‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు Karnataka CM Siddaramaiah Draws Hindu Hindutva Distinction | Sakshi
Sakshi News home page

‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు

Published Fri, Dec 29 2023 4:09 PM

Karnataka CM Siddaramaiah Draws Hindu Hindutva Distinction - Sakshi

బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ ధర్మం వేరువేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హిందుత్వ సిద్ధాంతంపై (ఐడియాల‌జీ) ఆయన కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండా.. మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.  హిందుత్వలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏం ఉండవని తెలిపారు. బెంగళూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ  కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'హిందుత్వ అంటే హిందుత్వనే. నేను హిందువునే. హిందుత్వం, హిందు అనేవి వేర్వేరు. మనం రాముడిని ఆరాధించలేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడిని పూజిస్తున్నారా? మన గ్రామాల్లో రామ మందిరాలు నిర్మించలేదా? మనం రాముడి భజనలు చేయలేదా? ' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. డిసెంబర్ చివరి వారంలో భజనలు జరుగుతుంటాయని, తమ గ్రామంలోనూ అలాంటి వేడుకలు జరిగేవని సిద్ధరామయ్య తెలిపారు. ఆ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనేవాడినని చెప్పారు. కేవలం బీజేపీ వాళ్లే హిందువులా?.. మనం కాదా? అని మండిపడ్డారు. 

సిద్ధరామయ్య గత ఫిబ్రవరిలోనూ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అనేది రాజ్యాంగవిరుద్ధమని, హిందుత్వ, హిందూ ధర్మం వేర్వేరని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందువునని, కానీ మనువాదం, హిందుత్వకు వ్యతిరేకినని చెప్పారు. హత్యలను ఏ మతం సమర్ధించదని, కానీ హిందుత్వ మద్దతుదారులు హత్యలు, వివక్షను సమర్ధిస్తారని ఆరోపణలు చేశారు. తాను రామాలయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాజకీయ ప్రయోజనాలకు దానిని వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు.

మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు,  వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో హిందుత్వపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ నేత అశ్వత్‌ నారాయణ్‌ కైంటర్‌ ఇచ్చారు. సిద్దరామయ్య, కాంగ్రెస్‌కు భారత్‌/ హిందుత్వానికి సంబంధించిన అంశాలపై అసలు స్పష్టతే లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. హిందూత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. 


చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్‌ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు

Advertisement
 
Advertisement