Sakshi News home page

జగదభిరాముడికి పట్టాభిషేకం

Published Fri, Apr 19 2024 4:40 AM

Bhadrachalam Sri Sitaramachandra Swamys coronation festival - Sakshi

రాజలాంఛనాలతో ప్రత్యేక పూజలు 

సామ్రాట్‌ కిరీటధారిగా స్వామివారు 

వేడుకను తిలకించి పులకించిన భక్తజనం 

ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ రాధాకృష్ణన్‌  

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన హోమం జరిపారు. 10 గంటలకు శంఖు, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తిని మేళతాళాలు, కోలాటం, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పల్లకీ సేవగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంలోని వేదికపై సింహాసనంలో కొలువుదీర్చారు.

శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించేందుకు వైదిక మంత్రాలతో వశిషు్టడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజు్ఞడులను వేద పండితులు వరింపజేసుకున్నారు. మధ్యా హ్నం 12 గంటలకు అభిజిత్‌ ముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్రకిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవా హన చేసి రాజముద్రికను కుడిచేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్‌ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు.

రామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. స్వర్ణఛత్రం నీడలో ఎడమవైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడు దర్శ నం ఇవ్వగా, తిలకించిన భక్తులు పులకించిపోయారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 

వేడుకలకు హాజరైన గవర్నర్‌ 
పట్టాభిషేక వేడుకకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమ ర్పించారు. మొదట ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందచేశారు. పట్టాభిషేకం పూర్తి కావడంతో.. ఈనెల 23 వరకు జరిగే వసంత పక్ష ప్రయుక్త తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలు ముగిశాయి.  

రామరాజ్యమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలి: గవర్నర్‌ 
రామరాజ్యం నిర్మించడమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. రామరాజ్యంలో ప్రతి ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని, తప్పులకు చోటులేదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు. సమాజంలో కుటుంబాలు మరింత ఐక్యంగా ఉండాలని, తద్వారా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎవరికీ అన్యాయం చేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Advertisement

homepage_300x250