కంచ ఐలయ్య ‘మా జాతి సూర్యుడు’  Siddaramaiah: maa jaati suriyu award to kancha iilaiah | Sakshi
Sakshi News home page

కంచ ఐలయ్య ‘మా జాతి సూర్యుడు’ 

Published Sun, Jan 14 2024 2:44 AM

Siddaramaiah: maa jaati suriyu award to kancha iilaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంచ ఐలయ్య షెఫర్డ్‌ తమ జాతి సూర్యుడని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా తింతని బ్రిడ్జ్‌ కనకపీఠంలో శనివారం సీఎం సిద్ధరామయ్య ‘మా జాతి సూర్యుడు’అవార్డును ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ ఐలయ్య సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, కులాధిపత్య అసమాన సమాజంలో ఆయన తరహా వ్యక్తుల అవసరం ఎంతో ఉందన్నారు.

ఆయన బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ‘వై ఐయామ్‌ నాట్‌ ఏ హిందు’, ‘బఫెల్లో నేషనలిజం’.. తదితర రచనలు చేశారన్నారు. కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, ఆధునిక శూద్ర సమాజ పురోగతికి, సమసమాజ స్థాపనకు ఆయన రచనలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలోని మారుమూల పల్లె పాపయ్యపేటలో, కురుమ కులంలో జన్మించిన ఐలయ్య షెపర్డ్‌ యావత్‌ భారతదేశం గరి్వంచే స్థాయికి ఎదగడం కురుమ కులానికే గర్వకారణమని ప్రశంసించారు.

అందుకే ఆయనకు యావత్‌ కురుమ సమాజం తరపున ’మా జాతి సూర్యుడు’ అవార్డును అందజేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐలయ్యకు కనక పీఠం పీఠాధిపతి శ్రీ సిద్ధ రామానంద మహాస్వామి తలపాగా తొడిగి రూ. 50 వేల నగదును బహూకరించారు. అనంతరం కంచ ఐలయ్య షెపర్డ్‌ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని దళిత బహుజనుల పిల్లలందరికీ ఆంగ్ల మీడియం పాఠశాలలు ప్రారంభించాలని, అగ్రకులాల పిల్లల చదువులకు బహుజనుల పిల్లలు ఏ మాత్రం తీసిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

జాతి సూర్యుడిగా అవార్డు అందజేసిన కనకపీఠానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్‌ ఖుభా, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బైరతి సురేష్, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలకాని వెంకట్‌ యాదవ్, ప్రొఫెసర్‌ నర్రి యాదయ్య, తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు విప్లవ్, దాసరి శ్రీనివాస్, ఉస్మానియా విద్యార్థులు కొంగల పాండు, గురునాథ్, సురేందర్, దయ్యాల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement