ఏమీ లేదనిపింఛెన్‌.. | chandrababu naidu fake promises In election manifesto | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఏమీ లేదనిపింఛెన్‌..

Published Tue, Sep 17 2024 12:41 PM | Last Updated on Tue, Sep 17 2024 3:25 PM

chandrababu naidu fake promises In election manifesto

కొత్తవాటికి చంద్ర గ్రహణం

 50 ఏళ్లకే ఇస్తామన్న హామీకి మంగళం

మరోసారి మోసపోయామంటున్నఅవ్వాతాతలు

కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా పింఛన్‌ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్‌ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.

అర్జీలు.. బుట్టదాఖలు
కొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్‌డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్‌ లేదు, సూపర్‌–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.

వలంటీర్‌ వ్యవస్థకు మంగళం
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్‌ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ  అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.

3,112 పింఛన్ల కోత
కూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్‌ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్‌లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇలా..
వైఎస్సార్‌ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా పింఛన్‌ మంజూరయ్యేది. వైఎస్సార్‌ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్‌ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్‌ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 


No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement