Sakshi News home page

జిల్లాలో 16,571 పోస్టల్‌ బ్యాలెట్లు

Published Tue, May 7 2024 1:05 PM

జిల్లాలో 16,571 పోస్టల్‌ బ్యాలెట్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 16,571 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ బ్యాలెట్‌ అందిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులందరూ ఈ నెల 5,6 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ముందస్తుగా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిర్దేశిత తేదీల్లో ఆయా సెంటర్లలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను నేరుగా పరిశీలించి పోస్టల్‌బ్యాలెట్‌ ఇచ్చి అప్పటికప్పుడే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఆయా నియోజకవర్గాల్లో, ఇతర జిల్లాల ఉద్యోగులు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ భవనం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చన్నారు. ఈ నెల 5 న పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్‌లు, 6వ తేదీన అత్యవసరశాఖల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్‌ 26వ తేదీలోపు పోస్టల్‌బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోలేని ఉద్యోగులు ఈ నెల 5,6 తేదీల్లో నేరుగా సంబంధిత ధ్రువీకరణపత్రాలు చూపించి ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే సమయంలో తమ వెంట ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ, ఎన్నికల విధులకు సంబంధించి ఉత్తర్వులు తీసుకెళ్లాలని సూచించారు. హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 566 మందికి ఈ నెల 6,7 తేదీల్లో ఇంటి వద్దకే ఓటు వేయించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 3,380 మంది సర్వీసు ఓటర్లు తమకు అందిన పోస్టల్‌ బ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ పోస్టల్‌ బ్యాలెట్‌ ను సంబందిత ఆర్‌ఓ కార్యాలయాలకు ఈ నెల 10వ తేదీలోపు చేరేలా పోస్టులో పంపాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఓటర్‌ స్లిప్‌ల పంపిణీని ఈ నెల 6వ తేదీలోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.2.63 కోట్ల నగదు సీజ్‌ చేశామని తెలిపారు. సరైన ఆధారాలు చూపిన వారికి నగదు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు. సమా వేశంలో చిత్తూరు అసెంబ్లీ ఆర్‌ఓ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్‌ హిమవంశీ, డీఆర్‌ఓ పుల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250