Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు

Published Wed, Apr 24 2024 5:48 AM

Petitions seeking annulment of Kadapa court orders - Sakshi

హైకోర్టులో దాఖలు చేసిన బీటెక్‌ రవి, నర్రెడ్డి సునీత

విచారణ నేటికి వాయిదా

విచారణ నుంచి తప్పుకుంటామని మౌఖికంగా వెల్లడించిన జస్టిస్‌ శేషసాయి ధర్మాసనం

సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్‌ రవి తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం  మౌఖికంగా తెలిపింది. 

‘మా వాదన వినలేదు’
కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్‌ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు  సూట్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున  దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు  చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్‌ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250