Sakshi News home page

కమనీయం.. కల్యాణం

Published Tue, May 7 2024 3:10 AM

కమనీయం.. కల్యాణం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారి నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలుదీతీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

కనకదుర్గమ్మకు పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం ఘనంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 పుష్పాలతో అర్చన గావించారు. హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ జి.సుదర్శన్‌, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు

ముగిసిన ఓపెన్‌ టెన్త్‌,

ఇంటర్‌ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: గత నెల 25 నుంచి ప్రారంభమైన ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారంతో ముగిశాయి. జిల్లాలో పదో తరగతి అభ్యర్థులకు మూడు సెంటర్లు, ఇంటర్‌ అభ్యర్థులకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ జనరల్‌, ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

12న ఆత్మారాముడి కల్యాణం

దుమ్ముగూడెం : మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో కొలువై ఉన్న ఆత్మారామచంద్రస్వామి కల్యాణం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. కమిటీ బాధ్యులు గురువారం కరపత్రాలు విడుదల చేశారు. పవిత్ర గోదావరి నదీ తీరాన వేంచేసిఉన్న స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గోర్స అశోక్‌, గ్రామస్తులు దల్లి అప్పలరెడ్డి, కెల్లా శేఖర్‌, చిట్టిబాబు, ఆలయ అర్చకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను గతంలో విడుదల చేయగా.. ఇందులో మార్పులు చేశారు. ఈ మేరకు కొత్త టైంటేబుల్‌ను కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి గురువారం విడుదల చేశారు.రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 6, 8, 10, 16, 18, 21, 25, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 7, 9, 15, 17, 20, 22, 28, 30వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటవరకు జరగనున్నాయి. అలాగే, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్‌ 7, 11, 12, 13వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

పారదర్శకంగా

హోం ఓటింగ్‌ ప్రక్రియ

మణుగూరు రూరల్‌: హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. గురువారం మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయంలో హోమ్‌ ఓటింగ్‌పై పీఓ, ఏపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 85 సంవత్సరాలపై బడిన వృద్ధులు, దివ్యాంగులతో ఓటింగ్‌ పూర్తి చేయించాలని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని సూచించారు. అధికారులు రాఘవరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250