Sakshi News home page

వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి మృతి

Published Tue, May 7 2024 3:10 AM

వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి మృతి

శివాజీనగర: బెంగళూరు వర్సిటీ జ్ఞానభారతి క్యాంపస్‌లో పీహెచ్‌డీ చేస్తున్న ఓ విద్యార్థి అనుమానాస్ప రీతిలో చనిపోయాడు. రంగనాథ్‌ నాయక్‌ (27) చిక్కబళ్లాపురకు చెందినవారు. ఓ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం బస్సు ప్రమాదంలో రంగనాథ్‌ గాయపడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయుర్వేద ఔషధం తీసుకుంటున్నాడు. బుధవారం ఉదయం క్యాంటీన్‌కు వెళ్లి టిఫిన్‌ చేసి రూమ్‌కి వెళ్లి లాక్‌ చేసుకొన్నాడు. మధ్యాహ్నం రూమ్మేట్‌ వెళ్లి తలుపులు కొట్టగా తీయలేదు. డోర్‌ పగలగొట్టి చూడగా రంగనాథ్‌ మరణించి ఉన్నాడు. మరణానికి కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

రూ. 31 లక్షలు హాంఫట్‌

తుమకూరు జిల్లాలో సైబర్‌ మోసం

తుమకూరు: సైబర్‌ మోసగాళ్ల చేతిలో పడి అమాయకులు సర్వం కోల్పోతున్నారు. అదే రీతిలో ఎక్కువ లాభం పొందాలని ఓ వ్యక్తి రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టి వంచకుల చేతిలో నిలువునా మోసపోయాడు. ఈ సంఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా బైరనాయకనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. వినయ్‌ అనే వ్యక్తికి ఏప్రిల్‌ 14న వాట్సాప్‌కి ఇటీవల ఒక మెసేజ్‌ వచ్చింది. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పారు. ఇందుకోసం కొన్ని టాస్క్‌ల లిస్ట్‌ ఇచ్చారు. దీన్ని నమ్మిన వినయ్‌ మొదట యూపీఐ ఐడీ కోసం రూ.2 వేలు చెల్లించాడు. కొంతసేపటికి అతని బ్యాంకు ఖాతాకు రూ. 2500 తిరిగి వచ్చాయి. మీరు మరింత డబ్బును పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభం చూడవచ్చని నమ్మించారు. దీంతో దురాశకు పోయిన వినయ్‌ రూ.31 లక్షలను మోసగాళ్లు ఇచ్చిన వివిధ ఖాతాల్లోకి చెల్లించాడు. అతని ఖాతాలో 13,300 మాత్రమే తిరిగి వచ్చింది. బాధితుడు లబోదిబోమంటూ తుమకూరు సైబర్‌ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రోడ్డుపై భార్య హత్య

బనశంకరి: భార్యను భర్త చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కోరమంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని భార్య ఇందు విడిగా ఉంటోంది. గురువారం మధ్యాహ్నం 3.30 సమయంలో భార్య ఇంటికి భర్త వచ్చి ఘర్షణ పడ్డారు. రోడ్డుపైనే కత్తి తీసి పలుమార్లు పొడిచి చంపాడు.

Advertisement

homepage_300x250