Sakshi News home page

నామినేషన్ల దాఖలు ఇలా

Published Thu, Apr 18 2024 10:55 AM

- - Sakshi

సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్‌సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్‌ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

● అభ్యర్థులు నామినేషన్‌ ఫారం–2ఎను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు.

● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు.

● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్‌ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్‌ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్‌ను ప్రతిపాదించాల్సి ఉంది.

● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో అఫిడవిట్‌పై అతికించాలి.

● నామినేషన్‌ పత్రంపై స్టాంప్‌ సైజు ఫొటో అతికించాల్సి ఉంది.

● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈఆర్‌ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది.

● రిజస్టర్‌/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ ఫారంలోని పార్ట్‌ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది.

● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతా తెరవాల్సి ఉంది.

● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది.

● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి.

శుభ ముహూర్తాలు ఇవే..

● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు.

● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు.

● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది.

జాతకాలతో ముందుకు...

● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్‌ వేసే చాన్స్‌ ఉంది.

● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా

నేడే లోక్‌సభ ఎలక్షన్‌ నోటిఫికేషన్‌..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ

18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు

నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు

లోక్‌సభ స్థానం రిటర్నింగ్‌ సెంటర్‌

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఆఫీసు, లక్డీకాపూల్‌

సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌

ఆఫీసు (సికింద్రాబాద్‌)

మల్కాజ్‌గిరి మేడ్చల్‌ కలెక్టరేట్‌

చేవెళ్ల తహసీల్దార్‌ ఆఫీసు, రాజేంద్రనగర్‌

● ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ

● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ

● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు.

● ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన

● ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల

● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

● జూన్‌ 6న ఎన్నికల ప్రకియ ముగింపు

చేవెళ్ల లోక్‌సభ స్థానం

పార్టీ అభ్యరి నామినేషన్‌ తేదీ

బీజేపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 22

బీఆర్‌ఎస్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ 19

కాంగ్రెస్‌ గడ్డం రంజిత్‌రెడ్డి 25

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం

బీజేపీ మాధవీలత 24

బీఆర్‌ఎస్‌ జి.శ్రీనివాస్‌యాదవ్‌ 22

ఎంఐఎం అసదుద్దీన్‌ ఓవైసీ 19

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం

పార్టీ అభ్యరి నామినేషన్‌ తేదీ

బీజేపీ జి.కిషన్‌రెడ్డి ఏప్రిల్‌ 19

బీఆర్‌ఎస్‌ పద్మారావుగౌడ్‌ 19

కాంగ్రెస్‌ దానం నాగేందర్‌ 24

మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం

బీజేపీ ఈటల రాజేందర్‌ 18

బీఆర్‌ఎస్‌ రాగిడి లక్ష్మారెడ్డి 22

కాంగ్రెస్‌ పట్నం సునీతారెడ్డి 22

కంటోన్మెంట్‌లోనూ...

కంటోన్మెంట్‌: లోక్‌సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి మధుకర్‌ నాయక్‌ తెలిపారు. కంటోన్మెంట్‌లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్‌ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది.

1/1

Advertisement

homepage_300x250