Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వీడో సూడో!

Published Mon, Apr 15 2024 6:50 AM

- - Sakshi

సాయుధ బలగాల్లోకి ప్రవేశయత్నం విఫలం

పోలీసు కాలేకపోవడంతో ఎస్సైగా అవతారం

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.11 లక్షల స్వాహా

అరెస్టు చేసిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్: సాయుధ బలగాల్లో ప్రవేశించాలనే ప్రయత్నం శిక్షణ స్థాయిలోనే విఫలం కావడం... పోలీసు ఉద్యోగానికి ఎంపిక కాకపోవడం... యూనిఫాంపై మక్కువ తీరకపోవడం... వెరసి ఓ వ్యక్తిని సూడో పోలీసుగా మార్చింది. నకిలీ ఎస్సై అవతారం ఎత్తిన అతగాడు పోలీసు విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి రూ.లక్షల్లో కాజేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ ఎస్‌.రష్మి పెరుమాల్‌ ఆదివారం వెల్లడించారు. వనపర్తి జిల్లా దొంతికుంట తండాకు చెందిన కడావత్‌ సోమ్లానాయక్‌ బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. నగరంలోని ఓ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడు. సోల్జర్‌గా (జనరల్‌ డ్యూటీ) ఎంపికై ఆరు నెలలపాటు శిక్షణ కూడా తీసుకున్నాడు.

తర్వాత అనివార్య కారణాల నేపథ్యంలో శిక్షణ కేంద్రం నుంచి పారిపోయి వచ్చేశాడు. ఆ తర్వాత 2004లో అస్సోం రైఫిల్స్‌ విభాగంలోనూ సోల్జర్‌గా ఎంపికయ్యాడు. అయితే శిక్షణ పూర్తి కాకుండానే అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చేశాడు. నగరానికి తిరిగి వచ్చిన సోమ్లానాయక్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఎంపిక కాలేదు. దీంతో బతుకుదెరువు కోసం కారు డ్రైవర్‌గా మారాడు. అయితే పోలీసు యూనిఫాంపై మక్కువతో 2012లో సూడో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ అవతారం ఎత్తాడు. స్వగ్రామంతోపాటు మరికొన్ని చోట్ల జరిగే కార్యక్రమాలు, శుభకార్యాలకు ఇతడు ఎస్సై లేదా కానిస్టేబుల్‌ యూనిఫాంలోనే వెళ్లేవాడు. ఇలా అందరూ తాను పోలీసు అని నమ్మేలా చేశాడు.

ఆపై తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి అదే విభాగంలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఈవిధంగా బంజారాహిల్స్‌కు చెందిన గౌరీశంకర్‌తోపాటు మరికొందరి నుంచి రూ.11 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. గౌరీశంకర్‌ ఫిర్యాదుతో మాసబ్‌ట్యాంక్‌ ఠాణాలో సోమ్లానాయక్‌పై కేసు నమోదైంది. అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.నాగార్జున తన బృందంతో వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. ఇతడి నుంచి ఫోను, ద్విచక్ర వాహనం, పోలీసు యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మాసబ్‌ట్యాంక్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250