Sakshi News home page

టీడీపీ విందు రాజకీయం

Published Tue, May 7 2024 8:00 PM

టీడీపీ విందు రాజకీయం

సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న టీడీపీ అభ్యర్థులు అడ్డదారులూ తొక్కుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆత్మీయ సమావేశాల పేరుతో డబ్బులు, గిఫ్ట్‌లతో ప్రలోభ పెడుతున్నారు. ఆత్మీయ సమావేశాల పేరుతో విందు ఇచ్చి, కూపన్లు పంపిణీ చేస్తున్నారు. అనంతరం ఆ కూపన్లు తీసుకొని ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున నగదు, స్వీట్‌ బాక్స్‌ అందిస్తున్నారు. పట్టణంలోని కాకతీయ కల్యాణ మండపంలో గురువారం ఆర్‌ఎంపీలు, పీఎంపీల ఆత్మీయ సమావేశంను స్వతంత్ర ల్యాబ్‌ నిర్వాహకుడు బాషా, రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆర్‌ఎంపీ హనుమంతురావు, పాత బస్టాండ్‌లోని ఆర్‌ఎంపీ బాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి 300 మందికి పైగా హాజరయ్యారు. స్వతంత్ర ల్యాబ్‌ పేరుతో ముద్రించిన కూపన్లు పంపిణీ చేశారు. అనంతరం వారందరికీ విందు ఇచ్చారు. ఆ కూపన్‌లు తీసుకొని ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున నగదు, ఒక స్వీట్‌ బాక్స్‌ పంపిణీ చేసి టీడీపీకి ఓటు వేయాలని, వైద్యం నిమిత్తం వచ్చే రోగులను కూడా ప్రభావితం చేయా లని సూచించారు. సమావేశానికి ముందు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వచ్చి కొద్దిసేపు చూసి చూడనట్లుగా వ్యవహరించి, సరిగ్గా డబ్బు, స్వీట్‌ బాక్స్‌లు పంపిణీ చేసే క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బిల్లులు లేని కాంగ్రెస్‌

ప్రచార సామగ్రి స్వాధీనం

పట్నంబజారు: ఎటువంటి బిల్లులు లేకుండా ట్రావెల్స్‌లో వచ్చిన పార్టీ జెండాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదైంది. కొత్తపేట పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు కావేరి ట్రావెల్స్‌ బస్సులో గురువారం తొమ్మిది గోతాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన జెండాలు, టోపీలు, కీచైన్‌లు తదితరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఎటువంటి బిల్లులు లేకపోవడం గమనించిన అధికారులు వాటిని సీజ్‌ చేశారు. ఎఫ్‌ఎస్‌టీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోతాల్లో ఉన్న సామగ్రి విలువ రూ.60,500 ఉంటుందని తెలిపారు.

Advertisement

homepage_300x250