మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన సిద్దరామయ్య | Karnataka CM Questions PM Modi About Electoral Bonds - Sakshi
Sakshi News home page

మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన సిద్దరామయ్య

Published Sat, Mar 16 2024 4:33 PM

Karnataka CM Asks To Question For PM About Electoral Bonds - Sakshi

ప్రధానమంత్రి కర్ణాటకలోని కలబురగి నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమైన ఎలక్టోరల్ బాండ్ స్కామ్ గురించి ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని సీఎం సిద్దరామయ్య.. నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

సిద్ద రామయ్య తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఇలా పేర్కొన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని నిర్మూలిస్తానని వాగ్దానం చేసి దశాబ్దకాలం అవుతోంది. అయితే ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కామ్ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఎందుకు వెనుకాడుతుందని సిద్ధరామయ్య ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పూర్తి సమాచారాన్ని అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎందుకు వెనుకాడుతోంది? ఎలక్టోరల్ బాండ్ల విక్రయం, కొనుగోలు చట్టబద్ధంగా జరిగి ఉంటే.. ఎస్‌బీఐ సమాచారాన్ని ఎందుకు దాచిపెడుతోంది? ఎస్‌బీఐపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? దీనిపైన నరేంద్ర మోదీ స్పందించాలని కోరారు.

వ్యాపారుల నుంచి విరాళాలు రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. ఈ వ్యాపారులపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు, వారు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన తేదీలను పరిశీలిస్తే, ఇది స్పష్టమైన బ్లాక్‌మెయిల్ కేసుగా అనిపిస్తోందని సిద్ధరామయ్య అన్నారు.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన కంపెనీలు అందించే మౌలిక సదుపాయాలు, ఔషధాల నాణ్యతపై కూడా కర్ణాటక సీఎం అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

Advertisement
 
Advertisement