Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

Published Tue, May 7 2024 4:15 PM

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ

నంద్యాల: సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. గురు వారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఎన్నికల నిర్వహణ, సీజర్‌ మేనేజ్‌మెంట్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర అంశాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటిని, పరిశీలన ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తింపు చిహ్నాలు ఇవ్వడం జరిగిందన్నారు. నంద్యాల పార్లమెంట్‌ బరిలో 31 మంది అభ్యర్థులు, జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో 16 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో అన్ని పోలింగ్‌ బూతులలో రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాకు అదనపు బ్యాలెట్‌ యూనిట్లు వచ్చాయని శుక్రవారం నుంచి కమి షన్‌ ఆఫ్‌ ఈవీఎంస్‌ పూర్తి చేసి సంబంధిత నియోజకవర్గాలకు చేరవేస్తామ న్నారు. ఇందుకు సంబంధించి స్ట్రాంగ్‌ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఐదు ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు

పోస్టల్‌ బ్యాలెట్‌కి సంబంధించి అత్యవసర సర్వీసులకు చెందిన 17 వేల మంది సిబ్బంది నుంచి ఫార్మ్‌– 12డి దరఖాస్తుల స్వీకరించామని కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఆళ్లగడ్డలో వైపీపీఎం గవర్నమెంట్‌ హైస్కూల్‌, నంద్యాలలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, బనగానపల్లెలో గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌, నందికొట్కూరులో జెడ్పీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌ హై స్కూల్‌, డోన్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌ గర్స్ల్‌ హైస్కూల్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ల కోసం ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సి–విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చిన 225 ఫిర్యాదులన్నిటిని పరిష్కరించామన్నారు.

జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు

Advertisement

homepage_300x250