Sakshi News home page

కార్మిక పక్షపాతి సీఎం వైఎస్‌ జగన్‌

Published Tue, May 7 2024 12:05 AM

కార్మిక పక్షపాతి సీఎం వైఎస్‌ జగన్‌

అనంతపురం కార్పొరేషన్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మిక పక్షపాతి అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ తెలిపారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్‌ అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేసి, మే డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజమ్మ, పైలా నరసింహయ్య మాట్లాడుతూ... కార్మికులంటే మాజీ సీఎం చంద్రబాబుకు చులకన భావమన్నారు. కేవలం ఓటు బ్యాంక్‌గానే కార్మికులను వాడుకుంటూ వచ్చారన్నారు. తమ హక్కులను అడిగిన పాపానికి అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన నీచ చరిత్ర చంద్రబాబుదన్నారు. విద్యుత్‌ శాఖ కార్మికులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి నవరత్నాల పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టడమే కాక, 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారన్నారు. ఈ క్రమంలోనే కార్మికుల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, మరి కొన్ని శాఖాల్లో కార్మికులు విజ్ఞప్తి చేయకుండానే వారి వేతనాలు పెంచిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ, జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌ పీరా మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కార్మికులకు జరిగిన మేలును విపులంగా వివరించారు. ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల డిప్యూటీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, రజక కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ రంగన్న, అహుడా చైరర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, మేయర్‌ వసీం, టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వత్థనాయక్‌, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కరరెడ్డి, వాసంతి సాహిత్య వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, డీసీసీబీ చైర్‌పర్సన్‌ లిఖిత, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి వనారస బలరాం, నాయకులు అనిల్‌కుమార్‌ గౌడ్‌, కనకరాం, గోవిందు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250