూర్తి బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి పెరేడ్ నిర్వహణ, వీఐపీ సెక్యూరిటీ, రక్షణ, ఆయుధాలను ఉపయోగించడంలో మెళకువలు, ఫైరింగ్ ప్రాక్టీసు, బందోబస్తులో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాంబ్, డాగ్ స్క్వాడ్, అత్యవసర పరిస్థితుల్లో జనసమూహం నియంత్రణ తదితర నైపుణ్యాలను పునఃసమీక్షించి వాటిలో సిబ్బందిని నిష్ణాతులుగా చేసినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో అధికారులు, సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్‌లపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వృత్తి నైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమం రూపొందించినన ఏఆర్ అధికారులైన అదనపు ఎస్పీ వి.సత్తిబాబు, డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్ ఎం.రాజా, ఎంటీవో, వెల్పేర్ ఆర్‌ఐలు కృష్ణ, గోపీనాథ్‌లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, ఎస్‌బీ సీఐలు సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment