జల సంరక్షణలో భాగస్వాములవుదాం - | Sakshi
Sakshi News home page

జల సంరక్షణలో భాగస్వాములవుదాం

Published Tue, Apr 16 2024 1:20 AM

- - Sakshi

కోస్గి: నీటిని వృధా చేయకుండా అవసరమైనంత వరకు వినియోగించుకుంటూ జల సంరక్షణలో అందరం భాగస్వాములవుదామని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం వాక్‌ ఫర్‌ వాటర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశానికి హాజరైన ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి జల సంరక్షణపై అధికారులు, ప్రజాప్రతినిధులకు జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి లభ్యత, ప్రాముఖ్యత, సంరక్షణ విధానం, నీటి విలువను తెలుసుకొని తమ కుటుంబ సభ్యులకు, చుట్టు పక్కల వారికి వివరించాలన్నారు. నీటి సంరక్షణపై అవగాహన లేకపోవడంతో చాలా ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదురుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా వాక్‌ ఫర్‌ వాటర్‌ స్వచ్చంద సంస్థ వాలంటర్‌ వీరు మల్లేష్‌ ప్రతిరోజు వాడే నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, భూగర్భ జలం పెంపొందించే విధానం, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతతోపాటు పలు అంశాలను వివరించారు. ఇదే క్రమంలో పట్టణంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో సైతం విద్యార్థులకు అవగాహన కల్పించి నీటి భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీపీ మదుకర్‌ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement