Sakshi News home page

Shooting World Cup: అఖిల్‌ షెరాన్‌కు కాంస్యం.. భారత్‌కు అగ్రస్థానం

Published Thu, Feb 1 2024 10:08 AM

Shooting World Cup Tourney Akhil Sheoran Won Bronze Medal - Sakshi

కైరో: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత షూటర్‌ అఖిల్‌ షెరాన్‌ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో అఖిల్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్‌ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్‌ ప్రదర్శనతో భారత్‌ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది.

ఇవీ చదవండి...
భారత్‌కు ఐదో స్థానం
మస్కట్‌: ‘ఫైవ్‌–ఎ–సైడ్‌’ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6–4 గోల్స్‌ తేడాతో ఈజిప్ట్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున మణీందర్‌ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... రాహీల్‌ (8వ ని.లో), పవన్‌ (9వ ని.లో), ఉత్తమ్‌ (13వ ని.లో), మందీప్‌ (11వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

క్వార్టర్స్‌లో రష్మిక జోడీ 
ఇండోర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్‌)తో కలిసి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

‘వైల్డ్‌ కార్డు’తో సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్‌లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్‌) జోడీపై విజయం సాధించింది. 

Advertisement

homepage_300x250