కూతుర్ని కోల్పోయా.. అందుకే బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోవట్లేదు: ఇళయరాజా | Sakshi
Sakshi News home page

కూతుర్ని కోల్పోయిన బాధలో ఇళయరాజా.. అభిమానుల కోసం ఓపికగా..

Published Mon, Jun 3 2024 12:05 PM

Ilayaraja Did Not Celebrate His 81th Birthday

ఇళయరాజా సంగీతం గలగల పారే గంగా ప్రవాహం. ప్రతి మనిషికి ఉత్సాహం. అలసిన మనసులకు ఆహ్లాదం. ఇళయరాజా 1943 జూన్‌ 3వ తేదీన జన్మించారు. ఇప్పుడీ సంగీత పిపాసి వయసు 81 సంవత్సరాలు. ఇప్పటికీ సంగీతమే ఇళయరాజా ప్రపంచం. 1000 కి పైగా చిత్రాలు, 4,500కు పైగా పాటలు.. అందుకే అందరూ ఇతన్ని సంగీత జ్ఞాని అంటారు. ఇన్నేళ్లలో ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఈయనను వరించాయి.

81వ బర్త్‌డే..
అలాంటి సంగీత రారాజు ఇళయరాజా 81వ జన్మదినోత్సవం సందర్భంగా కమల్‌ హాసన్‌ సహా అనేకమంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులైతే ఈయనను చూడడానికి స్థానిక టీనగర్‌లోని ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోకు పోటెత్తారు. ఆయనతో ఫొటోలు దిగడానికి బారులు తీరారు. ఇళయరాజా ఎంతో సహనంతో వచ్చిన అభిమానులందరినీ సంతోషపరిచేందుకు వారితో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగడం విశేషం. 

సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు
ఆయన మీడియాతో మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా మీరే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారని, తాను మాత్రం తన కుమార్తెను కోల్పోవడం వల్ల ఎలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే ఇదంతా మీ కోసమే కానీ తన కోసం కాదని ఇళయరాజా తెలిపారు. కాగా ఇళయరాజా కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్‌తో పోరాడుతూ జనవరిలో కన్నుమూశారు.

చదవండి: ప్రకృతి ఒడిలో ఒకప్పటి హీరో కొత్తిల్లు.. 'నీకంత డబ్బు ఎక్కడిది?'

Advertisement
 
Advertisement