Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

డ్రగ్స్ కేసులో షారుఖ్‌ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం

Published Fri, Apr 19 2024 3:56 PM

Shah Rukh Khan Son Aryan Khan Drugs Case NCB SIT Chief Sanjay Singh Takes VRS - Sakshi

డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్ ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తాజాగా వెలువడిన ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

2021 నుంచి ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సంజయ్ సింగ్, ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించారు.  ఒడిశా కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ IPS అధికారిగా ఆయన ప్రయాణం కొనసాగింది. 2008 నుంచి 2015 వరకు సీబీఐలో కూడా ఆయన పనిచేశారు. దేశంలోని అత్యంత క్లిష్టమైన కేసులలో ఆయన భాగమై పూర్తిచేసిన ట్రాక్‌ రికార్డ్‌ ఆయనకు ఉంది.

తన స్వచ్ఛంద పదవీ విరమణపై సంజయ్ సింగ్ మీడియాతో స్పందిస్తూ.. 'ఫిబ్రవరి 29న స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను ఆమోదించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా తెలిపింది. దాని ప్రకారం ఈరోజు నా అప్పీల్ ఆమోదించబడింది. ఏప్రిల్ 30 నా కెరీర్‌కి చివరి రోజు అని నాకు ఇప్పటికే సమాచారం వచ్చింది. గత మూడు నెలలుగా నోటీసు పరేడ్‌లో నేను రిలాక్స్‌గా ఉన్నాను. అని ఆయన చెప్పారు.

రెండేళ్ల క్రితం ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్‌సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు సుమారు 20 మందిని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్‌ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్‌లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్‌సీబీ ముందుగా ప్రకటించింది. ఆ సమయంలో షారుఖ్‌తో పాటు ఆర్యన్‌ కూడా సోషల్‌మీడియా ద్వారా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు.

అదే సమయంలో ఆర్యన్‌ ఎలాంటి తప్పు చేయలేదని  గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్‌ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. కానీ ముంబై జోన్‌లో అప్పటి ఎన్‌సీబీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఈ కేసును దర్యాప్తు చేశారు. కావాలనే కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు వాదనలు రావడంతో ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించారు.

తర్వాత ఇదే కేసును డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) సంజయ్ సింగ్‌కు అప్పగించారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్‌ కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని విచారణ కొనసాగించారు. మే 2022లో సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, ఆర్యన్ ఖాన్‌తో సహా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరుగురికి ఎన్‌సిబి క్లీన్ చిట్ ఇచ్చింది. మిగిలిన 14 మందిని నిందితులుగా గుర్తించింది. అలా సంజయ్ సింగ్ నేతృత్వంలో ఆర్యన్‌కు క్లీన్‌ చిట్‌ దక్కింది.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250