రైతులను విస్మరించిన కాంగ్రెస్‌ - | Sakshi
Sakshi News home page

రైతులను విస్మరించిన కాంగ్రెస్‌

Published Tue, Apr 16 2024 1:20 AM

మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు  - Sakshi

కోస్గి: రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం పథకాలు అమలు చేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పాలనలో పూర్తిగా విఫలమైందని, చివరకు ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న బాలింతలకు ఇచ్చే కేసీఆర్‌ కిట్లు బంద్‌ అయ్యి తిట్లు చాలయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కోస్గిలో ఏర్పాటు చేసిన కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కేసీఆర్‌ రూ.90 వేల కోట్లతో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసి కావాల్సినన్ని ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వ్యవసాయ రంగం అతలాకుతలమైందన్నారు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా, 24 గంటల విద్యుత్‌, వరికి అదనపు బోనస్‌, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులతోపాటు తులం బంగారు పేరుతో ఆడబిడ్డలు, స్కూటీల పేరుతో చదువుకున్న యువత, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులు, నాలుగు డీఏలు అంటూ ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 హామీలను అమలు చేయాలన్నారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఏ ఒక్క కార్యకర్త భయపడవద్దని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అవకాశం ఇవ్వండి..

గతంలో కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో తనవంతు పాత్ర పోషించానని, తనపై నమ్మకంతో కేసీఆర్‌ మరోమారు అవకాశం ఇచ్చారని, మీరందరు ఆశీర్వదించి రెండోసారి అవకాశం ఇస్తే అభివృద్ధికి కృషిచేస్తానని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానికుడిగా ఉన్న తనకు పాలమూరు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, స్థానికేతరులకు అవకాశం ఇచ్చి మోసపోవద్దన్నారు. ఎందరు భయబ్రాంతులకు గురి చేసిన కేసీఆర్‌ను వదిలేది లేదని, ఇతర పార్టీల మాయమాటలు నమ్మకుండా పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.

ప్రజలు బాధపడుతున్నారు..

కేసీఆర్‌ పాలనలోనే అన్నివర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాయని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి పెద్ద తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా బీఆర్‌ఎస్‌కు ఓటేసి ఆశీర్వదిస్తే ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు మరోమారు మోసపోకుండా బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతునిచ్చి పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలమూరు నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలన్నారు.

కేసీఆర్‌ కిట్లు బంద్‌ అయ్యి

తిట్లు చాలయ్యాయి

అక్రమ కేసులకు భయపడం..

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

చివరి వరకు కేసీఆర్‌తోనే ఉంటా

తన సోదరుడు పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ మారాడని, తాను కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అయోమయ పరిస్థితి సృష్టిస్తున్నారని, తాను చివరి వరకు బీఆర్‌ఎస్‌ను వీడేది లేదని, కేసీఆర్‌తోనే ఉంటానని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానని.. అవసరమైతే కొడంగల్‌లోనే ప్రత్యేకంగా ఓ లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని అధిష్టానం భరోసా ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, స్పోర్ట్స్‌ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ శ్యాసం రామకృష్ణ, నాయకులు మహిపాల్‌, బాల్‌సింగ్‌, సలీం, విజయ్‌కుమార్‌, రాజు, మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, మధుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement