Sakshi News home page

పశ్చిమలో మాదిగలందరి మద్దతు రజినమ్మకే

Published Tue, May 7 2024 8:00 PM

పశ్చిమలో మాదిగలందరి మద్దతు రజినమ్మకే

పట్నంబజారు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాదిగలందరి మద్దతు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విడదల రజినీకే అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి అత్తోట జోసఫ్‌ స్పష్టం చేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్‌లోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం మాదిగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తోట జోసఫ్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూడా గుంటూరు నగరంలోని మాదిగల్లో 70 శాతం వైఎస్సార్‌ సీపీకే ఓటు వేశారని తెలిపారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఏకంగా 95 శాతానికి పైగా మాదిగ సామాజికవర్గం ప్రయోజనం పొందిందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తాము మాదిగ కురుక్షేత్ర మహా సభ పెడితే తమపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. జగనన్న సీఎం అయ్యాక ఆ కేసులు ఎత్తివేశారని తెలిపారు. చంద్రబాబు మళ్లీ మాదిగ సామాజిక వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తానని చెప్పడం మరో మోసపు వాగ్దానమని ఎండగట్టారు. మంత్రి రజిని చిలకలూరిపేటలో ఎస్సీలకు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి ఇచ్చి, గౌరవించారని గుర్తుచేశారు.

ట్రక్కు డ్రైవర్‌, కూలీకి ఎమ్మెల్యే టికెట్లు

మాదిగ లాయర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పుసులూరి జీవరత్నం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అతి సామాన్యులైన ట్రక్కు డ్రైవర్‌, ఒక ఉపాధి హామీ పథకం కూలీకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగనన్నదేనన్నారు. మాదిగ జాతిని చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని మంద కృష్ణ మాదిగ చూస్తున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణ విషయం కోర్టులో ఉన్నందున, ఎవరెన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా నమ్మవద్దని తెలిపారు. గుంటూరు పశ్చిమలో మంత్రి విడదల రజినిని కచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కో–కన్వీనర్‌ డొక్కా జార్జి, లీగల్‌ సెల్‌ నాయకుడు పచ్చల విజయానంద్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి అచ్చిబాబు, మార్కెట్‌ యార్డు డైరెక్టర్లు గుంజర ప్రభు, దర్శనపు బెంజిమన్‌, నాయకులు రవికుమార్‌, రూబెన్‌, ఎస్సీ నేతలు జాబాబు, లూర్దురాజు, స్వామి పాల్గొన్నారు.

మద్దతు ప్రకటించిన

మాదిగ సంఘాల ఐక్య వేదిక

Advertisement

homepage_300x250