రోహిత్‌, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం! | Sakshi
Sakshi News home page

రోహిత్‌, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం!: ఇర్ఫాన్‌ పఠాన్‌

Published Mon, Jun 3 2024 7:38 PM

If I Were Coach Would Make This Rule: Irfan Pathan On India Specialist Batters

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.

తానే గనుక కోచ్‌ అయి ఉంటే ప్రతీ బ్యాటర్‌.. కచ్చితంగా కొన్ని ఓవర్లపాటైనా బౌలింగ్‌ చేయాలనే నిబంధన ప్రవేశపెట్టేవాడని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. 2007 టీ20, 2011 వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో టీమిండియా ఇలాగే విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.

సచిన్‌ టెండుల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా తదితరులు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించారని ఇర్ఫాన్‌ పఠాన్‌ గుర్తుచేశాడు. కాగా ప్రపంచకప్‌-2024లో జూన్‌ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు జరుగుతున్న తరుణంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనే గనుక టీమిండియా కోచ్‌ అయితే.. ప్రతి బ్యాటర్‌ కూడా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్‌ చేయగలిగే స్థితిలో ఉండాలనే రూల్‌ పెడతా.

ఇంగ్లండ్‌ జట్టులో లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, విల్‌ జాక్స్‌ తదితరులు బౌలింగ్‌ కూడా చేస్తారు. ఫ్రంట్‌లైన్‌ బౌలర్లతో పాటు వాళ్లు కూడా రాణిస్తారు.

కానీ మన జట్టు పరిస్థితి అలా కాదు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ప్యూర్‌ బ్యాటర్లు అస్సలు బౌలింగ్‌ చేయరు. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే మన జట్టు వెనుకబడినట్లే.

ఈ ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్‌ చేసినా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటపుడు తుదిజట్టు కూర్పులో మనకు ఎక్కువ ఆప్షన్స్‌ కనిపిస్తాయి’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు. నలుగురు ఫ్రంట్‌లైన్‌ బౌలర్లతో పాటు అక్షర్‌ పటేల్‌, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా వంటి వారిలో ఒకరు పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.

వరల్డ్‌కప్‌-2024: టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్‌ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్.. 
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.

చదవండి: Babar Azam: దమ్ముంటే వరల్డ్‌కప్‌ గెలవండి: బాబర్‌కు పాక్‌ మాజీ బ్యాటర్‌ సవాల్‌

Advertisement
 
Advertisement