Sakshi News home page

బాబూ.. నీ నిర్వాకం చూడు

Published Tue, May 7 2024 4:40 PM

బాబూ.

● 2014–19 మధ్య కాలంలో కష్టాలను మళ్లీ గుర్తుకు తెచ్చాడు ● ఆరగ్రహం వ్యక్తం చేస్తున్న సామాజిక పింఛన్‌ లబ్ధిదారులు ● పింఛన్‌ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న వృద్ధులు ● బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్న అవ్వతాతలు ● కొన్ని చోట్ల సర్వర్లు మొరాయించడంతో అవస్థలు ● బ్యాంకు ఖాతాలు బ్లాక్‌లో ఉండటంతో చిక్కులు

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల వేళ చంద్రబాబు నయవంచక కుట్రతో మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యాయి. దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలున్న వారు, ఏ పని చేసుకోలేక ఆసరా కోసం సమాజం వైపు ఆశగా ఎదురుచూసే పండుటాకులు మళ్లీ రోడ్డున పడ్డారు. ఎటు చూసినా కన్నీటి వేదనలే కనిపిస్తున్నాయి. ఏ బ్యాంకుకు వెళ్లి చూసినా అలసిన పండుటాకుల ఆవేదనే వినిపిస్తోంది. ఈ వయసులో తమను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తావంటూ చంద్రబాబును అవ్వాతాతలు దూషిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో రాబందుల్లా పీక్కుతినే జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి ప్రతి రోజూ క్యూలో నిలబడితే తప్ప పింఛన్‌ దక్కని దుస్థితి ఉండేది. పక్షం రోజులు దాటినా పింఛన్‌ అందక విలవిల్లాడే దయనీయ పరిస్థితి, కన్నీటి వేదనలు ఏ ప్రాంతంలో చూసినా సాక్షాత్కరించేవి. ఈ పరిస్థితిని మార్చమని అవ్వాతాతలు దేవుడిని ప్రతి రోజూ కోరుకునేవారు. కాలం మారింది.. పాలనా మారింది. అవ్వాతాతలకు అండగా నిలుస్తూ వారి మోముల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చిరునవ్వులు నింపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థతో ఇంటి వద్దే పింఛన్‌ అందజేస్తూ.. వారికి కొండంత భరోసానిచ్చారు. అయితే ఎన్నికల వేళ చంద్రబాబు కుటిల రాజకీయాలతో వృద్ధులు మళ్లీ పడ రాని పాట్లు పడుతున్నారు. వృద్ధులంతా పింఛన్‌ డబ్బుల కోసం ఒకేసారి బ్యాంకులకు రావడంతో చాలా చోట్ల సర్వర్లు పనిచేయకపోవడంతో సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. మరోవైపు బ్యాంకు ఖాతాలు కొందరికి ఉన్నా.. అవి చాలా ఏళ్లుగా లావాదేవీలు జరపని కారణంగా ఫ్రీజ్‌ అయిపోయాయి. అందులో పింఛను డబ్బులు పడటంతో రెన్యువల్‌ కోసం చార్జీలు కట్‌ అవుతున్నాయి. దీంతో కొందరికి కేవలం రూ.100 నుంచి రూ.1000 లోపు మాత్రమే పింఛన్‌ అందుతోంది. ఇంకొన్ని చోట్ల పింఛన్‌దారులు దోపిడీకి గురవుతున్నారు. పింఛన్‌దారుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడం వల్ల విత్‌డ్రా ఫారం నింపడానికి రూ.20 మొదలు తమ గ్రామం నుంచి ఆటో చార్జీలకు రూ.100 నుంచి రూ.200 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎక్కువ మంది వృద్ధులు ఎండ దెబ్బకు తాళలేక సొమ్మసిల్లిపోతున్నారు. ఈ వయసులో ఇలాంటి దుస్థితికి కారణమైన చంద్రబాబును ఎప్పటికీ క్షమించబోమంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కిందట కష్టాలను మళ్లీ తెచ్చావంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

95.77 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో రెండు రోజుల సమయంలో బ్యాంకుల ద్వారా 95.77 శాతం, డోర్‌ టు డోర్‌ ద్వారా 95.21 శాతం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేసింది. బ్యాంకు ఖాతాలున్న 1,22,289 మంది పింఛనుదారులకు గానూ ఇప్పటి వరకూ 1,17,116 మంది ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. 42,621 మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో ఇంటికి వెళ్లి పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 40,595 మందికి అందించారు. చంద్రబాబు అండ్‌ కో ఎన్ని విధాలుగా పింఛన్‌ అందించకుండా కుయుక్తులు పన్నుతున్నా.. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులకు చేరవేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. మండుటెండలో బ్యాంకులకు వెళ్లలేక.. వెళ్లినా డబ్బులను ఖాతాల నుంచి తీసుకోలేక అవ్వా తాతలు నరకయాతన అనుభవిస్తున్నారు.

బాబూ.. నీ నిర్వాకం చూడు
1/2

బాబూ.. నీ నిర్వాకం చూడు

బాబూ.. నీ నిర్వాకం చూడు
2/2

బాబూ.. నీ నిర్వాకం చూడు

Advertisement

homepage_300x250