ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ తప్పనిసరి
వనపర్తి: జిల్లాలోని ఇసుక రీచ్‌లపై ఆయా ప్రాంతాల తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం వై–శాఖాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ను, రాంపురం గ్రామ శివారులో అధికారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు చేసినా, సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాంపురంలో ఇసుక నిల్వల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి..
జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా నిర్మాణం చేసుకునే వారికే పథకం వర్తిస్తుందని.. ఇదివరకు సగం నిర్మించుకున్న వారికి వర్తించదని వివరించాలని సూచించారు. ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయంలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, తహసీల్దార్లు సైతం దగ్గర్లోని రీచ్ నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. విడతల వారీగా నగదు ప్రభుత్వం నుంచి వస్తుందని వారికి స్పష్టంగా తెలియజేయాలని కోరారు. మిగతా గ్రామాల్లో కూడా పథకం ఏ క్షణమైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. అర్హుల జాబితాను మరోమారు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులు జాబితాలో లేకుండా చూసుకోవాలన్నారు.
తాగునీటి సమస్యలు రానివ్వొద్దు..
వేసవి సమీపిస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో స్థానికంగా ఉండే బోర్లను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లోని బోర్లుమోటార్లు, చేతిపంపులు పనిచేయకుండా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిట్యాంకులు పరిశుభ్రంగా ఉండాలని, పదిరోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. ట్యాంకర్లను సైతం అవసరానికి అనుగుణం సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment