Sakshi News home page

దక్కని ప్రాతినిధ్యం

Published Tue, May 7 2024 3:10 AM

దక్కని ప్రాతినిధ్యం

జిల్లా నుంచి ఒక్కరూ పార్లమెంట్‌లో అడుగుపెట్టని వైనం
● ఖమ్మం స్థానానికి 17సార్లు ఎన్నికలు జరిగినా రాని అవకాశం ● భద్రాచలం, మహబూబాబాద్‌లోనూ మొండిచేయే

భద్రాచలంలోనూ..

భద్రాచలం పార్లమెంటు స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్‌ చేస్తూ తొలిసారిగా 1967లో ఎన్నికలు నిర్వహించారు. చివరిసారిగా ఈ స్థానానికి 2004లో ఎన్నికలు జరిగాయి. భద్రాచలం పార్లమెంట్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడులతో పాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది. దీంతో ఇక్కడి నుంచి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఆంధ్రా నేతలకే దక్కింది. కొద్దిమంది ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టే అవకాశం వచ్చినా, ప్రస్తుతం ఆ ప్రాంతాలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లాయి. ఈ స్థానానికి 11 సార్లు ఎన్నికలు జరగగా ఐదుగురు పార్లమెంటుకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా నాలుగుసార్లు ఎన్నికై న రాధాబాయి ఆనందరావు స్వస్థలం ఖమ్మం కాగా విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. మిగిలిన వారిలో సోడే రామయ్య కొండ్రాజుపేట(వీఆర్‌ పురం), కర్రెద్దుల కమలకుమారి లక్కవరం (చింతూరు మండలం), దుంపా మేరి విజయకుమారి విశాఖపట్నం, మిడియం బాబూరావు రాజమండ్రి ప్రాంతాలకు చెందినవారు.

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటాయి. పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతం విస్తరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలకు దిగువసభలో అడుగు పెట్టే అవకాశం రాలేదు.

ఖమ్మం నుంచి..

జిల్లా పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు మహబూబాబాద్‌ (ఎస్టీ) పార్లమెంటు పరిధిలో, కొత్తగూడెం, అశ్వారావుపేట ఖమ్మం (జనరల్‌) పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఖమ్మం పార్లమెంటు స్థానానికి 17సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది మంది ఎంపీలుగా పార్లమెంటుకు వెళ్లారు. 1952, 1957లలో జరిగిన తొలి, మలి ఎన్నికల్లో టీబీ విఠల్‌రావు కమ్యూనిస్టు పార్టీల తరఫున గెలిచారు. ఆయన స్వస్థలం ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలో ఉండగా, గతంలో అవిభాజ్య హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉండేది. ఆ తర్వాత వరుసగా జలగం కొండలరావు, జలగం వెంగళరావు, పీవీ రంగయ్య నాయుడు, తమ్మినేని వీరభద్రం, నాదెండ్ల భాస్కరరావు, రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో పీవీ రంగయ్యనాయుడు, రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కరరావుల జన్మస్థలాలు ఏపీలో ఉండగా మిగిలినవారు ప్రస్తుత ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. మొత్తం తొమ్మిది మందిలో ఒక్కరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలాలు ఉన్న వారు లేరు.

మహబూబాబాద్‌లో కూడా నో చాన్స్‌..

భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గం 2008లో రద్దుకాగా ఆ స్థానంలో మహబూబాబాద్‌ కొత్తగా ఏర్పడింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా, తొలి, మలి ఎన్నికల్లో ములుగు జిల్లాకు చెందిన పోరిక బలరాంనాయక్‌, అజ్మీర సీతారాంనాయక్‌ గెలిచారు. మూడో ఎన్నికల్లో మహబూబాబాద్‌ జిల్లా మూలాలు ఉన్న మాలోత్‌ కవిత విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ముగ్గురే మూడు ప్రధాన పార్టీల తరఫున పోటీ పడుతున్నారు. దీంతో మరోసారి ఈ స్థానం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నేతలకు నిరాశే ఎదురైంది.

ఒక్కసారి కూడా..

ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్‌ స్థానాల నుంచి భద్రాద్రి జిల్లాకు చెందిన వారికి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం దక్కలేదు. గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను విజయం వరించలేదు. అయితే, ఈసారి మాత్రం ఖమ్మం నుంచి పోటీలో ఇద్దరు భద్రాద్రి జిల్లా వాసులు ఉన్నారు. జిల్లాలోని ములకలపల్లి మండలానికి చెందిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు, కొత్తగూడేనికి చెందిన బీఎస్పీ అభ్యర్థి యెర్రా కామేష్‌ పోటీలో ఉన్నారు.

Advertisement

homepage_300x250