Sakshi News home page

adsolute video ad after first para

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

Published Thu, May 2 2024 1:35 PM

బీఆర్

● కొత్తగూడెం జిల్లా రద్దుకు కాంగ్రెస్‌ కుట్ర ● రాబోయే ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులను గెలిపించండి ● కొత్తగూడెం రోడ్‌షోలో గులాబీ దళపతి కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాను రద్దు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందాయని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కొత్తగూడెంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఒకప్పుడు చర్ల, వాజేడు, దుమ్ముగూడెం వంటి ఏజెన్సీ మండలాలు ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉండేవని, అక్కడి ప్రజలకు పరిపాలనను మరింత దగ్గరికి తెచ్చే లక్ష్యంతో కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే కొత్తగూడెంలో ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో దొంగతోపు వంటి మారుమూల పల్లెకు కూడా మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చామని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 1.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు జారీ చేయడమే కాక రైతుబంధు కూడా ఈ జిల్లాలో అందించామని చెప్పారు. కానీ ఈరోజు కొత్తగూడెం జిల్లాను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా లాభాల్లో కార్మికులకు బోనస్‌ ఇచ్చామని గుర్తు చేశారు. గిరిజనుల కోసం హైదరాబాద్‌లో బంజారా భవన్‌, కొమురంభీం భవన్‌లను తమ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. గోదావరి నీటిని ఏన్కూరు, జూలూరుపాడు వంటి ఎత్తయిన ప్రాంతాలకు అందించేందుకే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మత కలహాలు లేవన్నారు. రంజాన్‌ మాసంలో తోఫాలు అందించామని, ఇప్పుడవి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అచ్చేదిన్‌, బేటీ పడావో అంటూ చెప్పిన నరేంద్రమోదీ చివరకు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. ఈ జిల్లా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాలోతు కవితను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతామధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, రేగా కాంతారావు, మదన్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

గూడెం.. జనసంద్రం

కేసీఆర్‌ రోడ్‌షోతో కొత్తగూడెం జనసంద్రంగా మారింది. కేసీఆర్‌ రాక కోసం పట్టణ శివారు నుంచి రైల్వే స్టేషన్‌ వరకు ప్రజలు రోడ్డు పొడవునా బారులుదీరారు. సాయంత్రం ఆరు గంటల నుంచే రోడ్లపై గులాబీ దళం కదనోత్సాహం చూపించింది. రాత్రి 7:58 గంటలకు కేసీఆర్‌ ప్రసంగం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతుండగా ప్రజలు ఆసక్తిగా విన్నారు. చాలాసార్లు సభికుల ఉత్సాహాన్ని కేసీఆర్‌ కంట్రోల్‌ చేయాల్సి వచ్చింది.

గులాబీ నేతకు ఘన స్వాగతం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పార్లమెంట్‌ ఎన్నికలలో ఖమ్మం, మహబూబాబాద్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోకు జనం బ్రహ్మరథం పట్టారు. భారీ జన సందోహంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీనులు వాహనాలను దారి మళ్లించారు. పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలతో కొత్తగూడెం ప్రధాన కూడళ్లు గులాబీమయమయ్యాయి. సంప్రదా య, గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కళాకారులు ఆటపాటలతో అలరించారు. సాయంత్రం 5 గంటలకు రోడ్‌ షో ప్రారంభం కావాల్సి ఉండగా రెండున్నర గంటలు ఆలస్యమైంది.

ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశం..

కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో కేసీఆర్‌ మంగళవారం రాత్రి ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రచార సరళి ఉండాలని, బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, అమలు తీరును వివరిస్తూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ మంత్రులు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బానోత్‌ హరిప్రియ, మదన్‌లాల్‌, తాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
1/1

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

Advertisement

adsolute_video_ad

homepage_300x250