Sakshi News home page

మెరుగుపరుస్తాం

Published Tue, May 7 2024 1:45 PM

మెరుగుపరుస్తాం

వ్యవసాయం, రవాణా
● ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ● ఆసిఫాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌

ఆసిఫాబాద్‌: జిల్లాలో వ్యవసాయం, రోడ్డు రవాణా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన చిట్‌చాట్‌లో విలేకరులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల తొలగింపుపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, కొంతమంది నాయకులు అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ‘భూ కబ్జాలపై ప్రధాన పత్రికల్లో కథనాలు వచ్చినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని, భూకబ్జాదారులకు అండగా నిలుస్తారా’ అని అడిగిన ప్రశ్నకు స్పందించారు. భూ కబ్జాల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం కబ్జాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని, డీపీఆర్‌ అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్‌తో కలిసి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ భూములు భవిష్యత్తులో హెల్త్‌, ఎడ్యుకేషన్‌ హబ్స్‌ ఏర్పాటుకు, పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగపడతాయన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకే బీజేపీ 400 సీట్లు కావా లంటుందని, మనువాద సిద్ధాంతం కోసం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. జిల్లాలో వైద్యుల కొరత తీరుస్తామని హామీ ఇచ్చారు. చారిత్రక ప్రాంతాలైన జోడేఘాట్‌, శంకర్‌లొద్ది, గంగాపూర్‌, పాట్నాపూర్‌ పూలాజీబాబా, మార్లవాయితోపాటు పలు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్‌, మల్లికార్జున్‌, బాలేశ్వర్‌గౌడ్‌, అనిల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250