Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్‌ గిటార్‌తో..

Published Fri, Apr 12 2024 9:22 AM

Mohini Dey: Started Career As A Bass Guitarist - Sakshi

పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్‌ గిటారిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్‌ డే బాస్‌ గిటార్‌ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్‌ గిటార్‌తో మోహిని ఫ్రెండ్‌షిప్‌ మొదలైంది.

జాజ్‌ ఫ్యూజన్‌ గిటారిస్ట్‌గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్‌ ఆ తరువాత జాజ్‌కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్‌కత్తా  నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్‌ ఆర్టిస్ట్‌గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్‌ తొలి మ్యూజిక్‌ టీచర్‌. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని.

పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్‌ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్‌ ప్రాక్టిస్‌ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్‌ అంకుల్‌ నుంచి కాల్‌ వచ్చింది, బ్యాగ్‌ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్‌కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్‌ హుస్సేన్‌ను, ఫిల్మ్‌స్టార్స్‌ను చూశాను. రంజిత్‌ అంకుల్‌ నన్ను జాకీర్‌ అంకుల్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్‌ గిటార్‌ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్‌ మెమోరీలోకి వెళుతుంది మోహిని.

తండ్రి సుజయ్‌ బాస్‌ గిటారిస్ట్‌. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్‌ వుటెన్‌ నుంచి మార్కస్‌ మిల్లర్‌ వరకు ఎంతో మంది గిటారిస్ట్‌ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్‌కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్‌ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది.

‘రకరకాల స్టైల్స్‌నుప్రాక్టిస్‌ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని.

‘ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్‌ స్కూల్‌ స్టార్ట్‌ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్‌ మ్యూజిక్‌ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్‌ అందించాలనుకుంటున్నాను’

తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల..
తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్‌ గిటార్‌తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్‌ గిటార్‌పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే

ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్‌ జెండర్‌ గ్యాప్‌ను కోడింగ్‌ చేసింది!

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250