Sakshi News home page

డోర్‌ నెంబర్లూ డొల్లే !

Published Thu, Apr 18 2024 10:55 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్‌నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్‌నెంబర్‌తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్‌నెంబర్‌తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్‌ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్‌ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్‌లైన్‌లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్‌ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఒకే కుటుంబం...పోలింగ్‌ కేంద్రాలెన్నో !

సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్‌ స్లిప్‌ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్‌ కేంద్రం, భార్యకు మరో పోలింగ్‌ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్‌ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్‌ ఒకటే అయినా వారి పోలింగ్‌ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్‌ బూత్‌దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్‌ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్‌ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్‌ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు.

డూప్లికేట్‌ ఔట్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్‌ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్‌ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా డూప్లికేట్‌ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్‌గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు.

సాగర్‌లో ‘పంపింగ్‌’ ట్రయల్‌ రన్‌ షురూ..

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్‌ జలాశయంలో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్‌ కోసం జలమండలి ట్రయల్‌రన్‌ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్‌ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్‌ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసి పంప్‌హౌస్‌, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్‌ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్‌ కోసం జలాశయంలో జీరో పాయింట్‌ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్‌ రన్‌ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది.

నగర ఓటరు జాబితాలో వింతలెన్నో

రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం

నగరంలో అయోమయ పరిస్థితి

పోలింగ్‌ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం

రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్‌ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు

హైదరాబాద్‌ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు

మరణించిన వారు

47,141

చిరునామా మారిన వారు

4,39,801

డూప్లికేట్లు

54,259

5,41,201

మొత్తం

1/2

2/2

Advertisement

homepage_300x250