Sakshi News home page

మంత్రులు ఏమన్నారంటే..

Published Sat, Apr 20 2024 1:25 AM

- - Sakshi

మహబూబాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ నామినేషన్‌ సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు దగ్గర పెట్టుకోవాలి

: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. రెండుసార్లు పీఎంగా రాహుల్‌గాంధీకి అవకాశం వచ్చినా తీసుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని లిల్లిపుట్టు అని సంభోదించారు.. వరంగల్‌ మిరపకాయ కారం కేసీఆర్‌కు తెలియదు.. రేవంత్‌రెడ్డికి తెలుసు.. సమయం వచ్చినప్పుడు ఎక్కడపెట్టాలో అక్కడ పెడుతారన్నారు. కేసీఆర్‌కు చిప్పకూడు తినే రోజులు దగ్గర పడ్డాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ప్రజల స్వేచ్ఛను హరించింది. దానిలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ భవిష్యత్‌లో శిక్షణ తప్పదు.

వంద రోజుల్లోనే రేవంత్‌ మార్క్‌ :

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీఎం రేవంత్‌రెడ్డి అద్భుత పాలన అందిస్తున్నారు. వంద రోజులలోనే తనదైన మార్కు వేసుకున్నారు. సీఎం పట్టుదల దూర దృష్టి ఉన్న నాయకుడు. గత ప్రభుత్వ చేసిన అప్పులు తీర్చలేరు. లోప భూయిష్టమైన పాలన ఉంది.. సాధ్యం కాదని బీఆర్‌ఎస్‌ అనుకున్నారు.. దానిని సీఎం గాడిలో పెట్టారు. 15స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు తథ్యం. బలరాంనాయక్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

బలరాంనాయక్‌ భోళా శంకరుడు :

మంత్రి ధనసరి సీతక్క

గ్యారంటీలకే గ్యారంటీ సీఎం రేవంత్‌రెడ్డి. అభ్యర్థి బలరాంనాయక్‌ మోసాలు తెలియని భోళా శంకరుడు. మోదీ ప్రభుత్వం జీఎస్టీల పేరుతో పేదలపై భారం మోపింది. భగవంతుని భక్తుని అనుసంధానమైన అగర్‌ బత్తిపై కూడా జీ ఎస్టీ విధించింది. దేశం కోసం స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీని పీఎం చేయాలి. ఉపాధిహామీ, విద్యాహక్కు, ఆహార భద్రత చట్టాలని కాంగ్రెస్‌ తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది.

జన జాతర సభలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, డోర్నకల్‌, మహబూబాబాద్‌, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, పాలకుర్తి ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్‌, భూక్య మురళీనాయక్‌, తెల్లం వెంకట్రాం, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, యశస్వినిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్‌ చౌదరి, బెల్లయ్య నాయక్‌, రియాజ్‌, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌లాల్‌, ఘనపురపు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి, అజయ్‌సారథిరెడ్డి, డాక్టర్‌ భూక్య ఉమ, చుక్కల ఉదయ్‌చందర్‌ పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement

homepage_300x250