ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి
క్రోసూరు: ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని బాలెమర్రులో జరిగింది. ఎస్‌ఐ నాగేంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నుంచి మిర్చి కోతలకు 40 మంది కూలీలు బాలెమర్రు గ్రామానికి వచ్చారు. వారు పనులకు వెళ్తున్న క్రమంలో నగేష్ సోదరుడు సిద్ధరామయ్య ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చుని జారి పడిపోయాడు. తలకు గాయమైంది. 108 వాహనంలో సత్తెనపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడుకి భార్య, పాప ఉన్నారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
సూర్యప్రకాశరావు
మృతి తీరని లోటు
కొరిటెపాడు: కోల్డ్ స్టోరేజెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫెడరేషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వైస్ ప్రెసిడెంట్‌గా, గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా గత 30 ఏళ్లుగా సేవలందించిన తడికమళ్ల సూర్యప్రకాశరావు బుధవారం ఉదయం మృతిచెందారు. సూర్యప్రకాశరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు పలు రకాల సేవలు అందించారని పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు కొనియాడారు. కోల్ట్ స్టోరేజ్‌ల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. రైతు సోదరుల కోసం ఆరు కోల్డ్‌స్టోరేజీలను సొంత ఖర్చులతో పలు ప్రాంతాల్లో నిర్మించి నడుపుతున్నారని గుర్తు చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సూర్యప్రకాశరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాయమాటలు చెప్పి
బాలికపై లైంగిక దాడి
యువకుడిపై పోక్సో కేసు
మంగళగిరి టౌన్: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి నగరానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. పార్కురోడ్డుకు చెందిన శ్యామ్‌బాబు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్‌బాబు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాలిక అడగడంతో వివాహానికి నిరాకరించాడు. దీంతో బాలిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
యార్డుకు 1,47,414 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,47,414 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,42,943 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,900 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 75,790 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి
ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి
Comments
Please login to add a commentAdd a comment