Sakshi News home page

భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

Published Tue, May 7 2024 4:40 PM

భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

● భీమిలి క్రాస్‌ రోడ్డు వద్ద పట్టుకున్న పోలీసులు ● ఆరుగురి అరెస్ట్‌, ఒకరు పరారీ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ సునీల్‌

తగరపువలస : ఆనందపురం మండలం భీమిలి క్రాస్‌రోడ్డు చెక్‌ పోస్టు వద్ద గురువారం సాయంత్రం సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరుగురు వ్యక్తుల నుంచి భారీగా నకిలీ కరెన్సీతోపాటు గోల్డ్‌ కోటెడ్‌ బంగారు నాణేలు, బిస్కెట్లు, మారణాయుధాలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మధురవాడ జోన్‌ ఏసీపీ సునీల్‌, ఆనందపురం సీఐ తిరుపతిరావు వివరాలు తెలిపారు. నకిలీ కరెన్సీ అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తగరపువలస మీదుగా విశాఖ వెళ్తున్న ఒక కారు, రెండు ద్విచక్రవాహనాల కోసం క్రాస్‌రోడ్డు వద్ద కాపు కాశారు. వీరిని గమనించిన వాహనాల్లోని ఆరుగురు వ్యక్తులు... తమ వాహనాలను వెనక్కి తిప్పి పారిపోవాలని ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వీరిలో విజయనగరం ఆర్‌కే టౌన్‌షిప్‌కు చెందిన గొర్లె హేమచంద్రరావు, బాలాజీవీధికి చెందిన హరి శ్రీను, అయ్యన్నపేట కూడలికి చెందిన మంగలపుది సుబ్బారెడ్డి, దాసన్నపేటకు చెందిన దనాల శ్రీనివాస్‌, గుంకలాంకు చెందిన కునుకు హేమంత్‌కుమార్‌, పలాసకు చెందిన జన్న సునీల్‌ పట్టుబడ్డారు. సోమేష్‌ అనే వ్యక్తి పారిపోయాడు. వీరి నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.500 నకిలీ నోట్ల కట్టలు వంద, నకిలీ గోల్డ్‌ బిస్కెట్లు 24, నకిలీ గోల్డ్‌ కాయిన్లు 92, మొబైల్‌ ఫోన్లు 23, ల్యాప్‌టాప్‌ 1, సిమ్‌కార్డులు 7, పోలీస్‌ జంగిల్‌ యూనీఫారాలు, నకలీ నోట్ల బండిల్స్‌, వాటి తయారీకి వినియోగించే రసాయనాలు, వస్తువులు, రైస్‌ పుల్లింగ్‌ బౌల్‌ స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో ప్రధాన నిందితుడు గొర్లె హేమంత్‌ కుమార్‌ మిగిలిన వారిని కలుపుకుని నకిలీ కరెన్సీతోపాటు రైస్‌ పుల్లింగ్‌ చేయాలనుకున్నాడు. వీరంతా విజయనగరంలో కలుసుకుని అమెజాన్‌ ద్వారా చిల్డ్రన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ కరెన్సీతోపాటు నకిలీ గోల్డ్‌ కాయిన్లు, బిస్కెట్లు కొనుగోలు చేశారు. అలాగే ఇత్తడి షాపులో రైస్‌ పుల్లింగ్‌ పాత్ర కొనుగోలు చేసి విశాఖలో ఉన్న సోమేష్‌ అనే వ్యక్తికి ఇవ్వడానికి వెళ్తూ పట్టుబడ్డారు. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్‌ చేసి అరెస్ట్‌ చేశారు.

Advertisement

homepage_300x250