
ఇసుక అక్రమ రవాణా కావొద్దు
జగిత్యాల: జిల్లాలో ఇసుక అక్రమంగా రవాణా కా కుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మైనింగ్, పోలీసు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఇసుక రవాణా జరగకుండా రెండుశాఖలు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి చెక్‌పోస్టుల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ట్రాక్టర్, లారీ ఏదైనా చెక్ చేయాలని, తహసీల్దార్ అనుమతి ఉందా లేదా తప్పనిసరిగా చూడాలన్నారు. జిల్లాలో గుర్తించిన ఇసుక వాగుల ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా తరలిపోకుండా బృందాలు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా జరగాలని, అర్ధరాత్రి వేళల్లో జరిగే అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచి చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ చర్యలు ఉండాలన్నారు. ఇబ్రహీంపట్నం, ధర్మపురి ప్రాంతాల్లో గోదావరి నుంచి ఇసుకకు అనుమతి లేదని, గుర్తించిన ఇసుక రీచ్‌ల ద్వారానే రవాణా చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆరెపల్లిలో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ధర్మపురి: అనుమతి లేకుండా ఇసుకను తరలించినా.. డంపింగ్ చేసిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని దమ్మన్నపేట, ఆరపెల్లి గ్రామాల్లోని గోదావరి తీరాలను ఎస్పీ అశోక్‌కుమార్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముందుగా ఇసుక తరలిస్తున్నవారితో మాట్లాడారు. ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? పర్మిషన్ ఉందా... ఎంతకాలంగా తరలిస్తున్నారు..?అని ప్రశ్నించారు. గోదావరి ఒడ్డుపై నిల్వ ఉంచిన ఇసుక రీచ్‌లను పరిశీలించి సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రాత్రివేళ విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సీఐ రాంనర్సింహరెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, మైనింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment