Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి

Published Thu, Aug 5 2021 8:00 PM

Tokyo Olympics: PR Sreejesh Father Sell Cow Buy Goalkeeper Kit For His Son

ఢిల్లీ:                                              టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ పాత్ర మరువలేనిది. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో  ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీజేష్‌ పేరు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌. తాజాగా శ్రీజేష్‌ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.

1998లో తన 12 ఏళ్ల వయసులో హాకీలో ఓనమాలు నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరాడు. అయితే ఆ స్కూల్‌ హాకీ కోచ్‌ శ్రీజేష్‌ను గోల్‌ కీపింగ్‌ చేయమని సలహా ఇచ్చాడు. కోచ్‌ చెప్పిన విషయాన్ని శ్రీజేష్‌ తన తండ్రికి వివరించాడు. కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేసి శ్రీజేష్‌కు గోల్‌ కీపింగ్‌ కిట్‌ను కొనిచ్చాడు. అయితే ఆ సమయంలో రవీంద్రన్‌ శ్రీజేష్‌కు ఒక మాట చెప్పాడు. '' ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని తాకట్టు పెడుతున్నా. నువ్వు అనుకున్న కలను సాధించాలి..  హాకీలో గోల్‌ కీపర్‌గా మెరవాలి.. దేశానికి పతకం తేవాలి.'' అని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలను శ్రీజేష్‌ ఈరోజుతో నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తన గోల్‌ కీపింగ్‌తో మెప్పించి దేశానికి కాంస్యం అందించాడు. ఇటు తండ్రి కోరికను నెరవేర్చడంతో పాటు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణకు తన జట్టుతో కలిసి తెరదించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే .. హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై  మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు  ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్‌ ఫైట్‌ లో భారత్‌ 5-4 తేడాతో జయకేతనం ఎగురవేసి కాంస్యం దక్కించుకుంది.
 

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250