Sakshi News home page

ఆ ఐదింటి సంగతేంటి?

Published Tue, May 7 2024 3:10 AM

ఆ ఐదింటి సంగతేంటి?

● లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి విలీన పంచాయతీలు ● అదే హామీ ఇస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ● పదేళ్లుగా పట్టించుకోలేదని భద్రాచలంవాసుల ఆవేదన

భద్రాచలం: లోక్‌సభ ఎన్నికల వేళ విలీన ఐదు పంచాయతీల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ ఊళ్లను తిరిగి తెలంగాణలో కలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రధాన పార్టీల అభ్యర్థులు తాజా ప్రచారంలో పేర్కొంటుండగా, గత ఎన్నికల్లో కూడా ఇదే హామీఇచ్చారని, ప్రతీసారి ఎన్నికల ప్రచా ర అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారనే తప్ప అభివృద్ధి కుంటుపడుతున్నా పట్టించుకోవడంలేదనే భా వన భద్రాచలం ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది.

పలుమార్లు ఆందోళన చేపట్టినా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తొలుత భద్రాచలం డివిజన్‌లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, కుక్కునూరు వేలేరుపాడు మండలాలను పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుతున్నట్లు గెజిట్‌ విడుదల చేశారు. అనంతరం స్వల్ప కాలంలోనే భద్రాచలం మండలంలోని పిచుకులపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, యటపాక గ్రామపంచాయతీలను సైతం ఏపీలో విలీనం చేస్తున్నట్లు మరో గెజిట్‌ విడుదల చేశారు. దీంతో భద్రాచలం పట్టణం మినహా ఇతర ప్రాంతాలన్నీ ఏపీలో కలిసిపోయాయి. ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలతోపాటు భద్రాచలం ప్రజలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఐదు గ్రామపంచాయతీల ప్రజలు తీర్మానాలు కూడా చేశారు. పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన నాటి గవర్నర్‌ తమిళి సైను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు.

ప్రతీసారి ఎన్నికల హామీగా..

విలీన ఐదు గ్రామపంచాయతీల ప్రజల ఓటర్లు ఏపీలోని పాడేరు నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. భద్రాచలాన్ని ఆనుకుని అధిక భూభాగం ఉండటంతో పాటు, రామాల య భూములు ఆ గ్రామపంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి వాటిపైనే ఆధారపడి ఉంది. విలీన వ్యవహారం ఇరు రాష్ట్రాలతోపాటు కేంద్రం కూడా చొరవ చూపాల్సి రావడం, భద్రాచలంలోని అత్యధిక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇదే కీలక హామీగా మారుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు పంచాయతీల విలీనానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా 2024 ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు అదే హామీ ఇస్తున్నాయి. గడిచిన పదేళ్లలో అధికార, ప్రతిపక్షాలు తమ సమస్యను పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు పంచాయతీలు

తిరిగి తెలంగాణలో ఎందుకు కలపాలంటే..

● పేరుకు ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాకలు భౌగోళికంగా ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్నాయి.

● భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం, ఎటపాక, గుండాలలో ఖాళీ భూములు అనేకం ఉన్నాయి. భద్రాచలం విస్తరణకు ఈ భూములు తప్పనిసరి.

● భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన భూములు సుమారు 900 ఎకరాలు పురుషోత్తపట్నంలోనే ఉన్నాయి. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు ముందకు సాగటం లేదు.

● తెలంగాణలోని భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లి రావాలంటే ఏపీకి చెందిన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం మీదుగా వెళ్లి రావాలి.

● గోదావరి వరదల సమయంలో సహాయక చర్యలు సకాలంలో చేపట్టలేకపోతున్నారు.

Advertisement

homepage_300x250