చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా? | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?

Published Wed, May 29 2024 7:11 PM

Chandrababu Tension Over Kuppam Result

నారా  చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌కు కౌంటింగ్ భయం పట్టుకుందా? కుప్పం ఫలితంపై ఇప్పటి నుంచే ఆందోళన మొదలైందా? వైఎస్ జగన్ పాలనలో కుప్పం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా లబ్ది పొందడమే టీడీపీ భయానికి కారణమా? మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబులో కూడా భయం ప్రారంభమైందా? కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందా అంటూ టీడీపీలో మొదలైన భయానికి కారణం అదేనా? 

ఎన్నికల ఓట్లు లెక్కించే గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకోవడంలో తల మునకలుగా ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలకు పైబడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 1983లో ఓటమి తర్వాత చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో కుప్పం నుంచి ప్రారంభించారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్న కుప్పంలో చంద్రబాబు మాయమాటలకు ఎదురులేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుంచి కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. ఇందుకు వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణం. కుప్పంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ వచ్చిన చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది.

ఈ ఎన్నికల్లో కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో అని చంద్రబాబుకు సైతం టెన్షన్ పట్టుకుందని టీడీపీ వర్గాల సమాచారం. కుప్పంలో ఈసారి పోలింగ్ శాతం 89.88గా నమోదైంది. గతంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ 30 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగ ఓట్లతోనే చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారన్న వాదనా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు చెందిన వానంబాడి, తిరుపత్తూరు, నాట్రంపల్లితో పాటు కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కే జి ఎఫ్, బంగారు పేట, బెంగళూరు, బేతమంగళం వంటి ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చి కుప్పంలో టిడిపికి ఓట్లు వేసేవారు. 

2019 ఎన్నికలకు ముందు దివంగత వైఎస్సార్‌సీపీ నేత చంద్రమౌళి టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌కు పూర్తి వివరాలతో సహా అందించారు. విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ దాదాపు 20 వేల ఓట్లను తొలగించింది. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 46 వేల మెజార్టీ రాగా, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 30 వేలకు పడిపోయింది. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కుప్పంలో దాదాపు 20వేల టిడిపి దొంగ ఓట్లు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిశీలనలో తేలింది. వీటిలో కేవలం 7, 8 వేల దొంగఓట్లను మాత్రమే ఈసీ ద్వారా తొలగించగలిగారు. 

ఇదిలా ఉంటే..ఈ ఎన్నికల్లో కుప్పంలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో కుప్పం వాసులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాదిమందికి ఇంటి పట్టాలతో పాటు గృహాలు మంజూరు చేశారు. అలాగే పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించారు. ప్రధానంగా కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందించారు. ఈ కారణాలతో కుప్పం వాసుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సంపూర్ణంగా నమ్మకం ఏర్పడింది. అందువల్లే ఈ ఎన్నికల్లో కుప్పం వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాలలో టెన్షన్ ప్రారంభమైంది.

కౌంటింగ్ రోజు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది మెజారిటీతో అయినా చంద్రబాబు గెలవడం ఖాయం అంటూ కుప్పం పచ్చ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి కుప్పం ఏమవుతుందా అని చంద్రబాబు ఆందోళన చెందుతుంటే టీడీపీ క్యాడర్ లెక్కల మీద లెక్కలు కడుతున్నట్లు సమాచారం. 2019లో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గింది. అందుకే ఈసారి టీడీపీ నేతలు బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం ఆందోళనకు గురవుతున్నారనే టాక్ నడుస్తోంది.

 

Advertisement
 
Advertisement